దళితుడా ! మేలుకో !! ఆత్మగౌరవం కాపాడుకో!!!

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక

రాబోవు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు తమ హక్కులను సాధించుకునేలా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలా, అప్రమత్తంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. అమ్మోరి జాతరలో అమాయకమైన మేకలనే బలిస్తారు, సింహాలను కాదు అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హితబోధను గుర్తు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

55 నెలల వైకాపా పాలనలో దగా పడ్డది, దిగాలు పడ్డది ఎస్సీ, ఎస్టీలే అన్నారు. తెలుగు నేలపై కనీవినీ ఎరుగని రీతిలో ఎస్సీ, ఎస్టీలు ప్రాణాలు కోల్పోయారన్నారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు, పులివెందుల నాగమ్మ నుంచి గుంటూరు రమాకాంత్ భూక్యా వరకు దాష్టీకానికి గురయ్యారన్నారు. పోలీస్ స్టేషన్లో శిరోముండనాలు ,ఎస్సీ ఎస్టీల ముఖాలపై మూత్ర విసర్జన సంఘటనలు అనాగరికంగా జరిగాయన్నారు. 27 రకాల సంక్షేమ పథకాలు ఎత్తివేసారని, దాదాపు 50 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారన్నారు.

దళితులపై అక్రమ కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళగొట్టారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులలో దళితులంతా ఐక్యంగా మేల్కొని హక్కులను సాధించుకోవాలని, ఆత్మగౌరాన్ని కాపాడుకోవాలని హెచ్చరించారు. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు, దళితుల సత్తా ఏమిటో చూపిస్తామని బాలకోటయ్య ప్రకటించారు.

Leave a Reply