Home » కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్ల దూరం?

కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్ల దూరం?

-వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు కౌంటింగ్ ఏజెంట్ల ఝలక్
– అనారోగ్యం పేరుతో జారుకుంటున్న కౌంటింగ్ ఏజెంట్లు
– బంధువులకు బాగోలేదని చెక్కేస్తున్న మరికొందరు
– స్విచ్చాఫ్ చేసి జారుకుంటున్న వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు
– కూటమి కొత్త ఎమ్మెల్యేలతో ఘర్షణ ఎందుకన్న ముందుచూపే కారణమా?
– ఎగ్జిట్‌ఫోల్ ప్రభావంతోనే వైసీపీ ఏజెంట్ల ‘డ్రాపవుట్స్’?
– రాయలసీమ, నెల్లూరు, పల్నాడులోనే ‘అస్త్రసన్యాసాలు’
– ఏజెంట్ల షాక్‌తో తల పట్టుకుంటున్న వైసీపీ అభ్యర్ధులు
– ఫోన్లు చేసినా తీయని సొంత పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు
– ప్రత్యామ్నాయం దొరక్క వైసీపీ అభ్యర్ధుల ఆందోళన
– నాయకత్వానికి మొర పెట్టుకుంటున్న వైసీపీ అభ్యర్ధులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఫలితాలకు ముందే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు చేతులెత్తేస్తున్నారా? రెండురోజుల వ్యవధిలో కూటమికి అనుకూలంగా శరవేగంగా మారుతున్న పరిణామలతో, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు ముందుచూపు ప్రదర్శిస్తున్నారా? మొన్నటివరకూ కౌంటింగ్ శిక్షణ కార్యక్రమాలకు సైతం వెళ్లొచ్చిన ఏజెంట్లు, ఇప్పుడు హటాత్తుగా అస్త్రసన్యాసం చేయడానికి స్థానిక భయాలే కారణమా? ప్రత్యామ్నాయ ఏజెంట్లు దొరక్క వైసీపీ అభ్యర్ధులు ఆందోళనలో ఉన్నారా? కూటమి అధికారంలోకి వస్తే కొత్త ఎమ్మెల్యేలతో వైరం ఎందుకన్న ముందుచూపే, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల అస్త్రసన్యాసానికి కారణమా? రాయలసీమ వంటి బలమైన జిల్లాల్లోనే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు జారిపోతుంటే, ఇక మిగిలిన జిల్లాల్లో కార్యకర్తల మానసిక పరిస్థితి ఏమిటి?.. అసలుఈ ‘డ్రాపవుట్స్’ సంఖ్య ఎందుకు పెరుగుతోంది?.. ఇదీ ఇప్పుడు వైసీపీ నాయకత్వాన్ని వెంటాడుతున్న కౌంటంగ్ ఏజెంట్ల కష్టాలు.

మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న సమయంలో వైసీపీకి వరస వెంట షాకులు. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి, ఆ సమయంలో ఎలా ఉండాలి అన్న అంశంపై కోచింగ్ ఇచ్చిన వైసీపీయ అభ్యర్ధులకు కలవరం కలిగించే అంశమిది. తాము కౌంటింగ్‌కు రావడం లేదంటూ అనేక సాకులు చూపి జారిపోతున్న కార్యకర్తలు, వైసీపీ అభ్యర్ధుల గుండెల్లో బాంబులు పేలుస్తున్నారు. కొన్ని గంటల్లోనే కౌంటింగ్ ప్రారంభమవనున్న నేపథ్యంలో.. చివరి గంటల్లో వైసీపీ ఏజెంట్లు అస్త్రసన్యాసం చేయడం వైసీపీ నాయకత్వాన్ని కలవరపరుస్తోంది.

వైసీపీకి పట్టున్న రాయలసీమతోపాటు, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో డజన్ల సఖ్యలో వైసీపీ ఏజెంట్లు కౌంటింగ్‌కు ముఖం చాటేస్తున్న వైనం అభ్యర్ధులను కలవరపరుస్తోంది. ఎన్ని టేబుళ్లు ఉంటే అంతమంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు. అయితే ఆరోగ్యం బాగోలేదని కొందరు, తమ పెద్దలను ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని మరికొందరు, బండి యాక్సిడెంట్ అయిందని ఇంకొందరు.. ఇలా రకరకాల కారణాలు వైసీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌కు చూపిస్తున్నారట. అలా చెప్పిన వెంటనే ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు.

