రోడ్డు తవ్వి కంకర ఎత్తుకెళ్లడం దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? అది ప్రభుత్వ పనేనన్నది అందరి అనుమానం గెలిచిన తర్వాత నమ్మక ద్రోహం చేయటం భావ్యమా? రాష్ట్ర రాజధాని ఏమిటో చెప్పుకోలేని అనాధలయ్యారు. ‘‘పెయిడ్ ఆర్టిస్టులు’’ ఇంత కాలం ఉద్యమం చేయలేరని మీకు అర్ధం అయి ఉంటుంది. అధికార వికేంద్రీకరణ అంటే మూడు అంచెలలో స్థానిక స్వపరిపాలనను అందించడం మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకునే ‘‘అధికార వికేంద్రీకరణ’’ చేస్తున్నారు. మీ ‘మూడుముక్కలాట’ అసలు రూపం నేడు స్పష్టమైంది. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రౌడీషీటర్లు పెరిగిపోయారు. మీ ఆఫీసు పెట్టుకోవడానికి ఉత్తరాంధ్రను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రమాద ఘంటికలను గమనించి ప్రజాహితంగా పాలించండి. ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఘాటు లేఖ
గత మూడున్నరేళ్లుగా ఏపీలో చతికిలబడ్డ అభివృద్ధిపై ఆవేదన వ్యక్తం చేస్తూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఏపీ సీఎం జగన్‌కు ఘాటు లేఖాస్త్రం సంధించారు. పాలనావైఫల్యాలను ఏకరవు పెట్టారు. నేలవిడిచి సాము చేస్తున్న జగన్ పాలనాపద్ధతులను తన లేఖలో తూర్పారపట్టారు. అమరావతిని చంపేందుకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతోపాటు, అమరావతి రైతులపై మంత్రులు-ఎమ్మల్యేలు-వైసీపీ నేతలు చేస్తున్న ర్యాగింగ్‌తో సాధించే ఆనందమేమిటని సూటిగా నిలదీశారు. మీరు సీఎం అయ్యాక విశాఖలో రౌడీషీటర్లతోపాటు, హత్యలు, భూకబ్జాలు తారమతంపరగా పెరిగాయని గుర్తు చేశారు. మూడురాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడుతున్న మీరు.. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు చేసిందేమిటని ముఖ్యమంత్రిపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. సత్యకుమార్ లేఖ ఇదీ..
మన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అధ్వాన్న పరిస్థితి, తద్వారా అంధకారమవుతున్న ప్రజల భవిత పట్ల తీవ్రమైన ఆందోళనతో మీకు లేఖ రాస్తున్నాను. రాష్ట్రం పట్ల, ప్రజల పైన మీకే మాత్రం గౌరవం, బాద్యత ఉన్నా ఈలేఖ సారంశాన్ని, స్పూర్తిని గ్రహించి తగు విధంగా స్పందిస్తారని, తీవ్రమైన ఆందోళనలో ఉన్న ప్రజల తరపున ఆశిస్తున్నాను.
మీరు అధికారంలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్లు పూర్తి కావొస్తున్నది. ఈ మూడున్నరేళ్లలో మనం ఏం చేశాం, ఎటువంటి పాలన అందించాం, ఎన్ని హామీలు పూర్తి చేశాం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామా.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామా లేదా?? అసలు పాలనపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయమిది.
మీ మానసిక ప్రవృత్తి, ఒంటెద్దు పోకడలు, అనాలోచిత అస్తవ్యస్త పరిపాలనా పర్యావసానంగా… నేడు కనీసం రాష్ట్ర రాజధాని ఏమిటో చెప్పుకోలేని అనాధలయ్యారు ప్రజలు. ఏ రాష్ట్రానికైనా జీవనచైతన్యంతో కూడిన రాజధాని సత్పరిపాలనతో అభివృద్దికి ప్రధాన చోదకంగా ఉంటుంది. మీరు అది లేకుండా చేశారు. దీనితో మీకు రాష్ట్రాభివృద్ది పట్ల సరైన అవగాహన, చిత్తశుద్ది లేదని వెల్లడైంది. ఈ వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర నైరాశ్యానికి గురి చేస్తోంది. ప్రజల భవిష్యత్తు అంధకారబంధురమైంది.
