– అసలు ముద్దాయిలు వెంటనే దొరుకుతారు
– హత్య ఎవరు, ఎందుకు, ఎలా చేశారో జగన్ కు ముందే తెలుసు
– షర్మిల నోరు విప్పాక కూడా జగన్ మౌనం వహించడం తగదు
– నైతిక విలువలుంటే మీడియాకు దోషులెవరో సీఎం చెప్పాలి
– సీఐ శంకరయ్య నోరు ఎవరు నొక్కారో జగన్ కు తెలుసు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? అనే విషయాలు బహిర్గతం కావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ వెంటనే విచారించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డిని సీబీఐ విచారిస్తే నిజం కక్కుతారన్నారు. అసలు ముద్దాయిలు వెంటనే దొరుకుతారని తెలిపారు. వివేకాను హత్య చేయబోతున్న విషయం నుండి నేటి వరకు కేసులో జరిగిన ప్రతి పరిణామం జగన్ కనుసన్నల్లోనే జరిగాయని వెల్లడించారు. వివేకా హత్య కేసులో జగన్ పీకల్లోతున ఇరుక్కున్నారన్నారు. ఆ విషయం మరిచి జగన్ కప్పగంతులు వేస్తున్నారని తేటతెల్లం చేశారు.
‘‘అన్నయ్య కిల్డ్ బాబాయ్’’ ఆరోపణ పై సీఎం నోరు విప్పాలి:
హూ కిల్డ్ బాబాయ్ అని వస్తున్న ప్రశ్నలకు…అన్నయ్య కిల్డ్ బాబాయ్ అని షర్మిలారెడ్డి ఢిల్లీలో బహిరంగంగా మీడియాతో చెప్పింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పై హత్యరోపణ వస్తే బాధ్యతాయుతంగా స్పందించాలి. తాను దోషిననో, నిర్ధోషిననో ఏదో ఒకటి ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం చేసే చిన్నచిన్న విషయాలకే రుసురుసలాడే జగన్…తనపై హత్యారోపణ చేస్తుంటే ఎందుకు స్పందించడంలేదంటూ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కు నైతిక విలువలుంటే తక్షణమే విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
షర్మిల చెప్పాక కూడా జగన్ మౌనం అర్థరహితం:
జగన్మోహన్ రెడ్డి తోబుట్టువు, ఓ పార్టీకి అధ్యక్షురాలు తమ బాబాయ్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో, హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో ఢిల్లీలో సీబీఐ అధికారులకు చాలా స్పష్టంగా వాంగ్మూలంలో వివరించారు. కడప ఎంపీ టిక్కెట్ కోసమే వివేకా హత్య జరిగిందని పేర్కొంది. అవినాష్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వొద్దని వివేకానందరెడ్డి జగన్ ను కోరారని చెప్పింది. తన ఎంపీ టిక్కెట్ కు వివేకా అడ్డుపడుతున్నారని అవినాష్ రెడ్డి, తన తండ్రి భాస్కర్ రెడ్డి, తమ అనుచరులు వివేకాను అత్యంత దారుణంగా చంపారని వాంగ్మూలంలో పేర్కొంది. ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటే దానికి అర్థం ఉండదు. ముఖ్యమంత్రి అయ్యాక తన ప్రభుత్వంలో ముద్దాయిలను పట్టుకోలేకపోవడం అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం.
జగన్ తిరుగులేని నట చక్రవర్తి:
వివేకా హత్య సమయంలో మా చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని విషణ్ణవదనాలతో మీడియా ముందు మాట్లాడారు. కొద్దిసేపటికే చిన్నాన్న రక్తపువాంతులు చేసుకుని చనిపోయారని మరో డ్రామాకు తెరలేపారు. నిందితులను కాపాడేందుకు హత్య నేరాన్ని చంద్రబాబుగారిపై నెట్టేశారు. దీని గురించి వాళ్ల చెత్త పత్రికలో తప్పుడు రాతలు రాయించారు. వాళ్ల ఛానల్ లో తప్పుడు కూతలు కూయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నట చక్రవర్తి. నటనలో తనను మించినవారెవరూ లేరు. ఇలాంటి నటన నెవర్ బిఫోర్….ఎవర్ ఆఫ్టర్ అంతే…
సీబీఐని బెదిరించింది మీరు కాదా జగన్?
వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను రాష్ట్రం వదిలి పారిపోయేలా బెదిరించడం వెనుక జగన్ హస్తం ఉంది. జగన్ అండ చూసుకుని కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులోనే సీబీఐ అధికారులపై రంకెలేశారు. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా కడప కేంద్ర కారాగారం నుండి రిమ్స్ ఆసుపత్రికి ఏ-5 డి శివశంకర్ రెడ్డిని అవినాష్ రెడ్డి తరలించారు. అక్కడ శివశంకర్ రెడ్డికి రాచమర్యాదలు చేయించి, ఓ దర్బార్ ను నడిపించారు. నిందితులను సీబీఐ అధికారులు విచారించేందుకు తీసుకెళ్తుంటే వాళ్లకు తాడేపల్లి ప్యాలెస్ నండి ఫోన్ చేసి అడ్డుకున్న వ్యక్తి జగన్. అవినాష్ రెడ్డి, మీరు కలిసి సీబీఐ అధికారులను బెదిరించిన విషయం వాస్తవమో, కాదా జగన్ నోరు విప్పాలి.
హంతకులను కాపాడడమే సీఎం పదవి ధర్మమా జగన్?
కరుడుగట్టిన హంతకులను కాపాడడం, వెనకేసుకురావడం, విచారణ అధికారులను అడ్డుకోవడమే సీఎం పదవి ధర్మమని జగన్ భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా న్యాయం కావాలి, దోషులెవరో తేలాలి అని అరిచి గగ్గోలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక తేలుకుట్టిన దొంగలా మౌనం వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో జగన్ ప్రవర్తనపై రాష్ట్ర ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉంది. హంతకులను దాచిపెట్టే ఓ కేంద్రంలా జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు సహాయనిరాకరణ చేశారు. సుప్రీంకోర్టు చేతిలో చీవాట్లు తిన్నారు. హంతకులను కాపాడడమే తమ ప్రభుత్వ ధర్మం అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరించడం దారుణం.
సీఐ శంకరయ్య నోరు మూయించింది ఎవరు జగన్?
సీఐ శంకరయ్య వివేకా హత్యకేసులో నిర్లక్ష్యం వహించినందుకు సిట్ అతన్ని సస్పెండ్ చేసింది. ఆ సమయంలో సీబీఐ సీఐ శంకరయ్యను 164సీఆర్పీసీ వాంగ్మూలం చెప్పాలని కోరింది. దానికి శంకరయ్య ఒప్పుకున్నాడు. ఇంతలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ శంకరయ్యతో మంతనాలు జరిపి అతనిపై ఉన్న సస్పెన్షన్ ను వారం రోజుల్లోపే ఎత్తేశారు. ఇలాంటి ఘటనలు ఏపీ పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేదు. వెంటనే సీఐ శంకరయ్యను తాను కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేశారు. ఫలితంగా సీఐ శంకరయ్య సీబీఐ అధికారులకు ఎదురుతిరిగి, వాళ్లపైనే కేసు పెట్టాడు. ఇదంతా జగన్ కనుసన్నల్లోనే జరిగింది. జగన్ చెప్పిన దానికి గౌతం సవాంగ్ డూడూ బసవన్నలా తలాడించి ఏపీ పోలీస్ పరువు తీశారు. ముద్దాయిలు బయటపడకుండా అడుగడుగునా జగన్ తన పాత్ర పోషిస్తున్నారు.
అధికారంలోకి వచ్చాక శంకరయ్యకు డ్యూటీ ఎలా చేయాలో నేర్పిస్తాం:
సీఐ శంకరయ్య ప్రలోబాలకు తలొగ్గి విధులను విస్మరించారు. చట్టాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. హంతకులతో చేయి కలిపి తాను కూడా ముద్దాయిలా వ్యవహరించారు. సీబీఐ కి సహకరిస్తానని చెప్పి, తిరిగి సీబీఐ అధికారుల మీద కేసు పెట్టాడు. వాస్తవాలను కప్పిపుచ్చి పోలీసు ధర్మానికి మాయని మచ్చతెచ్చారు. వివేకా కేసు నుండి శంకరయ్య ఎక్కడికీ తప్పించుకోలేరు. మేం అధికారంలోకి వచ్చాక సీఐ శంకరయ్యకు చట్టాన్ని ఎలా కాపాడాలో నేర్పిస్తాం.