– తప్పుడు నివేదికలతో విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా
– నేటి నుంచి అందుబాటులోకి వైఎస్సార్ పశు సంచార వైద్యశాలలు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుసగా రెండో సంవత్సరం స్కోచ్ చీఫ్ మినిస్టర్ అవార్డు దక్కడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని వరుస అవార్డులు ముఖ్యమంత్రి పనితీరుకు అద్దం పడుతున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
ఊరు పేరు లేని నకిలీ సంస్థల నివేదిక పేరుతో రాష్ట్రంలో 2112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎల్లో మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఎన్ సి ఆర్ బి రిపోర్టు ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 5500 రైతులు బలవన్మరణానికి పాల్పడగా 1072 కేసులతో మహారాష్ట్ర, కర్ణాటకలు ముందున్నాయి. రాష్ట్రంలో 564 మాత్రమే జరిగాయని నివేదిక పేర్కొందని గుర్తుచేశారు.
మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయని, ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 వాహనాలను సీఎం జగన్ గారు నేడు ప్రారంభించనున్నారని అన్నారు. మొదటి దశలో రూ.142.90 కోట్లతో 175 వాహనాలు, రెండో దశలో రూ.134.74 కోట్లతో 165 వాహనాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.