నాకు.. ఇక డ్రీమ్సేమీ లేవు!

Spread the love

( మార్తి సుబ్రహ్మణ్యం)

మాస్ లోకాలిటీలో పుట్టి తెలుగు రాష్ట్రాల్లో మాస్ లీడర్‌గా ఎదిగిన తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇప్పుడు తనకెలాంటి డ్రీమ్స్ లేవంటున్నారు. సికింద్రాబాద్‌లో పక్కా మాస్ ఏరియా అయిన ఆదయ్యనగర్‌లో పుట్టిన తాను, అమెరికాలో రోడ్డుపై నడుస్తుంటే కనీసం 50 మంది వచ్చి తనను కలుస్తున్నారంటే అంతకంటే ఇంకేం కావాలంటున్న తలసాని, తన కుటుంబమే తన బలం అంటున్నారు. జీవితంలో ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి వరకూ అంతా అనుకోకుండానే వచ్చాయంటున్న తలసాని శ్రీనివాసయాదవ్ పంచుకున్న తన అనుభవాలివి.

Q:కార్పొరేటర్‌గా ఓడినప్పుడు, ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పుడు మీ ఫీలింగ్
తలసాని: కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పుడు నేను చిన్నవాడిని. మోండా మార్కెట్‌లో యూనియన్ లీడర్‌ను. అయినా సరే ఫ్రెండ్స్ సూచన మేరకు కార్పొరేటర్‌గా పోటీ చేశా. అంతకుముందు కాలేజీ
minsiter-charge యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచా. ఆ ఉత్సాహంతోనే పోటీ చేశా. కుర్రవాడిని కావడంతో అప్పట్లో ఓటమిని ఈజీగా తీసుకున్నా. కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చాలా సంతోషించా. ఆ తొలి విజయం మాటల్లో చెప్పలేనిది. పైగా చిన్న వయసులో ఎమ్మెల్యేనయ్యా. అదింకా గుర్తుంది.

అసెంబ్లీని చూస్తూ బుల్లెట్ నడిపేవాడిని
మా అత్తగారిల్లు నాంపల్లి దారుసలాం దగ్గరుండేది. అప్పట్లో నాకు బుల్లెట్ ఉండేది. నాకు బుల్లెట్ నడపమంటే మహా ఇష్టం. అఫ్ కోర్స్. ఇప్పటికీ అనుకోండి. అప్పట్లో అదో క్రేజ్. నేను చాలా బుల్లెట్ ర్యాలీలు చేశా. ఆ దారిలో వెళుతూ మధ్యలో ఉన్న అసెంబ్లీని అలా చూస్తూ వెళ్లేవాడిని. జీవితంలో ఒక్కసారయిన అందులోకి వెళ్లాలని అనుకునేవాడిని. ఎన్టీఆర్ దయతో నాకు ఆ అదృష్టం దక్కింది. ఇక అక్కడి నుంచి వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతా దైవలీల. నేను దేవుడిని బాగా నమ్ముతా. ప్రజాజీవితంలో నన్ను ఇంతవాడిని చేసిన ఆ దేవుడి రుణం తీర్చుకునేందుకు ఇప్పటికీ గుళ్లు కట్టిస్తుంటా. గుళ్లకు విరాళాలిస్తుంటా. మహంకాళి జాతర వస్తే నా బ్రాండ్ ఉంటుంది. మహంకాళి ఆలయం వ ద్ద పెద్ద ఆర్చి కూడా కట్టిస్తున్నా. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లని నమ్మే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని వందశాతం పాటిస్తా.

Q:మీది లవ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
తలసాని:అప్పుడు ఈ లవ్వులు గివ్వులు ఎక్కడున్నాయ్ బాస్. అమ్మా-నాయన చెప్పిన వాళ్లను చేసుకోవడమే. 25 ఏళ్లు రాగానే పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లలు. నేనూ అంతే. పెద్దలు కుదిర్చిన సంబంధమే. 25వ ఏటనే పెళ్లిచేశారు.

