Suryaa.co.in

Editorial

ఆస్తి ఇవ్వమంటే.. అప్పులిచ్చిన జగనన్న

-ఆస్తి కాదు.. అప్పు ఇచ్చిన జగనన్న!
– షర్మిలకు 82 కోట్లు అప్పు ఇచ్చిన జగనన్న
– వదిన భారతీరెడ్డి దగ్గర 76 లక్షల అప్పు
– షర్మిలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువట
– అంటే జగనన్న ఆస్తులు చెల్లికి పంచలేదా?
– అప్పులే ఆస్తులు పంచారా?
– షర్మిల నామినేషన్‌పై సోషల్‌మీడియాలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన ఆఖిలాంధ్ర మహిళలకు అన్న. అక్కాచెల్లెమ్మలకు చేతికి ఎముక లేకుండా సర్కారు సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. అలాంటి సొంత చెల్లెమ్మకు ఆస్తి ఇంకా ఏ స్థాయిలో పంచి ఉండాలి? చేతికిఎముకలేదన్న ప్రచారం ఉన్న జగనన్న, సొంత చెల్లి షర్మిలకు వందలకోట్లు పంచి ఉండాలి కదా? కానీ.. జగనన్న చెల్లి షర్మిల తాజా అఫిడవిట్ చూస్తే, అన్నయ్య సొంత చెల్లెమ్మ షర్మిలకు చేయిచ్చారా? ఆస్తి పంచాల్సిన జగన్ అన్నయ్య, అప్పులిచ్చాడా? అదేంటి? ఆస్తులు పంచమంటే అప్పులిచ్చారనుకుంటున్నారా? అవును. నిజం. ఇది స్వయంగా జగనన్న చెల్లి షర్మిల, తన అఫిడవిట్‌లో పేర్కొన్న పచ్చి నిజాలు. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో చర్చగా మారింది.

ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కడప ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. దానితో ఆమె ఆస్తులు-అప్పులేమిటో బయటపడ్డాయి. ఇప్పటివరకూ ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో, ఆమె ఆస్తులెంతో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఎన్నికల్లో ఆస్తులు- అప్పులపై అఫిడవిట్ ఇవ్వడం తప్పనిసరి కావడంతో, షర్మిల ఆస్తుల వ్యవహారం వెలుగుచూసింది.
ఆ ప్రకారంగా ఆమె.. తన సొంత జగనన్న దగ్గర 82 కోట్ల 58 లక్షల 15 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. తన వదిన భారతీరెడ్డి దగ్గర కూడా 19 లక్షల 56 వేలు అప్పు చేశారట. ఇది చూసిన నెటిజన్లు, సోషల్‌మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘‘అన్నయ్య చెల్లెమ్మకు ఇంకా ఆస్తి ఇచ్చారేమోననుకున్నాం. కానీ తరతరాలు కూడా తీర్చలేనంత అప్పు ఇచ్చారని తెలుసుకుని ఆశ్చర్యపోయామ’’న్న కామెంటు పెడుతున్నారు.

మరికొందరు ‘ఏ అన్నయినా చెల్లికి ఆస్తులు పంచుతారు. ఈ జగనన్న ఏంటి అప్పులిచ్చారు’ అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు మాత్రం ‘ఇంతకూ జగనన్న ఇచ్చింది ఆస్తులా ఆ పేరుతో అప్పులా? అప్పులే ఆస్తులుగా చూపించారా?’ అని శరపరంపరగా సందేహాలు కురిపిస్తున్నారు.

ఏదేమైనా.. షర్మిల నామినేషన్‌తో జగనన్న తన చెల్లి ఆస్తులు కాకుండా.. అప్పులిచ్చారన్న విషయంతోపాటు… ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశారన్న వైనం, సోషల్‌మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకూ షర్మిలకు జగనన్న ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశారని, ఆ ఆగ్రహంతోనే ఆమె తన అన్నపై తిరుగుబాటుకు తెరలేపారన్న భావన క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. ఈ అనుమానాలు నిజం చేస్తూ, ఆమె సమర్పించిన తాజా అపిడవిట్ షర్మిలకు మహిళలలో మరింత సానుభూతి పోగుచేశాయి.

తండ్రి మృతి తర్వాత చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు పంచకుండా, తన అన్న కావాలనే తాత్సారం చేశారన్న ఆగ్రహం షర్మిలలో ఉంది. దీనిపై విజయమ్మ సమక్షంలో ఎన్నిసార్లు చర్చించినా అన్న బేఖాతరు చేయడంతో, షర్మిల ఆయనపై బాణం ఎక్కుపెట్టారన్నది పులివెందులలో వినిపించే మాట.

ఇదిలాఉండగా షర్మిలకు, సాక్షి మీడియాలో కూడా వాటా ఉందన్న భావన చాలామందికి ఉంది. ఒకదశలో షర్మిల సైతం ఈ విషయాన్ని మీడియా సమక్షంలో ధృవీకరించారు. అయితే తాజాగా సొంత మీడియాలోనే, షర్మిల-సునీతకు వ్యతిరేకంగా కథనాలు వస్తుండటంతో, ఆమెకు సాక్షి మీడియాలో వాటాలు లేవన్న అనుమానం వ్యక్తమవుతోంది.

LEAVE A RESPONSE