ఈ సమాచారం తెలిసిన వైసీపీ అభ్యర్ధులు, స్వయంగా వారికి ఫోన్లుచేసినా స్విచ్చాఫ్ అయిన పరిస్థితి. కొందరు ఎమ్మెల్యేలయితే తమ అనుచరులను, ఏజెంట్ల ఇళ్లకు పంపి మరీ పిలిపించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పిన సందర్భంలో ‘‘ప్రత్యామ్నాయం చూసుకోండి. అంతకంటే మనం ఇప్పుడు చేసేదేమీలేదు. అన్ని జిల్లాల నుంచి మాకు ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. మీరే ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి’’ అని హితవు పలుకుతున్నారట.

దానితో విధిలేని పరిస్థితిలో ఎమ్మెల్యే అభ్యర్ధులు, అప్పటికప్పుడు చదువుకున్న కార్యకర్తల పేర్లు చేర్చి, వారిని ఏజెంట్లుగా పంపించే ఫారం-18ని భర్తీ చేయిస్తున్నారు. ఏజెంట్లుగా ఉన్న ఫారం 19ను రద్దు చేసి, వారి స్థానంలో కొత్తవారికి ఫారం-18లో దరఖాస్తు చేసి, దానిపై ఆర్వో ముద్రవేయాల్సి ఉంటుంది. కౌంటింగ్‌కు గంట ముందు వరకూ ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. కౌంటింగ్ మొదలయిన తర్వాత ఫారం- 18ని అనుమతించరు.

అయితే రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా… శరవేగంగా మారుతున్న పరిణామాలను చూసిన ఆ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు, ఈవిధంగా ముందుచూపుతో లౌక్యంగా వ్యవహరిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సత్యసాయి జిల్లాలో స్వయంగా వైసీపీ మండల నాయకులే.. టీడీపీ గెలుస్తుందంటూ 10 లక్షల రూపాయల పందెం కాయడం, సోషల్‌మీడియాలో వైరల్ అవడం కూడా కౌంటింగ్ ఏజెంట్లను ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ నాయకులే టీడీపీ గెలుస్తుందని పందెం కాయడంతో, ఇక వైసీపీ ఓటమి ఖరారన్న భావన ఏర్పడింది.

పైగా 50 ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో.. 45 సంస్థలు ఎన్డీయేకు ఏకపక్ష విజయం ఖరారని ప్రకటించాయి. ఈ ప్రభావం కూడా వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లపై విపరీతంగా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కొత్తగా గెలిచే కూటమి ఎమ్మెల్యేలతో వైరం ఎందుకు? రేపు ఏమైనా అయితే మనల్ని వైసీపీ నాయకులు ఎందుకు ఆదుకుంటారన్న ముందుచూపుతోనే, ఏజెంట్లు అస్త్రసన్యాసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘ ఈసారి రాజకీయ వేధింపులు మామూలుగా ఉండవని అర్ధమవుతూనే ఉంది. ఐదేళ్లు మా పార్టీ కక్ష సాధింపులకు టీడీపీ వాళ్లు మూడింతల ప్రతీకారం తీర్చుకుంటారు. అప్పుడు మాకు మా పార్టీ నేతలు అండగా నిలవరు. జగన్ అసలు మమ్మల్ని కలవనే కలవరు. ఈ అభ్యర్ధి రేపు మా పార్టీలోనే ఉంటాడా? టీడీపీలోకి వెళతారో తెలియదు. మాకెందుకు వచ్చిన తిప్పలు? అందువల్ల అసలు కౌంటింగ్‌కే వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా’’ అన్నది వారి మానసిక పరిస్థితిలా కనిపిస్తోంది.

సహజంగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్-కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవారిపై గెలిచిన ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. వారిని స్థానికంగా వేధించే కార్యక్రమాలకు తెరలేపుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఆ అనుభవంతోనే వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు చడీ చప్పుడు కాకుండా జారుకుంటున్నారట.

అయితే మనం గెలుస్తున్నామని.. 157 సీట్లు వస్తున్నాయని స్వయంగా జగన్ చెప్పడం.. సంబరాలకు సిద్ధం కావాలని సజ్జల పిలుపునివ్వడం.. కొన్ని సర్వే సంస్థలతో వైసీపీ గెలవబోతోందని చెప్పించడం.. ఇవన్నీ కౌంటింగ్ రోజు, ఏజెంట్లు జారిపోకుండా చూసే ఎత్తుగడగానే వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారులు చెప్పింది వినేవారు కాకుండా, వాదించి ఘర్షణ పడే వారినే ఏజెంట్లుగా పంపాలన్న సజ్జల పిలుపు కూడా ఓటమి సంకేతాలుగానే భావిస్తున్నారు.

Leave a Reply