టార్గెట్‌.. కన్నా, సుజనా, సత్యకుమార్‌!

– సుజనాపై చర్య తీసుకోవాలంటూ బీజేపీలో ఓ వర్గం ఫిర్యాదు
– ఓ టీవీ ఇంటర్వ్యూలో సుజనా వ్యాఖ్యలను ఉదహరించిన వైనం
– అమరావతి పాదయాత్ర ముగింపు సభలో సుజనా ప్రసంగంపై ఫిర్యాదు
– టీడీపీకి అనుకూలంగా మాట్లాడారంటూ ఢిల్లీకి ఓ వర్గం ఫిర్యాదు
– మళ్లీ విజయవాడలో ఆయన ఫంక్షన్‌హాల్‌నే వాడుతున్న వైనం
-కన్నాకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్న వైనం
– సత్యకుమార్‌ సమావేశాలకు ఎందుకెళుతున్నారంటూ జిల్లా నేతలపై ఓ అగ్రనేత ఆగ్రహం
– సత్యకుమార్‌ పర్యటనలపై ఓ వర్గం నిఘా
– ఏపీ కమలంలో కుమ్ములాటలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే-ఎంపీ సీటు రాకపోయినా.. ఒక్క జడ్పీచైర్మన్‌ లేకపోయినా.. ఒక్క మున్సిపల్‌ చైర్మన్‌ గెలవకపోయినా.. ఒక్కచోట పట్టుమంది పదిమంంది కౌన్సిలర్లు లేకపోయినా.. జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌లో ముఠాలకు మాత్రం తక్కువలేదు.. కుమ్ములాటలకు తక్కువలేదు. వర్గాలకు లెక్కలేదు. కనీస బలం లేకపోయినా, పార్టీ ఉనికి భూతద్దం వేసి వెతికినా కనిపించకపోయినా.. జాతీయ నాయకత్వానికి పితూరీలూ, పిటిషన్లకూ మాత్రం ఎక్కడా తక్కువలేదు. ఇవీ ఏపీ బీజేపీలో కుమ్ములాటల దృశ్యాలు.

గుర్రం గుడ్డిదయినా దాణాకు లోటులేదన్నట్లు.. జాతీయ పార్టీ అయినప్పటికీ, ఏపీలో మాత్రం కనీసం.. ఉప ప్రాంతీయ పార్టీ స్థాయి కూడా లేని బీజేపీ, కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన ఏపీ బీజేపీలో, కొంతకాలం నుంచి ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరిపై, ఒక వర్గం ఢిల్లీకి ఫిర్యాదు చేసిందన్న చర్చ పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఒక మీడియాను పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని, ఆ మీడియాను జిల్లా పార్టీ నేతలు కూడా ఆహ్వానించవద్దంటూ, సోము వీర్రాజు నాయకత్వం గతంలో నిషేధాజ్ఞలు విధించింది. అయినప్పటికీ, ఆ మీడియాలో, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. బీజేపీ మాజీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సదరు చానెల్‌ రిపోర్టర్లు బీజేపీ నేతల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు.

చివరాఖరకు తాను నిషేధించిన అదే చానెల్‌ ఇంటర్వ్యూకి, తమ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లడం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. మళ్లీ తాజాగా అదే మీడియా రాసిన కథనంపై వివరణ కోరుతూ, రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు లేఖ రాసిన వైనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. దానితో తమ పార్టీ.. సదరు మీడియాపై విధించిన నిషేధం తొలగించిందా? కొనసాగిస్తోందా? తాము కూడా వారిని మీడియా సమావేశాలకు పిలవాలా? వద్దా? అని జిల్లా పార్టీ నాయకత్వాలు సందిగ్ధంలో పడ్డాయి.

ఈ క్రమంలో అదే మీడియాకు కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని, సుజనాపై వేటు వేయాలంటూ బీజేపీలోని ఓ వర్గం రంగంలోకి దిగినట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీని బీజేపీ పట్టించుకోకపోతే, పార్టీ నుంచే కాదు, రాజకీయాల నుంచే వైదొలుగుతానని సుజనా స్పష్టం చేశారు.‘ వైసీపీపై వార్‌ డిక్లేర్‌ చేయకపోతే ఏపీలో బీజేపీ చేసేదిలేదు. చేయగలిగేది కూడా ఏమీ లేదన్న’ సుజనా వ్యాఖ్యలను.. బీజేపీలోని ఓ వర్గం, ఢిల్లీ నాయకత్వానిి ఫిర్యాదు చేసింది.

కొద్దినెలల క్రితం గుంటూరు జిల్లా బీజేపీ నాయకత్వం, అమరావతికి మద్దతుగా పాదయాత్ర నిర్వహించింది. దాని ముగింపు సభలో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని మరో ఫిర్యాదు కూడా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి సుజనా చాలాకాలం నుంచి, ఏపీ బీజేపీ వ్యవహారాలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ వ్యవహారంపై పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వకపోవడమే సుజనా నైరాశ్యానికి కారణమని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అమరావతి కోసం చంద్రబాబునాయుడు కూడా బాగా కష్టపడ్డారని, దానిని కాదనలేమని ఆ సభలో సుజనా స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయంటూ, బీజేపీలోకి ఓ వర్గం ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ రెండు అంశాల ఆధారంగా.. ఆయనపై క్రమశిక్షణచర్యలు తీసుకోవాలంటూ, కొందరు ఢిల్లీ నాయకత్వానికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. విజయవాడలో బీజేపీ నిర్వహించే ప్రధాన కార్యక్రమాలన్నీ, సుజనా చౌదరి ఫంకన్‌హాల్‌లో నిర్వహిస్తుండటం విశేషం.

ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ లక్ష్యంగా, బీజేపీలోని ఆ వర్గం పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. సత్యకుమార్‌ జిల్లా పర్యటనల్లో ఎవరెవరు పాల్గొంటున్నారన్న అంశంపై, ఆ వర్గం సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జిల్లా నాయకులకు ఫోన్లు చేసి, సద్యకుమార్‌ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సత్యకుమార్‌ విరుచుకుపడుతున్నారు. ఇటీవలి జరుగుతున్న కోర్‌ కమిటీలో కూడా ఓ వర్గం, సత్యకుమార్‌ లక్ష్యంగా వ్యాఖ్యానిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా, ఆ వర్గం గుంటూరు జిల్లాలో పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలను కన్నాకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరిపై, ఇటీవల నామినేటెడ్‌ పోస్టులు అమ్మకం ఆరోపణలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.