Suryaa.co.in

Editorial

కేశినేనిది స్వయంకృతమే!

– పార్టీ కంటే తానే ఎక్కువన్న భావన
– తనది బాబు స్థాయి అనుకునే వైఖరి
– నానికి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు 30,679 ఓట్లు మాత్రమే.
– పార్టీ విధానాలను గౌరవించని తీరు
– పార్టీ సభలకూ రాని ధిక్కారం
– సీనియర్లను ఖాతరు చేయని వైనం
-తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు
– వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదంటున్న సీనియర్లు
– మరో పార్టీలో నాని తీరు నడవదని స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే జరిగింది. చాలాకాలం నుంచి అసంతృప్తితో టీడీపీలో కొనసాగుతున్న టీడీపీ విజయవాడ ఎంపి కేశినేని నాని.. ఎట్టకేలకూ ఆ పార్టీని వీడారు. బయట వివాదరహితుడు, నిజాయితీపరుడుగా పేరున్న నానికి.. పార్టీలో మాత్రం వివాదాస్పదుడన్న పేరుంది. వ్యవస్థకు తప్ప, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వని రాజకీయ పార్టీల నుంచి… వ్యక్తిగత ప్రాధాన్యం కోరుకోవడమే, ఇన్ని సమస్యలకూ కారణంగా స్పష్టమవుతుంది.

నిజానికి టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. మిగిలిన ఇద్దరిదీ పార్టీ లైనయితే… నానిది మాత్రం సొంత దారి. మిగిలిన ఇద్దరూ అధినేత చంద్రబాబును అనుసరిస్తుంటే, నాని మాత్రం తనది చంద్రబాబు స్థాయి అని భావిస్తుంటారు. నాని టీడీపీ నిష్క్రమణకు అదే ప్రధాన కారణమన్నది, తమ్ముళ్ల విశ్లేషణ. అలాగని నాని మంచి వక్త కాదు. గ్లామర్ ఉన్న లీడర్ కాదు. జనాలకు అందుబాటులో ఉండే నాయకుడంతే!

పోనీ స్థానికంగా సొంత పార్టీ అగ్రనేతలతో సఖ్యతగా ఉంటారా అంటే అదీ లేదు. అందరితోనూ విబేధాలే. వారి గురించి బహిరంగంగానే పరోక్ష విమర్శలు కురిపిస్తుంటారు. తిరువూరు వెళ్లి.. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై యుద్ధం చేస్తున్న టీడీపీ నేతల మనోభావాలు దెబ్బతినేలా.. అధికార పార్టీ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఫలితంగా ఆయన వెంట ఒక్క అగ్రనేతకూడా లేని పరిస్థితి.

ఎన్నికల్లో తాను చెప్పిన వారికే సీట్లు ఇవ్వాలన్న పట్టుదల నుంచి.. ప్రచారం వరకూ తన మాటే నెగ్గాలన్న పంతం ఆయన సొంతం. సహజంగా పార్టీ అధినేతలెవరూ నేరుగా మాట్లాడే సందర్భాలు బహు తక్కువ. వైసీపీ అధినేత-సీఎం జగన్ అయితే అసలు మంత్రులు-ఎంపీలతోనే మాట్లాడరు. కానీ చంద్రబాబు తీరు అందుకు భిన్నం. బాబు దాదాపు ముఖ్య నేతలందరితో బాబు మాట్లాడతారు. వెళ్లే ముందో.. వచ్చే ముందో మాట్లాడతారు. జిల్లా పార్టీకి సంబంధించిన అంశాలుంటే ఆయా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే-ఎంపీలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడతారు.

ఇక సందర్భానుసారం టెలీకాన్ఫరెన్సుల ముచ్చట్లు సరేసరి. ఒక్కోసారి పని ఒత్తిడి ఉంటే.. ఆయన రాజకీయ కార్యదర్శి, పార్టీ ఆఫీసు ఇన్చార్జి టిడి జనార్దన్‌లాంటి వారు, సీనియర్లకు ఫోన్ చేసి బాబు మాటగా సమాచారం చేరవేస్తుంటారు. అంటే ఆ స్థాయి నేతలు చెబితే చంద్రబాబు చెప్పినట్లే లెక్క. వీరంతా తమ సమయం మొత్తాన్ని పార్టీకే వెచ్చిస్తుంటారు. నిద్రపోయే ముందు వరకూ, పార్టీ ఉన్నతి-విస్తరణ కోసమే ఓపికతో పనిచేస్తుంటారు.

ఒకరకంగా చెప్పాలంటే అధినేతకు వీరే కళ్లు, చెవులు. అలాంటి కీలక నేతలంటే నానికి చులకన. లెక్కచేయరు. వారు ఫోన్ చేసినా ‘నేను ఎవరితో మాట్లాడను. బాబుతోనే మాట్లాడతా’ అనే ధిక్కారపర్వమే, నానిని పార్టీకి దూరం చేసిందన్నది తమ్ముళ్ల విశ్లేషణ.