అసత్యాలు, అక్రమాలు, అప్పులు, అత్యాచారాలు, అరాచకాలు, ఆక్రమణలకు పరాకాష్టగా మారింది. రాష్ట్రంలో పాలన, ప్రజల రాజధాని గుంతల మయమైంది. తత్ఫలితంగా జీవన గమనాన్ని నడిపించే ‘ఆశ’ చనిపోతోంది. ప్రజల్లో భవిత పట్ల ఆశ, నమ్మకం ఆవిరైనప్పుడు ప్రజాధనం నిర్వీర్యమై, జాతి తిరోగమన పధంలో పయనిస్తుంది. మన రాష్ట్రంలో నెలకొన్న ఈ బాధాకర పరిస్థితులు, పరిణామాలకు కేవలం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. హెచ్చరికతో కూడిన వర్తమానాన్ని మీ దృష్టికి తేవటం ఈలేఖ ముఖ్య ఉద్దేశ్యం.
మిగిలిన విషయాలను పక్కన పెడితే అమరావతి నుంచి అరసవెల్లి వరకూ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల విషయమే తీసుకుంటే.. మీరు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. వెయ్యి రోజులకు పైగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను, ఒక్క సారి కూడా పిలిచి మాట్లాడాలని మీరు అనుకోకపోవడమే, ప్రస్తుతం ఆ సమస్య వట వృక్షంలా పెరిగిపోవడానికి కారణం. మీరే కనుక వారిని పిలిచి మాట్లాడి ఉన్నట్లయితే ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. మీరు అలా చేయకుండా ప్రతిదాడి చేయడమే ఆది నుంచి పనిగా పెట్టుకున్నారు.
అందుకోసం మీరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. కోర్టు తీర్పు స్పష్టంగా వచ్చిన తర్వాత కూడా, మీరు మీ మొండివైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అమరావతి రైతుల మహాపాదయాత్రపై మీరు అనుసరిస్తున్న వైఖరిని ఎవరూ హర్షించడం లేదు. పాదయాత్ర చేసే వారిని అత్యంత హేయమైన భాషలో మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు తూలనాడుతున్నారు. స్వయంగా మీరే అసెంబ్లీలో పాదయాత్రకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల మనోభావాలను అత్యంత దారుణంగా అవమానించారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుని, అక్కడే నివాసభవనాన్ని కూడా నిర్మించుకుని ప్రజల్ని నమ్మించి గెలిచిన తర్వాత నమ్మక ద్రోహం చేయటం భావ్యమా?
అమరావతి ప్రాంతంలోని రోడ్లను తవ్వి కంకర దొంగిలిస్తున్నారనే విషయాలు చూస్తుంటే, ప్రభుత్వమే ఆ పనులు చేయిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. లేకపోతే రోడ్డు తవ్వి కంకర ఎత్తుకెళ్లడం దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఉత్తరాంధ్ర పై దండయాత్ర గా మీరు అమరావతి రైతుల పాదయాత్రను అభివర్ణిస్తున్నారు. ఏడాదికి నాలుగు వాణిజ్య పంటలు పండే జరీబు భూములను అమరావతి కోసం త్యాగం చేసిన వారిని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. ఒక్క సారి ఆలోచించండి…. అమరావతి కోసం భూములు ఇవ్వకుండా ఉంటే ఆ రైతులు వ్యవసాయంపై ఏడాదికి ఎంతో ఆర్జించుకునేవారు. అలాంటి భూములను రాజధాని కోసం ఇస్తే మీరు చేసింది, చేస్తున్నది ఏమిటి?
సగంలో ఆగిపోయిన భవనాలు పూర్తి చేయడం మాట అటుంచి, రాజధానిని మూడు ముక్కలు చేసి ఎప్పుడో ఒక సారి జరిగే అసెంబ్లీ సమావేశాలు మాత్రమే అమరావతిలో జరిపించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది న్యాయమా అని అడిగిన అమరావతి రైతుల నోటిమాటను, కర్కశంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప వారి బాధ ఏమిటో అర్ధం చేసుకోవడం లేదు. ‘‘పెయిడ్ ఆర్టిస్టులు’’ ఇంత కాలం ఉద్యమం చేయడం మీకు ఆశ్చర్యంగా అనిపించడం లేదా? ఎందుకంటే మూడు రాజధానులకు మద్దతుగా మీరు ఎంత స్పాన్సర్ చేస్తున్నా కూడా ప్రజల మద్దతు లభించడం లేదు కదా? ‘‘పెయిడ్ ఆర్టిస్టులు’’ ఇంత కాలం ఉద్యమం చేయలేరని మీకు అర్ధం అయి ఉంటుంది.