Q: 40 ఏళ్ల క్రియాశీల రాజకీయ జీవితంలో బిజీగా ఉంటున్న మీరు, కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? బిజీ లైఫ్‌తో ఫ్యామిలీ లైఫ్ మిస్సయ్యానన్న ఫీలింగ్ కలిగేదా?
నేను ఎంత బిజీగా ఉన్నా నా కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తా. ప్రజలు నన్ను నమ్మి ఎన్నుకున్నప్పుడు వారికి సర్వీసు చేయడమే ధర్మం. అయితే నేనున్న పార్టీ అధికారంలో ఉంటే బిజీ కొంచెం ఎక్కువగా, ప్రతిపక్షంలో ఉంటే కొంచెం తక్కువ బిజీగా ఉండటం సహజం. మంత్రిగా ఉంటే ఇంకా ఎక్కువ సమయం ప్రజల మధ్య గడపాల్సి ఉంటుంది. నా డిపార్టుమెంట్ పనులే కాదు. ఇతర శాఖలతో సమన్వయం విషయంలో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అయినా సరే.. నేను కుటుంబానికి సమయం ఇస్తా.నా ఒక్క కుటుంబమే కాదు. నా బ్రదర్స్ ఫ్యామిలీ కష్టసుఖాలు, వాళ్ల పిల్లల మంచిచెడ్డలూ
talasani-brothers చూస్తా.వాళ్ల పిల్లలంతా నా దగ్గరికే ఎక్కువగా వస్తుంటారు. మా కుటుంబంలో ఏడాదికి దాదాపు 10 ఫంక్షన్లు జరుగుతాయి. అంతా కలుస్తాం.

Q:పిల్లల చదువులపై మీరు చూపిన శ్రద్ధ ఎంత? వారి కోసం మీ భార్య కేటాయించే సమయం ఎంత? కుటుంబ బరువు బాధ్యతల్లో మీ భార్య పాత్ర ఎంత?
నిజాయితీగా చెప్పాలంటే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోసింది నా భార్యనే. పిల్లల చదువులు, వారి మంచి చెడ్డలన్నీ ఎక్కువగా తానే చూసుకునేది. అయితే నేను కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లలు ఏం చదవుతున్నారో వాళ్ల స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లతో మాట్లాడి వాకబు చేసేవాడిని. కుటుంబం పట్ల నా భార్య తీసుకున్న బాధ్యత, సహకారమే నాకు భరోసా ఇచ్చింది.

పిల్లలను ప్రయోజకులను చేశా
నేను టెన్త్ తర్వాత ఇంటర్‌తో చదవు ఆపి వ్యాపారాలూ, యూనియన్లలో దిగాల్సి వచ్చింది. ఫాదర్‌కు సాయంగా ఉండాల్సి వచ్చింది. అప్పటినుంచీ నేను ఇంకా చదువుకుంటే బాగుండేదని అనిపించేది. ఆ కోరిక నా పిల్లల రూపంలో నెరవేరింది. నాకు ముగ్గురు పిల్లలు. భార్య స్వర్ణ. ఆడపిల్లలు స్వాతి, శ్వేత. కవల పిల్లలు. స్వాతి డాక్టర్ చదివింది. శ్వేత ఎంబీఏ చేసింది. కొడుకు సాయి బిటెక్. సాయి హాస్టల్‌లో
talasani-family-pic ఉండి చదివాడు. ఆస్ట్రేలియా, అమెరికా యూనివర్శిటీలో చదివి మంచి ర్యాంక్‌తో పాసయ్యాడు. ఆస్ట్రేలియా కాలేజీ నుంచి అమెరికా కాలేజీకి షిఫ్ట్ కావాలంటే టాలెంట్ కావాలి. అదృష్టం కొద్దీ అక్కడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. దేవుడి దయ వల్ల అంతా బాగున్నారు. నా ముగ్గురు పిల్లలే కాదు. నా బ్రదర్స్-సిస్టర్స్ పిల్లలు కూడా చదువుల్లో రాణించారు. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి?

Q: మీరు రాజకీయాల్లో ప్రవేశించేనాటికి బాగా రఫ్. డ్రెస్ నుంచి అంతా డిఫరెంట్‌గా ఉండేది. కానీ తర్వాత సాఫ్ట్-మాస్‌లీడర్‌గా ఎలా మారారు?
అప్పుడంటే యువరక్తం. పైగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. కానీ ఎమ్మెల్యే అయి, ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సహజంగానే మార్పు వస్తుంది. సొసైటీనే మనకు అన్నీ నేర్పిస్తుంది. అనుభవాలే మనకు పాఠాలవుతాయి. ఎమ్మెల్యే తర్వాత మంత్రి కావడం, ఆ సందర్భంలో వివిధ వర్గాల ప్రజలు, వారి మనస్తత్వాలు గ్రహించి అందుకు అనుగుణంగా నేనూ మారడం నేర్చుకున్నా. పెద్దవాళ్లను ఎంత గౌరవిస్తానో చిన్నవాళ్లనూ అంతే గౌరవిస్తా. కానిస్టేబుల్‌కు ఎంత గౌరవమిస్తానో డీజీపీకీ అంతే గౌరవం ఇస్తా. నాది సహజంగా ఫ్రెండ్లీ నేచర్. నాకు జనంలో ఉండటమే ఎక్కువ ఆనందం ఇస్తుంది.

