అయ్యో.. అమాత్యా!

దండాలకే దిక్కులేని మంత్రులు
మంత్రులను పట్టించుకోని అధికారులు
దుర్గ గుడిపై డిప్యూటీ సీఎంను దేకని అధికారులు
ఈఓ వచ్చిన తర్వాతనే బూడి ముత్యాలనాయుడుకు అమ్మవారి దర్శనం
కర్నూలులో ఆహ్వానం లేని మంత్రి బుగ్గన, గుమ్మలూరి
ఇద్దరు కమిషనర్లకు కలెక్టరు షోకాజ్‌ నోటీసులు జారీ
సచివులు ఉత్సవ విగ్రహాలేనా?
పెత్తనమంతా సీఎంఓదే
( మార్తి సుబ్రహ్మణ్యం)

పగవాడికి సైతం రానన్ని సినిమా కష్టాలు ఏపీ మంత్రులకు వరస వెంట వరస వస్తున్నాయి. పేరుకు మంత్రులు. పీఏ, పీఎస్‌, నౌకర్లు, చాకర్లు ఉన్నా బయటకెళితే ఒక్కరూ గౌరవించే దిక్కులేదు. కనీస మర్యాదకే నోచుకోని అధికారం. జిల్లా కలెక్టర్లు మాట వినరు. సొంత శాఖల్లో ముఖ్య కార్యదర్శులయితే అసలు పట్టించుకోరు. వారంతా సీఎంఓ ఆదేశాల కోసమే ఎదురుచూస్తారు. సదరు అధికారులకు సీఎంఓనే బాస్‌. పెత్తనమంతా సీఎంఓదే. వారి దృష్టిలో సచివులకు పెద్దగా విలువుండదు. దేవాలయంలోని వెళ్లేందుకే దిక్కులేని మంత్రులున్నారంటే.. ఇక వారి అధికారాలేమిటని పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదు. ఇదీ ఏపీలో అయ్యో.. అమాత్యుల పరిస్థితి.

సహజంగా ప్రతిపక్షంలో ఉన్నవారికి అధికారులు ప్రొటోకాల్‌ నిబంధనలు పెద్దగా పాటించరు. ఒక్కోసారి క్యాబినెట్‌ మంత్రి హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతల విషయంలోనూ, అలాంటి బేఖాతరిజమే కనిపిస్తుంటుంది. దానితో విపక్ష సభ్యులు, తమకు అవమానం జరిగిదంటూ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తుంటారు. విపక్షాలకు అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని విమర్శిస్తుంటారు. కానీ ఏపీలో ఇది రివర్సవుతోంది. స్వయంగా మంత్రులకే ప్రొటోకాల్‌ పాటించని వైచిత్రి ఇది.

విజయవాడ కనకదుర్గ గుడిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీవీఐపిలు వెల్లువెత్తుతున్న ఆ దసరా భక్తజన జాతరకు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ తరలివ స్తుంటారు. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కూడా బుధవారం అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చారు.

వచ్చినాయన ఉప ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటివాడని అంతా అనుకుంటారు. కానీ ఆయన కూడా మామూలు మంత్రుల్లో ఒకరే. అది చాలామందికి తెలియని నిజం. అది వేరే విషయం. కాబట్టి అతిథి మర్యాదలు, ప్రొటోకాల్‌ వంటి గౌరవ మర్యాదలన్నీ అదిరిపోతాయని కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడు కూడా, ఆశించి ఉండటంలో తప్పులేదు. పైగా అది టీటీడీయేమీ కాదు కాబట్టి, తమకు వచ్చిన మర్యాదకు లోటు ఉండదని సారు గారితో వచ్చినవాంతా అంచనా వేయడం అంతకంటే తప్పు కాదు.