మీ తెలివితేటలు శక్తియుక్తులన్నీ అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప, రాష్ట్ర అభివృద్ధి పై పెట్టటం లేదు. అధికార వికేంద్రీకరణ అంటే రాజధాని విభజన కాదు. అధికార వికేంద్రీకరణ అంటే మూడు అంచెలలో స్థానిక స్వపరిపాలనను అందించడం. అటువంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. గ్రామస్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించేలా చేయడం అధికార వికేంద్రీకరణ అవుతుంది తప్ప, రాజధానిని మూడు ముక్కలు చేయడం కాదు. మీరు మీ మంత్రి వర్గంలోని మంత్రులకే స్వేచ్ఛనివ్వడం లేదు… ఇక గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పాలనాబాధ్యులకు మీరు అధికారాలు అప్పగిస్తారనేది అత్యాశే అవుతుంది. అసలైన అధికార వికేంద్రీకరణ కాకుండా కేవలం మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకునే ‘‘అధికార వికేంద్రీకరణ’’ చేస్తున్నారు మీరు.
వికేంద్రీకరణ ముసుగున మీ ‘మూడుముక్కలాట’ అసలు రూపం నేడు స్పష్టమైంది. విశాఖ కేంద్రంగా ఉత్తర కోస్తాలో విలువైన భూములు మరియు ఆస్తులకు అయిన కాడికి నయానా, భయాన దోచుకోవడం ప్రధాన లక్ష్యమని నేడు ప్రజలకు తేటతెల్లమయింది. అంకెలు, సంఖ్యలు, అధికారిక పత్రాల సాక్షిగా బయటపడుతున్న ఆక్రమణ దందాలు, ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. రాజధాని విషయంపై మీ మడమ తిప్పుడుకు ఇదే కీలకం అని ప్రజలకు తెలిసిపోయింది.
విశాఖపట్నంలో మీరు, మీ పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రౌడీషీటర్లు పెరిగిపోయారు. హత్యలు నిత్యకృత్యమయ్యాయి. జరుగుతున్న పరిణామాలు చూసి అక్కడ ప్రజలే భయాందోళనలో ఉన్నారు. ఉత్తరాంధ్రపై మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి మీరు చేసింది ఏమిటంటే… రెండు వేల కోట్ల రూపాయల అప్పు కోసం వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ తో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను తాకట్టు పెట్టారు. మీరు ఏ స్థితికి దిగజారారు అంటే ఎప్పుడైనా ప్రధాన మంత్రి వస్తే బస చేసే సర్క్యూట్ హౌస్ ను కూడా తాకట్టు పెట్టారు. ఇదీ మీరు ఉత్తరాంధ్ర లో చేస్తున్న అభివృద్ధి. ఉత్తరాంధ్రపై అకస్మాత్తుగా ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. అభివృద్ధి చేయకుండా ఉత్తుత్తి ప్రకటనలిచ్చి ప్రేమ చూపిస్తే వెనుకబాటుతనం దూరం అవుతుందా?
అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి మూడు ముక్కల రాజధాని అని నినదిస్తున్న మీరు… ఈ మాడేళ్ల కాలంలో అటువంటి ప్రగతికి ఒక విధానం కాని, ప్రణాళికి గాని రూపొందించలేక పోయారు. “ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…. తప్పించుకు తిరుగుతున్నారు”. ఇది మీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. మీ ప్రభుత్వ డొల్ల తనానికి నిలువెత్తు సాక్ష్యంగా కూడ ఈ విచిత్ర వైఖరి నిలుస్తోంది.. దీనిని కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.
విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. సంతోషం అయితే మీరు 1.వంశధార నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేశారా? 2.వంశధార రెండో దశ రెండో భాగం మిగిలి ఉన్న పనులు పూర్తి చేశారా? 3.మహేంద్రతనయ నది పై ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టారా? 4.తోటపల్లి కుడి ప్రధాన కాల్వ పనులు ఎప్పుడు మొదలు పెడతారు? 5.మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు రెండో దశ పనులకు కనీసం కాంట్రాక్టర్ ను అయినా ఎంపిక చేయగలరా? 6.గజపతినగరం బ్రాంచి కాల్వపనులు ఎప్పటికి మొదలు పెడతారు? 7.తారకరామతీర్ధ సాగర్ ఎప్పటికి పూర్తి చేస్తారు?… ఇవి కదా మీరు చేపట్టాల్సిన అభివృద్ధి పనులు….. వీటిని వదిలేసి ఈ మూడున్నర ఏళ్లలో మీరు ఏం చేశారు?