Q:మీకు రాజకీయాల్లో గాడ్‌ఫాదర్ ఎవరు?
నాకెవరూ గాడ్‌ఫాదర్లు లేరు. ప్రజలే నా గాడ్‌ఫాదర్లు.

Q:చాలామంది తాము పుట్టిన గడ్డకోసం ఏదైనా చేస్తుంటారు. మీరేం చేశారు?
నేను పుట్టిన ఆదయ్యనగర్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ పక్కనే ఉంటుంది. అంతా పక్కా మాస్ ఏరియా. 18 లైన్లు, 380 ఇళ్లుంటాయి. తెలంగాణలో అత్యాధునిక లైబ్రరీ నిర్మించా. ఇండోర్ స్టేడియం, ఎల్‌ఈడీ లైట్లు, సీవరేజీ లైన్లు వేయించా. శ్రీనివాసయాదవ్ ఉన్నాడన్న ధైర్యంతో అందరూ చిన్నవో పెద్దవో బిల్డింగులు కట్టుకున్నారు. అక్కడ ఎంసీహెచ్ క్వార్టర్స్ సమస్య కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. అది అప్పట్లో కంటోన్మెంట్‌లో ఉండేది. అక్కడంతా దళితులే ఎక్కువ ఉంటారు. వారి ఇళ్ల సమస్య తీర్చబోతున్నా. అంతా సక్రమంగా జరిగితే జనవరికల్లా వారి సమస్య తీరవచ్చు.

Q:ఎమ్మెల్యే, మంత్రి పదవులు వచ్చిన తర్వాత చాలామంది చిన్ననాటి మిత్రులను మర్చిపోతుంటారు. అలాంటి అలవాటు మీకూ ఉందా?
లేదు. పదవులు శాశ్వతం కాదు. గెలుపు ఓటమిని చూసిన వాడిని. బంధాలే శాశ్వతమని నమ్మేవాడిని. నేను ఏ పదవిలో ఉన్నా వారితో గడుపుతా. నా చిన్నతనం నుంచి నాతో ఉన్నవారంతా ఇప్పటికీ నాతోనే
friend-late-nanu కొనసాగుతున్నారు. వారి కష్ట సుఖాలు పంచుకుంటా. వారిళ్లలో ఏం జరిగినా హాజరవుతా. వారిలో నాను అనే చిన్ననాటి మిత్రుడు దూరవమడమే నన్ను బాధించే విషయం.

నా దృష్టిలో నాయకుడంటే ఎన్టీఆర్, కేసీఆర్
నాయకుడంటే నడిపించేవాడు మాత్రమే కాదు. సహచరులు, అనుచరులకు నమ్మకం కల్పించేవాడు.
with-ntr నేనున్నానని భరోసా ఇచ్చేవాడు. తనతో పనిచేసేవాడికి ఏ కష్టం వచ్చినా ధైర్యం చెప్పి ఆదుకునేవాడు. వాడుకుని వదిలేసేవాడు నా దృష్టిలో ఎప్పటికీ నాయకుడు కాదు. లాభనష్టాలు చూసుకునేవాడు
talasani-with-kcr నాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే నాయకుడు. నా అనుభవంలో నేను చూసిన నిజమైన లీడర్లలో ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్.

Q: మీ జీవితంలో అత్యంత ఆనందమైన సన్నివేశం?
సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, సర్టిఫికెట్ తీసుకోవడం. అది జీవితంలో మర్చిపోలేని మధర జ్ఞాపకం.

