-నా పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశా..
-ఇచ్చిన మాటకు కట్టుబడి ‘జగనన్న తోడు’తో చిరువ్యాపారులకు అండగా నిలిచాం
-నేడు 3.95 లక్షల మందికి రూ.10 వేల చొప్పున రూ.395 కోట్లు అందిస్తున్నాం
-ఈ పథకం ద్వారా 15,03,558 మంది చిరువ్యాపారులకు రూ.2011 కోట్లు అందించాం
-నామమాత్రపు లాభాలతో సేవలు అందించే గొప్ప వర్గం చిరువ్యాపారుల వర్గం
-దేశ వ్యాప్తంగా 34 లక్షల మందికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును ఇస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 15.03 లక్షల మందికి తోడుగా నిలిచాం
-గత ప్రభుత్వాధినేతలు చిరు వ్యాపారుల గురించి ఆలోచించిన పాపానపోలేదు
-గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) ఉండేది
-మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. లంచాలు, వివక్ష లేదు
-జగనన్న తోడులో 80 శాతం నా అక్కచెల్లెమ్మలకే లబ్ధి.. అందులోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే 80 శాతం
-సీఏజీఆర్ ప్రకారం అప్పులు గతంలో 19 శాతం ఉంటే.. ఇప్పుడు 15 శాతం మాత్రమే
-గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించండి
-జగనన్న తోడు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘‘చిరువ్యాపారులైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనడం కంటే గొప్ప సేవ అని చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. అటువంటి సమాజ సేవకులకు ‘జగనన్న తోడు’ ద్వారా అండగా నిలుస్తున్నాం. నడ్డి విరిచే అధిక వడ్డీల బారి నుంచి వారికి విముక్తి కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.10 చొప్పున వడ్డీలేని రుణాలను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 15,03,558 మంది చిరువ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు రూ.2011 కోట్ల వడ్డీలేని రుణాలను అందించాం’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అధిక వడ్డీలతో అప్పులపాలవుతున్న చిరువ్యాపారుల కష్టాలను ప్రజా సంకల్ప యాత్రలో కళ్లారా చూశానని, వారికి తోడుగా నిలబడటం కోసం ‘జగనన్న తోడు’ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. గతంలో ప్రభుత్వాధినేతలు చిరువ్యాపారుల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవన్నారు. నేడు 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.10 వేల చొప్పున రూ.395 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ వివరించారు.
3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు అండగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ రూ.395 కోట్లను విడుదల చేశారు. అంతకుముందు చిరువ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
‘దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 15,03,558 మంది కుటుంబాలకు మంచి జరిగిస్తున్న జగనన్న తోడు పథకం.. ఈరోజు దాదాపు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.395 కోట్లను వారికి తోడ్పాటును ఇస్తూ.. మొత్తంగా 15,03,558 మంది కుటుంబాలకు అక్షరాల రూ.2011 కోట్లు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారు ఇంకొకరి మీద ఆధారపడకుండా.. వారి కాళ్ల మీద నిలబడేగొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్నాం. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మరికొంత మందికి కూడా ఏదో ఒక రూపంలో ఉపాధి కల్పిస్తూ నామమాత్రపు లాభాలు అయినా సంతోషంగా.. ఆ లాభాలను స్వీకరిస్తూ.. సేవలు అందించే గొప్ప వర్గం చిరువ్యాపారుల వర్గం.
నిజానికి చిరువ్యాపారులైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనే దానికంటే గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిరు వ్యాపారులతో పాటు సంప్రదాయ చేతివృత్తుల వారు.. తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి.. అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక వీరు పడుతున్న బాధలు నా పాదయాత్రలో నా కళ్లారా చూశా. వడ్డీ వ్యాపారులకు కట్టాల్సిన వడ్డీ.. వెయ్యికి వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. ఉదయం వెయ్యి ఇస్తే.. సాయంత్రానికి వంద వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి. ఇటువంటి నడ్డి విరిచే వడ్డీల బారి నుంచి వీరిని తప్పించి.. లక్షల కుటుంబాలకు అండగా ఉండాలి.. ఉంటేనే వీరి జీవితాలు బాగుపడతాయని నా పాదయాత్రలో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి.
చెప్పిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించి. జగనన్న తోడు పథకం ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిని,, వారి కాళ్ల మీద వారిని నిలబెట్టేలా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణం ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని ప్రతి అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు కలిగిన ప్రయోజనం ఎంతో నాలుగు మాటల్లో చెప్పాలంటే..
జగనన్న తోడు పథకం ద్వారా మరోసారి 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రూ.395 కోట్ల సాయంతో కలిపితే.. ఇప్పటి వరకు 15,03,558 మంది లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీలేని రుణాలు ఏకంగా రూ.2011 కోట్లు. దేశ వ్యాప్తంగా 34 లక్షల మందికి బ్యాంకుల ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును ఇస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే సగభాగం 15.03 లక్షల మందికి దేవుడి దయతో, బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటును అందించిన ప్రతీ అధికారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
15.03 లక్షల మందిలో రుణాలు సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షల మంది. వడ్డీలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వడమే కాకుండా.. తిరిగి బ్యాంకులు రుణాలు చేసే కార్యక్రమం. ఈ లబ్ధిదారులు బ్యాంకులకు సకాలంలో చెల్లించిన వారికి కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా మన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ రుణం తీరిన తరువాత లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణం పొందడానికి అర్హులవుతారు.. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూనే ఉంటాయి. తిరిగి రుణాలు పొందేటప్పుడు పది వేలకు మరో వెయ్యి అదనంగా రుణం ఇచ్చేలా.. ప్రతీ సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోయేలా బ్యాంకులతో మాట్లాడుతాను. దాని వల్ల చిరువ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ మరో పదిశాతం పెరుగుతుంది. ఎటువంటి డిలే లేకుండా రుణాలు చెల్లిస్తారు.