అయితే అనుకున్నది జరిగి ఉంటే కథ సుఖాంతమయ్యేది. కానీ.. అక్కడ జరిగింది అవమానం. స్వయంగా ఉప ముఖ్యమంత్రి వచ్చినా, అధికారులు ప్రధాన ఆలయంలోకి అనుమతించలేదు. బయటే నిలిపివేశారు. క్యూదారిలో వెళ్లాలని అక్కడి సిబ్బంది సలహా ఇవ్వడంతో , ఉప ముఖ్యమంత్రిగారు చేసేది లేక బయట నిలబడిపోయారు. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఉప ముఖ్యమంత్రిని నిలిపివేశారంటూ టీవీ చానెళ్లలో వార్త గుప్పుమంది. ఈ విషయం తెలుసుకున్న ఈఓ హుటాహుటిన ఆయన వద్దకు వెళ్లి, అమ్మవారి దర్శనానికి తీసుకు వెళ్లారు. అయితే నివేదన సమయంలో ఎవరినీ అనుమతించరన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, మంత్రి గారి అవమాన పర్వానికి తెరదింపే ప్రయత్నం చేశారు. కానీ ఎలక్ట్రానిక్‌- సోషల్‌మీడియాలో మాత్రం జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. బయటకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి ముత్యాలరాజు.. దర్శనం బ్రహ్మాండంగా జరిగిందని, అంతకుముందు జరిగిన అవమానం దిగమింగుకుని మరీ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈఓ భ్రమరాంబ పుణ్యాన దర్శనం దివ్యంగా జరిగింది కాబట్టి ఆ కథ అక్కడికి సుఖాంతమయినట్లే.

మరోవైపు కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులకు సైతం ప్రొటోకాల్‌ అవమానం జరగడం చర్చనీయాంశమయింది. ఎమ్మిగనూరు, ఆదోనిలో టిడ్కో గృహాలను మున్సిపల్‌ శాఖామంత్రి సురేష్‌బాబు ప్రారంభించారు. వాటికి అదే జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కార్మిక మంత్రి జయరామ్‌లకు సంబంధిత మున్సిపల్‌ కమిషన్లు, ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపలేదు. దానితో ఆగ్రహించిన వారిద్దరూ, తమకు జరిగిన అవమానం గురించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన జిల్లా కలెక్టర్‌ వివరణ ఇవ్వాలని ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపల్‌ కమిషనర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులది ఇదే పరిస్థితి. జిల్లా కలెక్టర్లకు మంత్రులు ఫోన్లు చేసినా పకలని లెక్కలేనితనం. ఏదైనా ముఖ్యమైన సమస్యలకు సంబంధించి సూచనలు చేసినా పట్టించుకోని నిర్లక్ష్యం. సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలు మాత్రమే కలెక్టర్లు పాటిస్తున్నారని.. జిల్లాలో కలెక్టరు, ఎస్పీలు తమ మాట వినడం లేదన్నది మంత్రుల అసంతృప్తి. దీనితో ఏదైనా కీలకమైన అంశాలుంటే, మంత్రులు సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని శరణువేడుతున్న పరిస్థితి నెలకొంది.

గతంలో మాచర్లలో చాపకూటి సిద్ధాంత సంబరాలను వేడుకగా చేయాలని అక్కడి ఎమ్మెల్యే భావించి, కలెక్టరును నిధులు కోరారు. కానీ ఆయన తన వద్ద అంత నిధులు లేవని చేతులెత్తేశారు. దానితో ఆ ఎమ్మెల్యే సీఎంఓను సంప్రదించడం, సీఎంఓ రంగంలోకి దిగి కలెక్టరుతో మాట్లాడి నిధులు విడుదల చేయించడం జరిగిపోయాయి. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే సీఎం చాంబరు కంటే.. సీఎంఓ అధికారుల చాంబర్ల దగ్గరే మంత్రులు, ఎమ్మెల్యేల హడావిడి కనిపిస్తోంది.

మంత్రుల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే, ఇక ఎమ్మెల్యేల గోడు చెప్పనలవి కాదు. వారి వేదన వర్ణనాతీతం. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రతిపాదనలు, మూడేళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎవరినడిగినా నిధులు లేవన్న సమాధానమే. చివరకు సంబంధిత శాఖల మంత్రులను కలసి, తమ గోడు వెళ్లబోసుకుంటే.. ‘మాకే దిక్కులేద’న్న, ‘ మంత్రుల ఎదురుగోస’ను ఎమ్మెల్యేలు వినాల్సిన వైచిత్రి నెలకొంది.

Leave a Reply