Suryaa.co.in

Editorial

జగనన్నా.. దయలేదా?

– ఒక్కసారి జగన్‌ను తనకు చూపించాలని డొక్కా వేడుకోలు
– జిల్లా అధ్యక్షులకే జగనన్న దర్శనం దొరకదా?
– బహిరంగ సభలో దళిత మేధావి డొక్కా బహిరంగవేదన
– సోషల్‌మీడియాలో డొక్కా వీడియో వైరల్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నాళ్లని నా కన్నులు కాయగ
ఎదురుచూతురా గోపాలా?
ఎంత పిలిచినా ఎంత వేడినా
ఈనాటికీ దయ రాలేదా ఎంత
గోపాలా.. నంద గోపాలా?

* * *
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయె పిలిచిన పలుకువేమి

ఇరువున ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి

రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి చెందితివని ప్రీతితో న మ్మితి తండ్రి

ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతముచేయ నేనెంతవాడిని తండ్రి!
* * *
నీ దయరాదా
నామది తల్లడిల్లెగా
నామది తల్లడిల్లెగా న్యాయమా రామా?
* * *
తమను కరుణించమంటూ ఆ దేవదేవుడిని ఆర్తిగా… ఆవేదన.. ఆక్రోశం..ఆర్ధ్రత.. అరమోడ్పు కన్నులతో.. దీనంగా ప్రార్ధించే తెలుగు సినిమా దృశ్యాలు.. అందులో జీవించిన మహానటుల పాత్రలు.. ఎన్ని శతాబ్దాలయినా, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవే. దేవదేవుడి దర్శనం కోసం విలపించే భక్తుల రాగాలు వినేవారికి.. చివరాఖరకు కఠిన పాషాణ హృదయాలకు సైతం కన్నీరుతెప్పించకమానదు.

త్యాగరాజ కీర్తన.. రామదాసు కీర్తనలలో స్వామి వారికోసం పరితపించి-విలపించే హృదయవిదారక ఘట్టాలు ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలోని అమరావతిలో సాక్షాత్కరిస్తున్నాయి. ‘ఒక్కసారి ప్రభువు దర్శనం చేయించండి. నా జన్మ తరించిపోతుంద’ంటూ.. భక్తులు ఆవేదనతో ఆర్తిగా చేస్తున్న రోదన లాంటి వేదనలు, తాడేపల్లికి చేరకపోయినా.. సోషల్‌మీడియా తలుపు తడుతున్నాయి.

కృష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమాలో హీరోయిన్ సంగీత దీనంగా చెప్పిన ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్’ డైలాగుల మాదిరిగానే.. జగనన్న సైనికులు ‘ప్లీజ్ అన్నను ఒకే ఒక్కసారి కల్పించండి’ అని కడుదీనంగా స్వామి దర్శనం కోసం, ప్రాధేయపడుతున్న దృశ్యాలు విపక్షాలకు- సోషల్‌మీడియా చక్షువులకు బహు పసందుగా ఉంటే.. జగనన్న వీరాభిమానులకు మాత్రం, ప్రాణసంకటంలా మారింది.

దళిత మేధావి, వివాదరహితుడు, సాహితీపిపాసి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్… నిండు వేదికపై ‘ఒక్కసారి సీఎం జగన్ గారిని

చూసే అవకాశం కల్పించండి’ అంటూ ప్రార్ధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అధినేతలకు విధేయుడిగానే ఉంటారు. అందరికీ అందుబాటులో ఉండే నాయకుడన్న పేరుంది. కవికోకిల గుర్రం జాషువాకు వీరాభిమాని. సాహితీ పిపాసి. వివాదరహితుడు. చాలామందిలా గొప్పలకు పోరు.

ఆత్మాభిమానం మెండుగా ఉన్న కొద్దిమంది నేతల్లో ఆయనొకరు. పైగా పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా, అలాంటి వీరవిధేయుడికీ.. దళిత మేధావికీ.. వైసీపీ అధినేత జగనన్న దర్శనం దొరకని దయనీయాన్ని, వందలమందిలో చెప్పుకుని బావురుమన్న వైనం, వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌లా మారింది.

తానిక ఎన్నికల రాజకీయాలకు పనికిరానని, తనకంత ఆర్ధిక స్తోమత లేదని, నలుగురిలో బహిరంగంగా అంగీకరించిన డొక్కా.. అదే మాట వైసీపీ అధినేత జగనన్నకు చెప్పినట్లు వెల్లడించారు. తనకు తెలియకుండానే, తన అనుమతి లేకుండానే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే మళ్లీ నా పనితీరు బాగోలేదని మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్ని చెప్పిన డొక్కా మధ్య మధ్యలో.. మన పార్టీలో జగన్ గారి నిర్ణయమే ఫైనల్. ఎవరూ ప్రశ్నించలేరు. ఆయనను కాదని ఏమీ చేయలేం. అంగీకరించి తీరాల్సిందే. అందుకే సుచరిత గారి గెలుపు కోసం కృషి చేస్తా’ అంటూ.. ‘‘జగనన్నకు ఎవరూ చెప్పలేరు. చెప్పినా ఆయన వినరు’’ అన్న రహస్యాన్ని, చెప్పకనే చెప్పేశారు.

ఇలా అవమాన పర్వాన్ని చాలా సీరియస్‌గా చె ప్పిన డొక్కా.. ఇక్కడ పెద్దలు అయోధ్య రామిరెడ్డిగారు, అప్పిరెడ్డి, బ్రహ్మానందరెడ్డిగారు ఉన్నారు. నాకేమీ లేదు. నాకొక్కసారి సీఎం గారిని చూసే అవకాశం కల్పించాలని కోరుతున్నా’నంటూ పేద్ద బాంబు పేల్చారు. అంటే తన లాంటి జిల్లా అధ్యక్షులను కూడా జగన్ కలవరన్న నిజాన్ని తెలిసీ తెలియకుండా బయటపెట్టేశారు.

నిజానికి వైసీపీ అధినేత-సీఎం జగన్ మంత్రులు-ఎమ్మెల్యేలు-ఎంపీలను కలవరన్న విమర్శ చాలా ఏళ్ల నుంచీ ఉంది. ముఖ్యమైన అంశాలుంటేనే ప్రాంతీయ సమన్వయకర్తలను మాత్రమే కలుస్తారు. కడప జిల్లాలో కీలకమైన నలుగురైదుగురు, చెన్నై తమ్ముడితో మాత్రమే తరచూ మాట్లాడతారట. అందులో దాపరికమేమీ లేదు.

చాలామంది సీనియర్లు తమకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ధనుంజయరెడ్డి-సజ్జల రామకృష్ణారెడ్డిలోనే తాము జగనన్నను చూసుకుంటున్నామని వాపోయేవారు. తాజాగా స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడైన డొక్కా .. అది కూడ ఒక దళిత నేత, తనకు జగన్‌ను చూసే అదృష్టం-అవకాశం జమిలిగా కల్పించాలని వేదికపై.. అగ్రనేతల సాక్షిగా వేడుకున్నారంటే.. ‘‘వెంకన్న దర్శనం సులభం. జగనన్నను కలవడం దుర్లభం’’ అన్న ప్రచారాన్ని, ఎండార్స్ చేసినట్లే లెక్క. పేరు వరప్రసాదరావే కానీ.. పాపం ఆయనకు వరమూ లేదు.. ప్రసాదమూ దొరకలేదు!

LEAVE A RESPONSE