విశాఖపట్నంలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ చాపచుట్టేశాయి. జూట్, చక్కెర మిల్లులు మూతపడ్డాయి. ఉద్యోగాల కల్పన లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. కార్యసాధకులైన ఉత్తరాంధ్ర ప్రజలను మీపై ఆధారపడే పరాన్నజీవులుగా మార్చే ప్రక్రియను మీరు ఎంతో పకడ్బందిగా అమలు చేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త పరిశ్రమలు తెప్పించే పని చేసినట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో సంతోషించి ఉండేవారు. అలా కాకుండా మీరు కేవలం మీ ఆఫీసు పెట్టుకోవడానికి ఉత్తరాంధ్రను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. మీ మూడు రాజధానుల ప్రక్రియ కచ్చితంగా అధికార వికేంద్రీకరణ కోసం కాదు…. అనే విషయం ప్రజలకు అర్ధం అయింది.
‘‘ప్రజలను రెచ్చగొట్టడం’’ అనే విధ్వంసక కార్యక్రమాన్ని మీరు ఎంతో పకడ్బందిగా ఉత్తరాంధ్రలో అమలు చేస్తున్నట్లే ఇప్పుడు రాయలసీమలో కూడా మొదలు పెట్టారు. మీ ప్రయత్నాలు సఫలం కాకూడదని ఎంతో మంది ప్రజలు కోరుకుంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ను మరింత విభజించే విధంగా మీ ఆలోచనలు సరైనవి కాదు.
మీకు రాయలసీమపై ఏ మాత్రం ప్రేమ ఉందో గండికోట సోమశిల ప్రాజెక్టు రైతులకు పరిహారం చెల్లించే విషయంలోనే వెల్లడైంది. ఆ రైతులకు మీరిచ్చిన హామీ ఏమిటి? మీరు చేసిన పనేమిటి? ఇదేనా మీరు రాయలసీమ రైతులకు చేసిన సాయం? అన్నమయ్య డ్యాం గేట్లు కొట్టుకు పోయి ఎంత కాలం అయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాజక్టుపై మీరు ఏనాడైనా సమీక్ష నిర్వహించారా? చర్యలు తీసుకున్నారా? బాధితులను ఆదుకున్నారా? రాయలసీమకు ‘‘మేళ్లు’’ చేస్తామని మాయమాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. హంద్రీనీవా, సిద్దేశ్వరం అలుగు, బైరవానితిప్ప, గుండ్రేవుల, వేదవతి బ్యారేజీ, కుందు ఎత్తిపోతలు ఈ మూడేళ్లలో ఎంత ప్రగతి సాధించాయో చెప్పగలరా? అసలు రాయలసీమలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మీకు రైతుల గురించి తెలియదు. పోనీ యువత గురించి పట్టించుకున్నారా? “అలోలక్ష్మణా” అంటూ వలసపోతున్న రాయలసీమ యువత గురించి ఈ మూడేళ్లలో మీరు చేసిందేమిటి? మీ సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో ఒక్క సారైనా మీరు ఆలోచించారా? రాయలసీమకు ఏ ఒక్క కొత్త పరిశ్రమనైనా తెచ్చారా? ఇక యువతకు ఉపాధి ఎలా దొరుకుతుంది? రాయలసీమ ప్రజల హక్కులను మీరే కాపాడుతున్నట్లు గత రెండు రోజులుగా తెగ ప్రచారం చేసుకుంటున్నారు.
రాయలసీమలో ‘‘అన్ కనెక్టెడ్’’ ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు ఎన్నో అవకాశాలు కల్పించినా మీరు ఏ ఒక్కటీ ఉపయోగించుకోవడం లేదు. కడప బెంగళూరు, శ్రీ కాళహస్తి నడికుడి, రాయదుర్గం రాయచూరు రైల్వే లైన్లకు రాష్ట్రం వాటా ఇవ్వకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? రాయలసీమ ప్రజలకు తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ కు కూడా రాష్ట్ర వాటా ఇవ్వలేని మీ చేతకాని తనాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేకమైన దృష్టి సారించి కేటాయించిన రెండు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) లకు భూమి కేటాయించలేని దుస్థితిలో మీరు ఉన్నారు. రాయలసీమకు కేటాయించిన నిమ్జ్ కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి ఉంటే పది లక్షల యువతకు ఉపాధి దొరికి ఉండేది. మీ అనాలోచిత విధానాల వల్ల రాయలసీమ యువత ఉపాధికి దూరం అవుతున్నారు. ఎంత సేపటికీ మీ స్వార్ధం తప్ప మీరు యువత గురించి ఆలోచిస్తే కదా సమస్య పరిష్కారం అయ్యేది.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్. మీరు దాన్ని న్యాయ రాజధాని అనే పేరు పెట్టి ప్రజలను రెచ్చగొట్టాలని చూడటం తప్ప ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేశారా? కనీసం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్ర న్యాయ శాఖకు ఈ మేరకు ప్రతిపాదనలైనా పంపారా? ఏమీ చేయకుండా రాయలసీమకు న్యాయ రాజధాని తెస్తానని కల్లబొల్లి మాటలు మాత్రం చెబుతున్నారు. మీకు రాయలసీమపై చిత్తశుద్ధి లేదనడానికి పై ఉదాహరణలు సరిపోవా?
