ఉభయగోదావరి జిల్లాలలోని రోడ్లపై ఐదు గంటల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాలి
ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు
గేదెల పేరిట 2, 600 కోట్ల రూపాయలు గుటకాయ స్వాహా
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరగడం మాని, రోడ్లపై ప్రయాణం చేస్తే… గతుకులమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనకు కూడా తెలుస్తాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ రోడ్లన్నీ గతుకుల మయంగా మారాయి. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగనన్న రాజ్యంలో ప్రజలు చాలా దరిద్రాన్ని, దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగితే, అదనంగా ఖర్చయ్యే పెట్రోల్, డీజిల్ భారాన్ని వాహనదారులు మోయలేక పోతున్నారన్నారు. జగనన్న మద్యం దెబ్బకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు బాగున్నారని నేను సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో చెబితే, ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి… కేవలం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు మాత్రమే కాదు, ఇంకా కొన్ని రంగాలకు చెందిన వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.
ఆటోమొబైల్ మెకానికులు కూడా జగనన్న రాజ్యంలో సుఖంగానే ఉన్నారట. గతంలో చిన్న ఇల్లు ఉన్నవారు ఇప్పుడు డాబా కట్టుకుంటే, దాబా ఉన్నవారు అదనంగా మరొక అంతస్తును వేసుకున్నారన్నారు. జగనన్నే అధికారంలో ఉండాలని, జగనన్నే మళ్లీ అధికారంలోకి రావాలని ఆటోమొబైల్ మెకానికులు కోరుకుంటున్నట్లు తెలిసిందన్నారు. గతుకుల మయమైన రోడ్లలో గోతుల్లో పడి వాహనాలు చాలా దారుణంగా డ్యామేజ్ అవుతున్నాయి. అలాగే ఉభయగోదావరి జిల్లాలలో ఫిష్ ఫీడ్ తీసుకువచ్చే లారీల కూడా కమాన్ కట్టలు విరిగిపోతున్నాయి. రోడ్లు ఇలాగే ఉండాలని ఆటోమొబైల్ మెకానికులు కోరుకుంటున్నారు.
నా మిత్రుడు ఒకరు లెక్సస్ అనే ఖరీదైన వాహనాన్ని 80 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగడంతో, సొంత ఊరుకు తన ఖరీదైన కారుకు వెళ్ళాడు. సొంత ఊరుకు వెళ్తుంటే గతుకులమయమైన రోడ్డుతో తన ఖరీదైన వాహనం టైర్ పగిలింది . ఆవాహనం టైర్ పగిలే అవకాశం లేదని, ఉత్పత్తిదారులు స్టెప్నీ టైర్ కూడా ఇవ్వలేదు.
దీనితో చేసేది లేక తన వాహనాన్ని లారీలో హైదరాబాదుకు నా మిత్రుడు తెప్పించుకున్నాడు. టైర్ ఎలా పగిలిందో తెలియక ఉత్పత్తిదారులు తికమక పడి తల బద్దలు కొట్టుకున్నారట. చివరకు ఉచితంగానే టైర్ ను అందజేసినట్లు తెలిసింది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో టైర్లు గతుకులమయమైన రోడ్లలో పడి పగిలిపోతున్నాయి. జమోరె రాజ్యంలో టైర్ల ఉత్పత్తిదారులు కూడాబాగానే ఉన్నారు.
జగనన్న మద్యం సేవించి, బుర్రకు సంబంధించిన రుగ్మతలతో సైకాలజిస్ట్ లను సంప్రదిస్తుండడం వల్ల వారు కూడా బాగానే ఉన్నారు. రాష్ట్రంలో సైకాలజిస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో, నాసిరకం మద్యం సేవించి ఇబ్బంది పడుతున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. బందర్లో గోస్వామి అనే వ్యక్తి నడుములకు పట్టిలను బాగా కడతారని తెలిసింది. ఆయన వద్దకు గతంలో ఓ 10 నుంచి 15 మంది ప్రతిరోజు వెళ్లే వారని, ప్రస్తుతం ఆయనకు వద్దకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలోనే ప్రజలు క్యూ కడుతున్నారు. గోస్వామి లాంటి నడుముకు పట్టీలు వేసేవారు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, నడుమునొప్పి మందులకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉంది.
రోడ్లపైనున్న గుంతల్లో పడి ఎంతోమంది క్షతగాత్రులు కావడం, మరి కొంతమంది మృత్యువాత పడడం నిత్య కృత్యంగా మారిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో రాపాక వరప్రసాద్ తో పాటు పాల్గొన్న, చిట్టిబాబు అనే వ్యక్తి గుంతలో పడి గాయపడితే ఆయన్ని రాపాక వరప్రసాద్ ఆసుపత్రిలో చేర్పించి దగ్గరుండి చికిత్స చేయించారు. రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులంతా గతుకుల మయమైన రోడ్లపై ప్రమాదానికి గురవుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం రోడ్లపైనున్న గుంతల్లో పడరు. రైలు ప్రమాదం జరిగిన, నీటి ప్రమాదాలు జరిగిన, మూడు కిలోమీటర్ల దూరనికైనా ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తుంటారు. గాలి తిరుగుళ్ళు మాత్రమే తిరిగే జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి రోడ్డుపై ప్రయాణించాలి.
