– షర్మిల కొడుకు నిశ్చితార్ధంలో మూడు నిమిషాలు కూడా ఉండని జగన్
– 2 నిమిషాల ఒక్క సెకన్ మాత్రమే ఉన్న జగన్ దంపతులు
– మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌లో చెల్లి షర్మిలతో మాట్లాడని అన్న జగన్
– మేనల్లుడి దగ్గర మూడు నిమిషాలు కూడా కేటాయించని జగన్
– వేదికపైనా సీఎం సెక్యూరిటీ హడివిడిపై సోషల్‌మీడియాలో విమర్శలు
– వేదికపై అన్న -చెల్లెలు ఎడమొఖం పెడమొఖం
– జగన్ దగ్గరికి పిలిచినా రాని షర్మిల-అనిల్
– చుట్టం చూపుగా వచ్చి వెళ్లారంటూ వ్యాఖ్యలు
– ‘మేనమామ’ పాత్రపై సోషల్‌మీడియాలో సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన.. తన రాష్ట్రంలోని పిల్లలందరికీ దేవుడిచ్చిన మేనమామ. కోట్లమంది అక్కా-చెల్లెమ్మలకు దేవుడిచ్చిన అన్నయ్య. లక్షలమంది అవ్వా-తాతలకు దేవుడిచ్చిన మనుమడు. మరి అలాంటి ‘దేవుడిబిడ్డ’ సొంత చెల్లెమ్మకు ఎంత చేయాలి? సొంత మేనల్లుడికి ఇంకెంత అనుబంధ ం పంచాలి? మేనల్లుడి నిశ్చితార్ధం-పెళ్లికి, మేనమామలు ఏ రేంజ్‌లో హడావిడి చేయాలి? ఆకాశమంత పందిరేసి, భూదేవంత అరుగేసి తీన్‌మార్ జోర్దార్ చేయరూ?! అదే కదా మరి మేనల్లుడు-మేనమామల అనుబంధం? అది కదా అన్నా చెల్లెమ్మల అనుబంధం?
కానీ ఏపీలో ఎవరికీ ఏమీ కాకపోయినా.. దేవుడిచ్చిన అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు, మేనమామ అయిన సీఎం జగన్ మాత్రం.. సొంత మేనల్లుడు-సొంత చెల్లెమ్మ ఇంట జరిగిన ఓ శుభకార్యంలో, అందుకు భిన్నంగా కనిపించడం హాట్‌టాపిక్‌గా మారింది. మరి దుర్మార్గమైన సోషల్‌మీడియా, చేతులుకట్టుకుని కూర్చోదు కదా? చట్టం తనపని తానుచేసుకున్నట్లు.. సోషల్‌మీడియా తన పని తాను చేసేసింది.
ఏపీలో పిల్లలందరికీ ‘దేవుడిచ్చిన మేనమామ’ అయిన జగన్.. సొంత మేనల్లుడి నిశ్చితార్ధంలో ముచ్చటగా మూడు నిమిషాలు కూడా ఉండలేదని.. కోట్లాదిమంది అక్కాచెల్లెమ్మలకు దేవుడిచ్చిన అన్నయ్య అయిన జగన్.. సొంత చెల్లి ఇంట్లో జరిగిన తొలి శుభకార్యానికి, రెండు నిమిషాల ఒక సెకనే కేటాయించటం ఏమిటంటూ.. సోషల్‌మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. దానిపై సెటైర్లు కూటా ఒక రేంజ్‌లో పేలుతున్నాయ్ మరి!
జగన్ సోదరి షర్మిల కొడుకు రాజారెడ్డికి.. ప్రియాతో, హైదరాబాద్‌లోని ఓ రిస్టార్టులో నిశ్చితార్ధ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చెల్లి-బావతో ఎన్ని విబేధాలున్నప్పటికీ.. ఎంతైనా మేనమామ కాబట్టి, ముద్దుల మేనల్లుడి నిశ్చితార్ధ వేడుక ను.. మేనమామ జగన్, దగ్గరుండి ఘనంగా జరిపిస్తారని చాలామంది భావించారు.