Q: అత్యంత విషాదకరమైన జ్ఞాపకం?
నేను ఎన్టీఆర్ ఫ్యాన్‌ను. ఆయన చనిపోయిన రోజు చాలా బాధపడ్డా. నన్ను పెంచి సమాజంలో ఈ స్థాయికి వచ్చేందుకు కారణమయిన నా తండ్రి వెంకటేశం యాదవ్ మృతి. నా సోదరుడు శంకరన్న కొడుకు, తమ్ముడు కొడుకు చిన్న వయసులోనే మరణించడం నా జీవితంలో ఓ విషాదం. వారిద్దరూ నా బ్రదర్స్ కంటే నాతోనే ఎక్కువ ఉండేవాళ్లు.

Q:చాలామంది నియోజకవర్గం మారేందుకు భయపడుతుంటారు. మీరు సుదీర్ఘకాలం సికింద్రాబాద్ నుంచి గెలిచి సనత్‌నగర్ మారినప్పుడు భయపడ్డారా?
లేదు. అసలు నిజానికి నేను 1994లో సనత్‌నగర్ సీటు అడిగా. అది నా సొంత నియోజకవర్గం. అప్పట్లో సనత్‌నగర్ నియోజకవర్గ సెవెన్‌మెన్ కమిటీలో నేనూ ఒకడిని. కానీ అన్నగారు నన్ను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. పైగా నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేనయినా నేను ఉండేది సనత్‌నగర్ నియోజవర్గంలో. కాబట్టి భయపడలేదు. అప్పుడు నేను చంద్రబాబు గారిని అడిగితే సనత్‌నగర్‌లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ ప్రజలు కూడా నన్ను తమ బిడ్డగా గుండెల్లో పెట్టుకున్నందుకు వారికి రుణపడి ఉంటా. సిటీలో నా నియోజకవర్గంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన వారున్నారు.

Q:మీరు అదృష్టాన్ని నమ్ముతారా? కష్టాన్ని నమ్ముకుంటారా?
కష్టాన్నే నమ్ముతా. అయితే మనం ఎంత కష్టపడ్డా అదృష్టం కూడా ఉండాలి కాబట్టి, కష్టంతోపాటు అదృష్టాన్నీ నమ్ముతా.

పోలీసులతో పదిరోజులు పోరాడా
రాజకీయాల్లోకి రావాలన్న కోరికకు మోండా మార్కెట్‌లో జరిగిన సంఘటనే బీజం వేసింది. ఫాదర్ వెజిటబుల్ కమిషన్ వ్యాపారం చేసేవారు. అక్కడున్న కమిషన్ ఏజెంట్లకు నాన్న లీడర్‌గా ఉండేవారు. అప్పుడు నేను కూడా మోండాలో కార్మికుల కోసం పనిచేసేవాడి ని. ఓసారి ఒక పోలీసు అధికారి భార్య మార్కెట్‌కు వస్తే , ఎవరో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో మార్కెట్‌నే అక్కడి నుంచి లేపేందుకు ప్రయత్నించారు. నేను పదిరోజులు పోలీసులతో పోరాడా. నా వెనుక మొత్తం మార్కెట్, కూలీలు నిలిచారు. 5 బెటాలియన్ల పోలీసులు, డీసీపీలు వచ్చారు. చివరకు మా పోరాటమే గెలిచింది. అప్పుడే రాజకీయాల్లోకి వస్తే ఇంకా చాలామందికి సర్వీస్ చేయవచ్చనుకున్నా. ఆ ఆలోచనకు కారణం అదే. నేను ఏ స్థాయికి వచ్చినా మోండాతో ఉన్న అనుబంధం మర్చిపోను. జన్మనిచ్చిన అమ్మ ఎంతో నాకు ప్రపంచమంటే ఏంటో నేర్పిన మోండా మార్కెట్ కూడా అంతే.

Q:సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గాంధీ ఆసుపత్రి, ఒలిఫెంటా బ్రిడ్జి నిర్మాణాలు సాధించిన మీరు సనత్‌నగర్‌పై వేసిన ముద్ర ఏమిటి?
మర్రి చెన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రి గెలిచిన నియోజకవర్గం ఇది. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తాయి. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయినా దాన్ని పట్టించుకోవడం మానేస్తే, నేను దాన్ని సీఎం కేసీఆర్ గారిని ఒప్పించి 50 పడకల ఆసుపత్రిగా నిర్మించా. ఇప్పుడు దానిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నది నా లక్ష్యం. సిటీలో తొలి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నా దగ్గరే కట్టించారు. చాలామందికి తెలియని విషయమేమిటంటే వాటిని డిజైన్ చేసింది కేసీఆర్ గారే. స్వయంగా గవర్నరు గారు అక్కడికొచ్చి తాను కూడా అక్కడ ఉండాలని చెప్పారు.\

Q: ప్రజాజీవితంలోకి రాకుండా ఉంటే ఏం చేసేవారు?
వ్యాపారం చేసుకునేవాడిని.