సామాన్యుల మాదిరిగానే నాలుగు నుంచి ఐదు గంటల పాటు రోడ్డు మార్గాన ప్రయాణించాలని నర్సాపురం నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్ర రహదారులపై తిరిగితే, ఆయనకు గతుకుల మయమైన రోడ్ల దుస్థితి తెలుస్తుందని అన్నారు. కార్లలో, ఆర్టీసీ బస్సులలో తిరిగేవారికి నడుముల నొప్పులు తప్పడం లేదు. ఒక విధంగా దీనిని జగనన్న కుటుంబ నియంత్రణ పథకం అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే, కనీసం పట్టించుకునే నాధుడు లేరని విమర్శించారు. రోడ్లు ఇలా ఉంటే ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తామని ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్ల దుస్థితికి అద్ధం పట్టే విధంగా ఈనాడు దినపత్రికలో కార్టూన్ ను ప్రచురించారు. జగనే కావాలి… మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని మీ దగ్గరకు వస్తున్న అధికారులను, సిగ్గులేని ప్రజాప్రతినిధులను, రోడ్ల దుస్థితిపై ప్రజలు నిలదీయాలని కోరారు. రోడ్ల దుస్థితిపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు జగనన్నే ఎందుకు కావాలని అంటూ వచ్చే వారిని చెప్పుతో కొట్టడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి అధ్వానమైన రోడ్లు ఉన్నందుకు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలా? అంటూ ప్రశ్నించారు.
ప్రజలు పడుతున్న నాలుగున్నర ఏళ్ల నరకాన్ని ఒక పేజీలో చక్కగా చెప్పిన వర్మ
రాష్ట్రంలోని ప్రజలు నాలుగున్నర ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పడుతున్న నరకప్రాయమైన కష్టాల గురించి పెన్మత్స రవి ప్రకాష్ అశోక్ వర్మ అనే వ్యక్తి చక్కగా వివరించారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఈ ఆర్టికల్ ను రఘురామకృష్ణంరాజు చదివి వినిపించారు. లక్షలాదిమందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన పాపానికి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారని మండిపడ్డారు.
రాష్ట్రంలో గేదెల పేరిట 2600 కోట్ల రూపాయలను గుటకాయ స్వాహా చేశారు. బీహార్ లో 50 నుంచి 60 కోట్ల దాన కుంభకోణంలో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.. ఒక గేద కొని 50 గేదలు కొన్నట్లుగా, వేల గేదలనుకొని లక్షల్లో కొనుగోలు చేసినట్టుగా తప్పుడు రికార్డులను చూపించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన, ఒక ఎంపీ ని ఉద్దేశించి బూతు పదజాలాన్ని ఉపయోగించిన ముసి ముసిగా వంకర నవ్వులు నవ్వుతూ ఆనందించేది ఎవరో ప్రజలందరికీ తెలుసు.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పరిస్థితి అయ్యా ఎస్ అన్నట్టుగా ఉంది.. ఇదే విషయాన్ని డిఓపిటి కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి దృష్టికి నేను కూడా తీసుకు వెళ్లాను. కొంతమంది పోలీసు అధికారులు ఎంపీ ని కూడా చంపి వేయమంటే, చంపివేసేలా ఉన్నారు. ఒక పేజీలో నాలుగున్నర ఏళ్లుగా జరుగుతున్న నరమేధాన్ని, ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని స్పష్టంగా చెప్పిన పి ఆర్ ఏ వర్మకు ధన్యవాదాలని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
వాస్తవాన్ని ప్రతిబింబించిన భార్యాభర్తల సంభాషణ
భార్యాభర్తల మధ్య జరిగిన సంవాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. భార్య, తన భర్తతో నాకు వచ్చే అమ్మ ఒడి డబ్బులు తో నువ్వు మద్యం తాగుతున్నావని ప్రశ్నించగా, నా వల్లనే నీకు అమ్మబడి వస్తుందని భర్త సమాధానం ఇవ్వడం ఎంతో సహజంగా ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా లభించే ఆదాయాన్ని తాకట్టుపెట్టి జగన్మోహన్ రెడ్డి 25 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. మద్యం ద్వారా లభిస్తున్న ఆదాయం తోనే రాష్ట్రంలో అమ్మ ఒడితో పాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రభుత్వం జీవోలో కూడా వెల్లడించింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆపమని ప్రతిపక్షాలు, మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఫిర్యాదులు చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాల అమలుకు మద్యం ఆదాయమే ముఖ్యమని స్వయంగా జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు.. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు నూటికి నూరుపాళ్ళ నిజమని అన్నారు.
హైకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టులో విచారణకు రానుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గతవారం లో విచారణకు రాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని ఈనెల 21 వ తేదీ కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే, న్యాయమూర్తి మాత్రం ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు.
రేపు కోర్టులో విచారణ జరిగి వాదనలు పూర్తవుతాయా?, లేకపోతే మరుసటి రోజుకు వాయిదా పడతాయా అన్నది వేచి చూడాలి. అలాగే సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్ట్ పిటిషన్ క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ప్రకారం కొట్టివేస్తారనే ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.