కుటుంబాల్లో కలహాలు.. ఆడవారి మధ్య గొడవలు కామనే. అయితే శుభకార్యాల సందర్భాల్లో వాటిని పక్కనపెట్టి, కనీసం అప్పటివరకైనా కలసి ఉండేందుకు ప్రయత్నిస్తారు. కలసి ఉన్నట్లు కనిపిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. చూసేదే! కానీ మేనల్లుడి నిశ్చితార్ధ వేడుకలో అది భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. అదే ఇప్పుడు వార్త అయి హాట్‌టాపిక్‌గా మారేందుకు కారణమయింది.
జగన్‌కు.. షర్మిల-బ్రదర్ అనిల్ మధ్య గొడవలు-ఆస్తి విబేధాలున్నాయన్న వార్త ..చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. అయితే చెల్లి కుటుంబంలో జరిగే తొలి శుభకార్యం కాబట్టి.. జగన్ మేనమామ పాత్ర పోషించి, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు ప్రయత్నిస్తారని చాలామంది భావించారు. అయితే ఆ కుటుంబానికి.. మేనమామ కమ్ అన్నయ్య కమ్ బావమరిది అయిన జగన్, అందుకు భిన్నంగా వ్యవహరించి.. తమ మధ్య ఉన్న విబేధాలను, చెప్పకనే చెప్పడం చర్చనీయాంశమయింది.
మేనల్లుడి నిశ్చితార్ధానికి భార్య భారతితో వచ్చిన మేనమామ జగన్.. అక్కడ ముచ్చటగా మూడు నిమిషాలు కూడా ఉండకపోవడం, సోషల్‌మీడియాలో విమర్శ-చర్చకు తెరలేపింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగన్ అలా నేరుగా వేదిక వద్దకు రావడం.. మేనల్లుడిని కౌగిలించుకుని, కోడలిని ఆశీర్వదించడం… షర్మిల వియ్యంకుడు-వియ్యపురాలికి నమస్కరించడం… భార్య భారతిని దగ్గరకు పిలిచి ఫొటోలు దిగడం… ఆ సమయంలో చెల్లి షర్మిల-బావ బ్రదర్ అనిల్‌ను దగ్గరకు పిలిచినా రాకుండా, వారిద్దరూ దూరంగానే ఉండి ఫొటోలు దిగడం.. వెళ్లేముందు అమ్మ విజయలక్ష్మితో కొన్ని సెకన్లు మాట్లాడటం..వెంటనే అందరికీ నమస్కరిస్తూ భార్య భారతితో, అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. ఇదంతా కేవలం రెండు నిమిషాల ఒక్క సెకన్ మాత్రమేనంటూ, సోషల్‌మీడియా పండితులు లెక్కలుకూడా కట్టేశారు.
మధ్యలో.. వేదికపై కుటుంబ సభ్యుల మధ్య సెక్యూరిటీ హడావిడి ఎందుకు? జగన్ బయటకు వెళితే రక్షణగా, పరదాలు కట్టడం వరకూ ఓకే. కానీ సొంత చెల్లి ఇంట్లో జరిగే శుభకార్యంలోనూ, సెక్యూరిటీ హడావిడి ఎందుకు? అన్న ప్రశ్నలు సోషల్‌మీడియాలో మిస్సైళ్ల మాదిరిగా దూసుకువస్తున్నాయి.
ఇప్పటికే సొంత తల్లి-చెల్లికే రక్షణ కల్పించలేని జగన్ .. రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారంటూ, రాజకీయ ప్రత్యర్ధులు విసురుతున్న విమర్శనాస్త్రాలకు.. ఈ ఘటన తోడైంది. జగన్‌కు ఇది ఇరుకూ,ఇబ్బందేనన్నది రాజకీయ విశ్లేషకుల ఉవాచ.