రాయలసీమకు 200 టి.ఎం.సి ల నికర జలాలు ఇవ్వాలనే డిమాండ్ అసలు మీ దృష్టిలో ఉందా? అభివృద్ధి పరంగా చిన్న విషయాలపైనే శ్రద్ధ చూపని మీరు రాయలసీమకు నికర జలాలు ఇచ్చి రైతులను ఆదుకోవడం అనే పెద్ద విషయాన్ని మీరేంపట్టించుకుంటారు? అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టి కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే నష్టం జరిగేది మీ ఆధీనంలోని రాష్ట్ర ప్రభుత్వానికే. శాంతి భద్రతలు క్షీణించేందుకు మీరే ప్రోత్సహిస్తే దాని ఫలితం మీ నేతృత్వంలోని ప్రభుత్వమే అనుభవించాల్సి ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ను కూడా మర్చిపోతే ఎలా ముఖ్యమంత్రి గారూ….
మీరు మీ మంత్రులు చేస్తున్న బాధ్యతా రాహిత్య ప్రకటనల వల్ల ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరగటం తప్ప రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. దయచేసి అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డుపడొద్దు. ప్రజలలో లేని ఉద్యమాన్ని కృత్రిమంగా సృష్టించవద్దు. అమరావతి రైతులు మహాపాదయాత్ర ద్వారా తమ అభిప్రాయాలను చెప్పుకొనివ్వండి.. ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించండి..
మడమ తిప్పనంటూ గర్వంగా చెప్పుకునే మీ ముందు ఒక ప్రతిపాదన ఉంచదలిచాను. అమరావతి రాజధానిగా ఎన్నడూ మీరు సమర్ధించలేదని, మీరు నమ్మే పవిత్ర గ్రంథం సాక్షిగా బహిరంగంగా చెప్పినా… లేక కనీసం ఒక ప్రకటన చేసినా… నేను ఒక కార్యకర్తగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరు ఈ విధంగా స్పష్టం చేస్తే రాజధాని విషయంపై నెలకొన్న గందరగోళం సమసి కొంత స్పష్టత వచ్చే వీలున్నందున.. ఎంతో బాధ్యతాయుతంగా ఈ ప్రతిపాదన మీ ముందు ఉంచుతున్నాను.
రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు… గుర్తు చేసుకోండి. కానీ దానికి పూర్తి విరుద్ధంగా వ్యవరిస్తున్నారు. వ్యవస్థల దుర్వినియోగాన్ని, విధ్వంసాన్ని ఇక ఆపండి. నీతి, నియమాలకు తిలోదకాలివ్వడం నియంతల ప్రధాన లక్షణం. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ మీరు అభ్యర్ధిస్తే గత ఎన్నికల్లో ప్రజలు మీ వెంట నిలిచారు. వారిని వంచనకు గురి చేయకండి. విచ్చలవిడిగా కొనసాగతున్న పంచభూతాల దోపిడిని ఆరికట్టి ప్రజాహిత పాలన కోసం ఇకనైనా ప్రయత్నించండి.
ఆశతో కూడిన భవితకు విశ్వాసాన్ని కల్పించే వర్తమానం చాలా కీలకమని గుర్తించండి. అటువంటి ఆశ, విశ్వాసాలు నేడు కనుమరుగవుతున్నాయి మన రాష్ట్రంలో వర్తమాన గతిని గాడిన పెట్టడానికి ఇకనైనా పూనుకోండి. లేనియెడల రాష్ట్ర చరిత్రలో మహాజన్వంచకులుగా మిగిలిపోయే ప్రమాదముంది. గణగణ మ్రోడుతున్న ప్రమాద ఘంటికలను గమనించి ప్రజాహితంగా పాలించండి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషిచేయండి.
ప్రజలు మీపై గత ఎన్నికల్లో పెట్టుకున్న నమ్మకం వమ్ముచేయకుండా ఒక నిజమైన సంరక్షకుడిలా రాష్ట్రాన్ని ఆదుకోండి. రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర సమతుల్య అభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిస్తూ…
భవదీయుడు,
(వై. సత్యకుమార్)
జాతీయ కార్యదర్శి,
భారతీయ జనతా పార్టీ.
6 ఏ, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్,
న్యూ ఢిల్లీ – 110001.