Suryaa.co.in

Editorial

బీజేపీ..భలే భలే!

– అనపర్తి టీడీపీ అభ్యర్ధికి కాషాయం కండువా?
– దెందులూరు మళ్లీ చింతమనేనికే
– ప్రభాకర్‌కు బీ ఫారంతో అనపర్తి బీజేపీ సీటు నల్లమిల్లి ఖరారు
– పురందేశ్వరి కోసం ఇదో త్యాగం
– రఘురామకృష్ణంరాజు తమ పార్టీ కాదన్న పురందేశ్వరి
– మరి అనపర్తి అభ్యర్ధి బీజేపీ నాయకుడా?
– వరప్రసాద్‌కు అప్పటికప్పుడే తిరుపతి ఎంపీ సీటు
– కస్సుమంటున్న కమలదళం
– పార్టీలో లేని మాధవీలతకు హైదరాబాద్ ఎంపీ సీటు
– తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ టికెట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ అంటే సిద్ధాంతాల మడి కట్టుకున్న పార్టీ. ఒక్క ఓటు కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ సిద్ధాంతానికి కట్టుబడి, దానిని వాడుకోకుండా ప్రభుత్వాన్నే తృణప్రాయంగా వదిలేసుకున్న పార్టీ. ఇదంతా ఒకప్పుడు. అంటే వాజపేయి-అద్వానీ కాలం నాటి కమలంం అన్నమాట!

కానీ నేటి కమలం రూపురేఖలు మారిపోయాయి. గెలుపే ముఖ్యం. అధికారమే లక్ష్యం. సిద్ధాంతాల రాద్ధాంతాల సంగతి తర్వాత! అసలు పార్టీలో లేకపోయినా సీటు ఇచ్చేంత ‘పరిణామ క్రమాని’కి ఎదిగిన సైద్ధాంతిక పార్టీ. అది ఆంధ్రాలో అయినా, తెలంగాణలో అయినా సరే. మరి సిద్ధాంతాల మడిబట్ట ఏమైంది? ఆదర్శ ప్రవచనాలు ఏమయ్యాయి?.. ఇదీ ఇప్పుడు కమలనాధుల అంతర్మథనం.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన రామకృష్ణారెడ్డి ఇప్పుడు బీజేపీ అభ్యర్ధి. నిజమా? అవును. నిఝంగా నిజం! అదేంటి? టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన రామకృష్ణారెడ్డికి బీజేపీ సీటు ఎలా ఇస్తున్నారు? అసలు ఆయనకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు కదా? మొన్నామధ్య రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ సీటు ఎందుకివ్వలేదని అడిగితే… ఆయన పార్టీలో లేరుకదా అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాకు ఇచ్చిన జవాబు.

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ పార్లమెంటు పరిథిలోని అనపర్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చాలారోజుల క్రితమే ఖరారయ్యారు. రాజమండ్రి ఎంపీ పరిథిలో అనపర్తి కీలక ం. అక్కడ మెజారిటీ వస్తే, రాజమండ్రి ఎంపీ సీటు గెలిచినట్లే లెక్క. అలాంటి టీడీపీ అభ్యర్థి స్థానంలో బీజేపీ అభ్యర్ధిని ప్రకటించారు. అక్కడ రెడ్ల ఆధితప్యమే ఎక్కువ. కానీ బీజేపీ విచిత్రంగా రాజులకు అసెంబ్లీ సీటిచ్చింది. దానితో టీడీపీ అభ్యర్ధి నల్లమిల్లి అడ్డం తిరిగారు. ఆయనకు మద్దతుగా అనపర్తి తమ్ముళ్లు రోడ్డెక్కారు. దానితో గందరగోళం.