Q:ఒకప్పుడు టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉండి, సిటీ పాలిటిక్స్‌ను శాసించిన మీరు ఇప్పుడు నియోజకవర్గానికే ఎందుకు పరిమితయ్యారు? సిటీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూస్తున్నారంటున్నారు. నిజమేనా?
అని మీకెవరు చెప్పారు? మంత్రిగా నాకున్న శాఖాపరమైన బాధ్యతలతోపాటు, ఎమ్మెల్యేగా నియోజకవర్గ బాధ్యతలూ చూడాలి. ఇప్పుడు నాకు మంత్రిగా రెండు శాఖలు. అవసరమైనప్పుడు కలెక్టరు, గ్రేటర్ కమిషనరు, పోలీసు కమిషనర్లతో సమీక్షలు చేస్తూనే ఉన్నా. సీఎం కేసీఆర్ గారికి సిటీ అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు నగర శివార్లను ఓసారి చూడండి. చుట్టూ రింగురోడ్లు. మొత్తం ఎల్‌ఈడీలు. కేటీఆర్ గారికి సిటీపై ఒక డ్రీమ్ ఉంది. పైగా ఆయన మున్సిపల్ మంత్రి. ఒకప్పుడు 5 లక్షల మంది కోసం
talasani-ktr డ్రైనేజీ, సీవరేజీ లైన్లు ఉండేవి. ఇప్పుడు దానిని గణనీయంగా పెంచారు. 24 గంటల కరెంట్. మెట్రో రైల్‌కు భూసేకరణ చాలాకష్టం. కేటీఆర్ గారు ఆ సమస్యను కూడా అధిగమించారు. పైగా సిటీ అంతా జీహెచ్‌ఎంసీ లిమిట్స్‌లోనే ఉంది. గతంలో మున్సిపల్ మంత్రులు వేరే జిల్లాల్లో ఎక్కువ ఉండేవారు కాబట్టి, నేను ఎక్కువసార్లు సమీక్ష చేసేవాడిని. కేటీఆర్ గారికి ఆ సమస్యలేదు. ఆయన సిటీలోనే ఉంటారు కాబట్టి, సొంత శాఖ వ్యవహారాలు చూస్తున్నారు. ఇక పార్టీ వ్యవహారాలన్నీ అప్పుడూ, ఇప్పుడూ అధ్యక్షుడి ఆదేశం ప్రకారమే జరుగుతాయి.

నాకు ఇక కలలేమీ లేవు.. అంతా హ్యాపీ
నాకు ఇప్పుడు డ్రీమ్‌లేవీ లేవు. జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా. అయ్యా. అనుకోకుండా మంత్రయ్యే అవకాశం వచ్చింది. నా పిల్లలను ఉన్నత చదువులు చదివించా. అందరూ సెటిలయ్యారు. నా కుటుంబం మొత్తం కష్టసుఖాల్లో ఎప్పుడూ నాతోనే ఉంది. నా ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు. అమెరికా వెళ్లినా నన్ను గుర్తుపట్టి పలకరిస్తారు. తెలంగాణలోనే కాదు. ఆంధ్రాలోనూ నాకు అభిమానులున్నారు. వారికి నేనేమీ చేయకపోతే వారు నన్నెందుకు అభిమానిస్తారు. ఆంధ్రాలో ఎన్నికల ముందు నేను విజయవాడ వెళితే ఎంతమంది వ చ్చారో మీరే చూశారు. నేను సమయం పాటిస్తా. నేను ఎవరికైనా టైం ఇస్తే పదినిమిషాలు ముందే ఉంటా. సిటీలో ఎంతోమంది మహామహులు ఉన్నా, నాకంటూ ఒక బ్రాండ్ రావడం సంతోషం. అది నాకు గర్వకారణం. అదృష్టం కూడా. దాన్ని చెడగొట్టుకోకుండా కాపాడుకుంటే చాలు. ఎంతోమంది నాదగ్గరకు వచ్చి పనులుచేయించుకుంటారు. వాళ్లెవరో తెలియకపోయినా సాయం చేస్తుంటా. శీనన్న దగ్గరకు వెళితే పని అవుతుందన్నదే వాళ్ల నమ్మకం. నేను అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అంతే ఉన్నా. ఉంటా కూడా. పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చా. ఇక అంతకంటే కావలసింది ఇంకేముంటుంది?

