శరత్ రెడ్డి నుంచి జగన్ రూ. 9 వేల కోట్లు తీసుకున్నారు

– లిక్కర్ మాఫియాతో జగన్ కు సంబంధాలు ఉన్నాయన్న సీపీఐ రామకృష్ణ
– లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డ శరత్ రెడ్డి విజయసాయి బంధువని వ్యాఖ్య
– మోదీ సభను విజయవంతం చేసేందుకు జగన్ తంటాలు పడుతున్నారని విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.లిక్కర్ మాఫియాతో జగన్ కు సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డ శరత్ చంద్రారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువని చెప్పారు.

శరత్ రెడ్డి నుంచి జగన్ కు ముడుపులు అందాయని… రూ. 9 వేల కోట్లను జగన్ తీసుకున్నారని అన్నారు.ఏపీ సీఐడీకి ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విశాఖలో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారని రామకృష్ణ విమర్శించారు.

కేసుల నుంచి బయటపడేందుకు మోదీ ముందు తల వంచుతున్నారని విమర్శించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ప్రజా సంఘాల నేతలను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని జగన్ డిమాండ్ చేశాలని అన్నారు.