Home » ఛ.. నిజమా.. ఊరుకోండి సామీ?

ఛ.. నిజమా.. ఊరుకోండి సామీ?

-జగన్ మళ్లీ సీఎం అవుతారని పరిపూర్ణానంద స్వామి
– 123 సీట్లు వస్తాయని జోస్యం
– ఇంతకూ తన గెలుపు సంగతి చెప్పని వైనం
– వైసీపీ గెలుస్తుందన్న పరిపూర్ణానందస్వామి
– విశాఖ స్వామికి పోటీ అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనో రాజకీయ స్వామి. పేరు పరిపూర్ణానంద స్వామి. గెటప్ కూడా అదే. కేరాఫ్ కాకినాడ శ్రీపీఠం. ఆయనకో సొంత చానెల్ కూడా ఉంది. దానికి ప్రమోటర్లు మారినా అసలు ఓనరు మాత్రం ఆయనే. కాషాయం కట్టిన సాములోరికి ఈమధ్య పొలిటికల్ ఎంట్రీ మీద కోరిక పుట్టింది.

ఆ ప్రకారంగా సాములోరు కాషాయం పార్టీని కాంటాక్టు చేశారు. పనిలోపనిలో తనకు పరిచయం ఉన్న ‘సంఘ’జీవులతో భేటీలు వేసి, హిందూపురం సీటు కావాలన్న తన కోరికను బయటపెట్టారట. దానితో సదరు అనంతపురం ‘సంఘ’జీవులు, సాములోరి పేరు ప్రమోట్ చేశారట. నిజానికి ఆ సీటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆశించారు. ఆ మేరకు ఆయన చాలాకాలం నుంచి ముందస్తు కార్యక్రమాలు నిర్వహించారు. అది వేరే విషయం అనుకోండి.

ఇది తెలిసిన పార్టీ పెద్దలు, ఆయనను పిలిచి అసలక్కడ మీ బలమేంటని ఆరా తీశారట. అందుకాయన.. ఎందుకులేదూ?.. నాకు అక్కడ 34 కుటుంబాలు తెలుసన్నారట. సరిపోయింది పో.. అనుకుని, పిలిచిన ఆ పెద్దలు స్వామివారికి పాలు-అరటిపండు, తమలపాకులో పెట్టి పంపించిందట.

ఇక తనకు కమలవనంలో నీడ లేదనుకున్న సాములోరు, ఇండిపెండెంట్‌గానే ఎన్నికల బరిలోకి దిగారు. యుపిలో సన్యాసులు ఎంపి-ఎమ్మెల్యేలు అవగా లేనిది, తానెందుకు కాకూడదనుకున్న సాములోరు, ఎట్టకేలకూ నామినేషన్ వేశారు. దిగిన తర్వాత గానీ తెలియలేదట సాములోరికి ఎన్నికల కష్టాలు! హిందువులంతా కట్టకట్టుకుని, బారికేడ్లు తోసుకుని.. ఎగేసుకుని మరీ తన నామినేషన్‌కు వచ్చి, కాళ్లు మొక్కిపోతారని ఆశించారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ లెవల్లో.. తనకు హిందూపురం హిందువులంతా జై కొట్టి, కాళ్లు మొక్కి తమలపాకు-రెండు అరటిపళ్లు ఇచ్చి ఎర్రతివాచీ పరుస్తారని ఆశించారు. కానీ పాపం సాములోరి నామినేషన్ చాలా సాదాసీదాగా.. అంటే ఒక విస్తరాకు, ఒక అరటిపండు, చెంబు మంచినీళ్లలా సాగింది. అది వేరే కథ.
సరే.. ఇప్పుడు ఎన్నికలయి, కొద్ది గంటల్లో కౌంటింగ్ కూడా మొదలుకానుంది. ఆ సందర్భంగా పరిపూర్ణానందుల వారు భక్త ఓటర్లనుద్దేశించి, అనుగ్రహభాషణం చేశారు. త్రిలోక సంచారి, త్రికాలజ్ఞుడు, సర్వంతెలిసిన మహాపురుషుడు.. అంతకుమించి విశాఖ స్వరూపానందుల వారిలా.. రోజూ జగద్గురువు తో హాట్‌లైన్‌లో మాట్లాడే కాకినాడ స్వామివారు ఏం ఉపదేశిస్తారా? అని ఓటరు భక్తులంతా టీవీ ముందు సేదదీరారు.

చివరాఖరకు ఆయన చెప్పిందేమిటంటే.. ఈ ఎన్నికల్లో జగన్‌కు 123 సీట్లు వస్తాయట. ఆయనకు ఎవరో అసలు వైసీపీకి 159 స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. తన దివ్యదృష్టితో.. లక్షలాది ఈవీఎంల పాస్‌వర్డ్‌ను తెలుసుకుని, అందులో తొంగి

చూడగా..గ్రామీణ మహిళలంతా జగన్‌స్వామికే ఓటు వేసినందున 123 సీట్లు వస్తాయని తెలిసిందట. హిందూపురం కూడా వైసీపీ గెలుస్తుందని సెలవిచ్చిన సాములోరు… ఇంతకూ తాను గెలుస్తానా? లేదా అన్న అసలు సంగతి మాత్రం తేల్చకపోవడమే వింత. బహుశా స్వామివారి దివ్యదృష్టి, హిందూపురం ఈవీఎంలో తొంగిచూసేందుకు పనిచేయలేదేమో?!

హిందూపురం సంగతి గురించి చెబుతూ.. ‘అక్కడ కొన్ని పరిణామాలు చవిచూశాయని’ బాహుబలి సినిమాలో కాలకేయలా అర్ధంకాని కిలికిలి భాషలో చెప్పారు. స్వామివారి అనుగ్రహభాషణం కమ్ దివ్యదృష్టి పై సోషల్‌మీడియాలో నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకూ నువ్వు గెలుస్తున్నావా? లేదా అని చెప్పకుండా ఈ సోదేంది స్వామీ? అని కొందరు.. విశాఖ స్వామి ఎలాగూ హైదరాబాద్ షిఫ్టవుతున్నారు. ఆయన స్థానం కోసమే కదా ఈ పాట్లు? జగన్గురువు పోస్టు కోసం ఎందుకీ పాకులాట స్వామీ? అడిగితే విశాఖ స్వామి వారే మీకు రాజగురువు దండం ఇస్తారు కదా? అంటూ సొషల్‌మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

ఇంతకూ అసలు సంగతేమిటంటే.. దింపుడుకల్లం ఆశ మాదిరిగా.. వైసీపీలో ఈ స్వాములు.. హిందువుల వ్యవహారాలు చూసే బ్యాచ్ ఒకటి, కౌంటింగ్‌కు ముందు రోజు కాకినాడ సాములోరిని బరిలోకి దించిందట. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమి వైపే జోస్యం చెప్పిన నేపథ్యంలో.. కౌంటింగ్‌కు వెళ్లే వైసీపేయులు కూలబడ్డారు. ఇక కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లటం ఖర్చులు దండగ అని, దిగాలు పడుతున్న వేళ.. వారికి ఆక్సిజన్ కోసం ఈ పీఠాలు చూసే వైసీపీ బ్యాచ్‌కు, బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందట. ఆ ప్రకారంగా కాకినాడ స్వామి వారు, మీడియాను పిలిచిమరీ అనుగ్రహభాషణ ఇవ్వడం.. జగనన్న మళ్లీ సీఎం అవుతున్నారని తాదాత్మ్యంతో చెప్పడం జరిగిపోయిందట. అద్గదీ అసలు సంగతి!

Leave a Reply