Q:అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాలు- మీడియాలో మీరు గమనించిన మార్పులేమిటి?
చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో అసెంబ్లీకి వచ్చే ముందు సబ్జెక్టు స్టడీ చేసేవాళ్లు. ఒక ప్రశ్న అడిగితే దానిపై లోతైన చర్చ జరిగేది. దానివల్ల ప్రశ్నవేసిన వారికి, జవాబు ఇచ్చిన మంత్రులకు గొప్ప సంతృప్తి ఉండేది. ఇప్పుడు సబ్జెక్టు స్టడీ చేసేవాళ్లు తక్కువయ్యారు. ప్రభుత్వాన్ని తిట్టడం, బయటకు వెళ్లి మీడియాతో మాట్లాడటం ఎక్కువయింది. ఇక మీడియా కూడా అభివృద్ధి గురించి కాకుండా, ఎవరెంత తిడితే వాటికే ప్రాధాన్యం ఇస్తోంది. టోటల్‌గా ఇప్పుడు అన్ని వ్యవహారాలూ కమర్షియల్‌గా మారాయి. అప్పటిలా మానవసంబంధాలు తగ్గిపోయాయి.

వారసత్వ రాజకీయాలు ఓ పరంపర
వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో మోతీలాల్ నెహ్రు నుంచి వస్తున్నవే. నెహ్రు కుటుంబమే కాంగ్రెస్‌కు ఇంకా నాయకత్వం వహిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం ఫ్యామిలీ, తమిళనాట కరుణానిధి ఫ్యామిలీ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు ఒకటి చెబుతా. వారసులు రాజకీయాల్లోకి వచ్చినా వారిని జనం గెలిపించాలి. ఉదాహరణకు కేటీఆర్, కవితను తీసుకోండి. వాళ్లు ప్రజల నుంచి గెలిచి తమను తాము నిరూపించుకున్నారు. ఈరోజు బతుకమ్మ పండుగొస్తే ప్రపంచంలో ఉన్న తెలంగాణ వారికి, తెలుగువాళ్లకు కవిత గుర్తుకొస్తారు. కేసీఆర్ గారి కుటుంబసభ్యులయినప్పటికీ, వాళ్లంతా ఓవర్‌నైట్‌లో ఈ స్థాయికేమీ చేరలేదు. ఎంతో కష్టపడి, సమాజాన్ని స్టడీ చేసి, ప్రజల్లో నిలిచి గానీ ఈ స్థాయికి చేరలేదు. ఈరోజు కేటీఆర్ గురించి యావత్ దేశం గొప్పగా చెప్పుకుంటోంది. కాబట్టి ప్రతిభ ఉంటే ఎవరు ఎవరినీ ఆపలేరు. ఒకసారి దెబ్బతిన్నా మళ్లీ పైకి లేచి నిలదొక్కుకున్న వారసులూ ఉన్నారు.

Q:కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యూత్‌కు మీ సలహా
నేను కూడా యూత్‌గా ఉన్నప్పుడే పాలిటిక్స్‌లోకి వచ్చా కాబట్టి చెబుతున్నా. సర్వీసు చేయాలనుకుంటేనే రాజకీయాల్లోకి రండి. ఇంకేదో ఆశించి రావద్దు. ముందు మీ తల్లిదండ్రులు, కుటుంబం మద్దతు తీసుకోండి. వారి కలలు నెరవేర్చి, తర్వాత రాజకీయాల్లోకి రండి. రాజకీయాలంటే పూలపాన్పు కాదు. ఆత్మస్థైర్యం పెంచుకోండి. గెలుపు ఓటములు సమానమన్న సూత్రాన్ని వంటబట్టించుకోండి. కులాలు-మతాల కంటే సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని గుర్తించండి. ఎందుకంటే తెలంగాణ కులాలు-మతాలకు అతీతమైన సమాజం కాబట్టి. ముందు సొసైటీని, ప్రజల ఆలోచనలు, అవసరాలను స్టడీ చేసి తర్వాత రాజకీయాల్లోకి రండి. అదే యూత్‌కు నేనిచ్చే సలహా.

Leave a Reply