ఇప్పటి వరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్ధిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారం మోస్తూ.. తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు. ఇందులో భాగంగా గత 6 నెలలకు సంబంధించి రూ.15.96 కోట్లకు సంబంధించిన వడ్డీని రీయింబర్స్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు విడుదల చేస్తున్నాం. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది ఒక విప్లవం అయితే.. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే దాదాపుగా 80 శాతం మంది ఉండటం మరో విప్లవాత్మకమైన అడుగు. ఇది మన మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి ఇదో గొప్ప నిదర్శనం.
చిరువ్యాపారులు ఉన్నారు.. బ్రతకడానికి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నారు.. వీరు ఇంకొకరిపై ఆధారపడకుండా.. వీరి కాళ్ల మీద వీరు నిలబడుతూ బతుకులు గడుపుతున్నారు. ఇటువంటి వారికి తోడుగా ఉండాలనే ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. ఒక్కసారి తేడాను గమనించాలని కోరుతున్నాను. ఏరోజు అయినా ఒక్క రూపాయి సహాయం చేయాలని గత ప్రభుత్వ హయాంలో జరగలేదు.
వస్తువులు, దుస్తులు, టీలు, కాఫీలు, టిఫిన్లు, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని ఫుట్‌పాత్‌ల మీద, తోపుడు బండ్ల మీద, రోడ్ల పక్కన, మోటర్ సైకిళ్ల మీద, సైకిళ్ల మీద వీధి వీధి తిరుగుతూ, ఇంటి సమీపంలో అమ్ముతూ లక్షల మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి వారు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతున్నారని, వారికి తోడుగా ఉంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించినట్టు అవుతుందని ఏ రోజూ కూడా గతంలో ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ఇటువంటి నిరుపేదలైన చిరువ్యాపారులకు మాత్రమే కాకుండా.. సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులైన ఇత్తడి పని, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారి, తోలుబొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు, లేస్ వర్క్, కుమ్మరి, కమ్మరి తదితర వృతుల మీద ఆధారపడి జీవిస్తున్న హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఇలా అందరికీ వడ్డీలేని రుణం ఇచ్చే ఏర్పాటు చేయాలనే ఆలోచన గత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు.
ఎందుకు వారు ఆలోచన చేయలేదు అంటే.. గత ప్రభుత్వంలో మనసు అనేది లేదు. గతంలో పాకులు.. పెత్తందారుల పరిపాలన, పెత్తందారి మనస్తత్వం, వారు బాగుంటే చాలు.. ఆ పెత్తందారులకు మద్దతు పలికే దుష్టచతుష్టయం.. (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరికి మద్దతు పలికే దత్తపుత్రుడు). వీరికి మాత్రం మంచి జరిగితే చాలు.. దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతిలో డీపీటీ స్కీమ్‌ను గతంలో అమలు పరిచేవాళ్లు. ఈరోజు మన ప్రభుత్వంలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. ఎక్కడ లంచాలు, వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం.. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. ఈ రకంగా దాదాపు 1.65 లక్షల కోట్ల రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేయగలిగాం.
జగనన్న తోడు ద్వారా ఇప్పటి వరకు లబ్ధిపొందిన 15.03 లక్షల మందికి.. ఈ ఒక్క పథకమే కాకుండా అమ్మఒడి, వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర్ సున్నావడ్డీ, వైయస్‌ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్‌ఆర్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. ఇలా అనేక పథకాలు.. కనీసం అంటే ఒక్కో కుటుంబానికి కచ్చితంగా మూడు, నాలుగు పథకాలు అందుతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం.. అక్కచెల్లెమ్మల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి.
ఒక్కసారి ఆలోచన చేయండి.. గతంలో ఎందుకు ఈ విధంగా జరిగేది కాదు.. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది. గతంలోనూ ఒక ప్రభుత్వం, బడ్జెట్ ఉండేది. ఇప్పుడూ ప్రభుత్వం ఉంది.. అదే బడ్జెట్.. కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. గతంలో చేసిన అప్పులతో పోల్చితే.. సీఏజీఆర్ గతంలో కంటే ఇంకా తక్కువ. గతంలో 19 శాతం ఉంటే.. ఇప్పుడు 15 శాతం మాత్రమే ఉంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు.. ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతుందో తేడాను గమనించండి.
ఎక్కడా లంచాలు లేవు, మధ్యవర్తులు లేరు, వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం.. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. తేడాను గమనించాలని సవినయంగా కోరుకుంటున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎల్లప్పుడూ మన ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.