అనపర్తి సీటు నల్లమిల్లికి ఇవ్వకపోతే రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి పురందేశ్వరి గెలుపు అనుమానమే. మరేం చేయాలి? నల్లమిల్లినే బీజేపీలోకి తీసుకుని పార్టీ టికెట్ ఇస్తే సరిపోతుంది కదా? కానీ ఆయనకు బీజేపీలో ప్రాధమిక సభ్యత్వమే లేదు. మరెలా? అయినా సరే.. ఆయనను బీజేపీలో చేరమని కోరారు. ముందుససేమిరా అన్న రామకృష్ణారెడ్డి తర్వాత మెత్తపడి, కాషాయధారి అయేందుకు ఒప్పుకున్నారట. ఆ రకంగా నల్లమిల్లి బీజేపీ అభ్యర్ధి అవతారమెత్తనున్నారు. దెందులూరు బీ ఫారం చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడంతో, నల్లమిల్లి అనపర్తి బీజేపీ అభ్యర్ధి అవతారమెత్తడం ఖాయమయింది. మరి సిద్ధాంతాలు, నైతిక ప్రవచనాలు ఏమయ్యాయన్నది కమలనాధుల ప్రశ్న.

మరి ఈ సిద్ధాంతం నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు ఎందుకు వర్తించదు? తమ పార్టీలో రాజు లేరన్న పార్టీ కీలక నేత, మరి నల్లమిల్లి దశాబ్దాల నుంచి పార్టీలో కొనసాగుతున్నారా? లేదు కదా?! మరి ఆయనకు ఏ అవసరాల ప్రాతిపదికన బీజేపీ సీటిస్తున్నారు? ఆ ప్రకారంగా నర్సాపురం ఎంపీ సీటు రఘురామరాజుకు కూడా, నల్లమిల్లికి ఇచ్చినట్లే ఎందుకు సీటివ్వరు? ఇస్తే ఒక ఎంపీ సీటు బీజేపీకి వచ్చేది కదా? అన్నది బీజేపీ శ్రేణుల ప్రశ్న. అంటే పురందేశ్వరి విజయం కోసం పార్టీలో లేని నల్లమిల్లికి అనపర్తి ఇచ్చిన నాయకత్వం.. పార్టీ కోసం నర్సాపురం సీటును గెలిచే రఘురామకృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వడం లేదన్నది బీజేపీ శ్రేణుల ప్రశ్న.

ఇక తిరుపతి ఎంపీ సీటును కూడా పార్టీకి చెందిన నేతకు కాకుండా, అప్పుడే చేరిన వైసీపీ నేత వరప్రసాద్‌కు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వరప్రసాద్ ఏమైనా ఏళ్ల తరబడి పార్టీలో పనిచేస్తున్నారా? ఆ సూత్రం రఘురామకృష్ణంరాజుకు ఎందుకు వర్తించదు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అటు తెలంగాణలో కూడా ఇలాంటి సిద్ధాంతాల రాద్ధాంతాలే. పార్టీలో చేరని మాధవీలతకు, ఆగమేఘాలపై హైదరాబాద్ ఎంపీ సీటు ఇచ్చిన బీజేపీ నాయకత్వం… బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి నాలుగురోజుల ముందు వచ్చిన వారికి ఎంపీ సీటు ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.

అంటే దీన్నిబట్టి.. పార్టీలో పనిచేసేవారికి స్థానం లేదన్న వాస్తవంతోపాటు.. పక్కపార్టీ వాళ్లకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నది స్పష్టమయిందని బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రధానంగా.. దేశంలో రెండుసార్లు అధికారంలో కొనసాగుతున్న జాతీయ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సరైన నేత లేకనే, పక్క పార్టీల నుంచి అభ్యర్ధులను నిలబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి తనయుడితోపాటు.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్గొండ ఎంపి సీటు, జహీరాబాద్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి వివిపాటిల్, వరంగల్ ఎంపి సీటు ఆరూరి రమేష్ కు, మహబూబాబాద్ బీఆర్‌ఎస్ నేత సీతారాంనాయక్‌కు బీజేపీ ఎంపీ సీటు కేటాయించడంపై పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. వీరంతా పార్లమెంటు ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పార్టీలో చేరిన వారే కావడం విశేషం.

LEAVE A RESPONSE