మహానాడు అనేది పార్టీకి పండుగ. దానికి స్థాయి బేధాలు లేకుండా నేతలంతా హాజరవుతారు. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై ఆ వేదికపై చర్చిస్తారు. అలాంటి సభలకూ నాని వెళ్లరు. క్యాడర్‌లో చైతన్యం నింపిన పార్టీ ఉత్తరాధికారి లోకేష్ పాదయాత్రకు.. అధ్యక్షుడు అచ్చెన్న, యనమల, సోమిరెడ్డి, అశోక్‌గజపతిరాజు, బుచ్చయ్యచౌదరి, రామ్మోహన్‌నాయుడు, పితాని, కోట్ల, కన్నా, దేవినేని ఉమ, షరీఫ్, యరపతినేని వంటి అగ్రనేతలంతా హాజరయ్యారు.

లోకేష్ పాదయాత్ర చేస్తున్న జిల్లాలకు వెళ్లి మరీ, ఆయనకు సంఘీభావం ప్రకటించారు. కానీ నాని మాత్రం లోకేష్ బెజవాడ పాదయాత్రకు వచ్చినా కనిపించరు. ఇక పార్టీ ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవానికి సైతం డుమ్మా కొట్టారు. దీన్నిబట్టి కేశినేని మానసిక పరిస్థితి ఏమిటన్నది, సులభంగా ఊహించుకోవచ్చని బెజవాడ తమ్ముళ్లు విశ్లేషిస్తున్నారు. పార్టీని ఖాతరు చేయని నేతను.. పార్టీ ఎందుకు మోస్తుందన్నది వారి ప్రశ్న.

పార్టీ కంటే తానే ఎక్కువ అని భావించే, ఈ తరహా నేతలనూ ఏ రాజకీయ పార్టీ భరించదన్నది పరిశీలకుల విశ్లేషణ. అసలు అందరికీ అందుబాటులో ఉండే చంద్రబాబునే లెక్కచేయని నాని లాంటి నేతలు… మంత్రులు-ఎంపీలు-ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్లు ఇవ్వని అధినేతల వద్ద, ఎలా మనుగడ సాగిస్తారో అర్ధం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలు, తాను చెప్పిందే వినాలనుకునే నాని లాంటి నేతలను, రాజకీయ నాయకత్వాలు ఎక్కువ కాలం భరించవని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయంలో అందరికంటే బాబుకే సహ నం ఎక్కువ అన్నది నిర్వివాదం. బాబు ఎవరినీ పార్టీ నుంచి పోగొట్టుకోవాలని చూడరు. ధిక్కారాన్ని కూడా కొంతవరకూ సహిస్తారు. ఆ తరహా నేతలకు చాలా సమయం ఇస్తుంటారు. బుజ్జగిస్తుంటారు. సీనియర్లను పురమాయించి వారితో మాట్లాడిస్తుంటారు. ఇక సదరు నేతల వ్యవహారం శృతిమించితే వారిని చివరలో వదిలేస్తారు. అలాంటి నేతకు అసహనం తెప్పించిన నాని, అసలు ఇంతకాలం పార్టీలో కొనసాగడమే ఆశ్చర్యం అని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

నాయకుడు ఏ స్థాయికి ఎదిగినా, పార్టీని గౌరవించకపోతే వారు ఎక్కువ కాలం ఆ పార్టీలో మనుగడ సాగించలేరని వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విపరీతమైన ఇమేజ్-పొలిటికల్ గ్లామర్ ఉన్న వైఎస్ సైతం, రాష్ట్రంలో సీనియర్లను ఢీకొన్నప్పటికీ.. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగానే ఉన్నారు. అదే ఆయనను సీఎం వరకూ తీసుకువెళ్లిన విషయాన్ని విస్మరించకూడదు. ఇక్కడ నాని అటు సొంత నియోజకవర్గ నేతలతోపాటు, నాయకత్వాన్నీ లెక్కచేయని వైచిత్రి.

పోనీ నాని ఏమైనా తన సొంత ఇమేజీతో ఎమ్మెల్యేలను గెలిపించారా అంటే లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఎంపి అభ్యర్ధి నానికి మొత్తం 5,75,498 ఓట్లు వస్తే.. ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులకు 5,44,819 ఓట్లు వచ్చాయి. అంటే.. విజయవాడ లోక్‌సభ పరిథిలో.. తాను చెప్పిందే జరగాలనుకునే నానికి, వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు 30,679 ఓట్లు మాత్రమే.

నిజానికి చంద్రబాబుపై .. విజయవాడ ఎంపీ సీటుకు సంబంధించి బోలెడు ఒత్తిళ్లు. సిఫార్సులు! జనసేనాధిపతి పవన్.. తన మిత్రుడైన, నిర్మాత పివిపికి సీటు సిఫార్సు చేశారు. అయినా వాటిని కాదని చంద్రబాబు.. కేశినేని నానికే సీటు ఇచ్చిన వైనాన్ని బెజవాడ తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు.

నిజంగా నానికి జనంలో అంత వ్యక్తిగత ఇమేజ్ ఉంటే, అంత తక్కువ ఓట్లే ఎలా వస్తాయి? అందుకు కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువ రావాలి కదా? నాని బలం అధికంగా ఉంటే విజయవాడలో ఒక్క సీటు మినహా, మిగిలిన 6 స్థానాల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది? అంటే నాని తనకు ఉందనుకుంటున్న బలం అంతా.. పార్టీ ద్వారా వచ్చిందే తప్ప, సొంతది కాదన్నది తమ్ముళ్ల లాజిక్ !

1 COMMENTS

LEAVE A RESPONSE