Suryaa.co.in

Editorial

మల్కాజిగిరి బరిలో తలసాని తనయుడు

– ఎమ్మెల్యే సీటు కోసం తలసాని సాయి ప్రయత్నాలు
– కేటీఆర్ ఆశీస్సులతో రంగంలోకి తలసాని సాయి
– మల్కాజిగిరిలో యాదవుల సంఖ్యపై ధీమా
– ఇప్పటికే యాదవులకు సీట్ల కేటాయింపులో అన్యాయం
– యాదవ యుద్ధభేరికి యాదవ సంఘం సన్నాహాలు
– మల్కాజిగిరిలో యాదవులకు సీటు సర్దుబాటు ద్వారా బుజ్జగింపు
– కిషన్‌రెడ్డిపై ఎంపీగా పోటీ చేసి ఓడిన సాయి
– ఓడిపోతానని తెలిసినా పార్టీ కోసం ఇమేజ్ త్యాగం చేసిన తలసాని
– ఇప్పుడు మైనంపల్లి తిరుగుబాటుతో మల్కాజిగిరి సీటు కోరుతున్న తలసాని
– అర్ధ- అంగబలంలో మైనంపల్లిని ఢీకొనేందుకు సిద్ధమవుతున్న తలసాని
– మల్కాజిగిరిపై మంత్రి మల్లారెడ్డి అల్లుడి కన్ను
– సీటివ్వాలని కోరుతున్న అల్లుడు రాజశేఖర్‌రెడ్డి
– కంటోన్మెంట్ ఇన్చార్జిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి
– ఇద్దరు మంత్రుల వారసులలో సీటు దక్కేదెవరికో?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి సంచలనం సృష్టించిన… మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్థానంపై ఇద్దరు మంత్రులు కన్నేశారు. అందులో ఒకరు సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అయితే, మరొకరు కార్మిక మంత్రి మల్లారెడ్డి. ఇందులో తలసాని తన కుమారుడు సాయికిరణ్ కోసం, మరో మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కోసం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లిపై, వేటు వేసేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అక్కడ తమ వారసులతో పాగా వేసేందుకు మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి బరిలోకి దిగారు. అయితే వీరిలో తలసాని సాయికి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో, సాయివైపే బీఆర్‌ఎస్ నాయకత్వం మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న యాదవుల సంఖ్యపైనే తలసాని భరోసాతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన తల్లి పుట్టిన ప్రాంతమైన మల్కాజిగిరిలో, తలసాని టీడీపీలో ఉన్నప్పటి నుంచి వివిధ వర్గాలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు వ్యతిరేకంగా టీడీపీ వర్గాలు ముఠాలు కట్టినప్పుడు, తలసాని తరచూ మధ్యవర్తిత్వం వహించి, అక్కడి సమస్యలు పరిష్కరించేవారు. పైగా ముదిరాజ్ నేతలతో తలసానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ధీమాతోనే ఆయన తన కుమారుడు సాయికి, ఎమ్మెల్యే సీటు అడుగుతున్నట్లు కనిపిస్తోంది.

గత సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కిషన్‌రెడ్డిపై, తలసాని సాయికిరణ్ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచీ బీఆర్‌ఎస్ పార్లమెంటు ఇన్చార్జిగా, లోక్‌సభ పరిథిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే అప్పుడు కిషన్‌రెడ్డిపై పోటీచేసేందుకు ఎవరూ ధైర్యం చేయని సమయంలో, తలసాని చొరవ తీసుకుని తనయుడు సాయిని బరిలోకి దింపారు. ఓడిపోతారని తెలిసినా పార్టీ కోసం, తలసాని తన ఇమేజ్‌ను పణంగా పెట్టడం అప్పట్లోనే చర్చనీయాంశమయింది.

ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చినందున, మల్కాజిగిరి సీటు సాయికి ఇవ్వాలని తలసాని కోరుతున్నట్లు సమాచారం. కాగా కేటీఆర్‌తో సాయికి వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో, ఆయనకు సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా, తాజా టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. అందులో భాగంగా యాదవులకు జరిగిన అన్యాయానికి నిరసనగా, యాదవ గర్జన నిర్వహించేందుకు యాదవ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో యాదవ గర్జన నిర్వహించేందుకు యాదవులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాదవ వర్గానికి చెందిన తలసాని సాయికి సీటు కేటాయించడం ద్వారా, ఆ వర్గాన్ని బుజ్జగించినట్లు అవుతుందని అటు నాయకత్వం కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

ఇక తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి సీటు కోసం, మంత్రి మల్లారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం కంటోన్మెంట్ పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. మల్కాజిగిరిలో తనకున్న సంబంధాలతో అల్లుడిని గెలిపించుకుంటానని, మల్లారెడ్డి నాయకత్వానికి హామీ ఇచ్చారట. అయితే ఇప్పటికే 40 సీట్లు రెడ్లకు కేటాయించడం ద్వారా, బీసీల నుంచి తీవ్ర విమర్శలు-వ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకత్వం.. మళ్లీ మరో రెడ్డికి అవకాశం ఇచ్చి, బీసీలకు పూర్తిగా దూరమవుతుందా అన్న చర్చ జరుగుతోంది. మరి ఇద్దరు మంత్రుల్లో సీటు, ఏ వారసుడికి దక్కుతుందో చూడాలి.

LEAVE A RESPONSE