Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి దంపతులను విచారించనిదే వివేకా హత్య కేసు కొలిక్కి రాదు

-ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవరెడ్డి బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు… అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేస్తుందనడంలో సందేహం లేదు
-99% హామీలు పూర్తి చేశారట… ఆ ఒక్క శాతం హామీలను ఎందుకు వదిలేశారో?
-లోకేష్ కు లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే ప్రజల్లో చైతన్యం వచ్చినట్టే కనిపిస్తుంది
-పోలవరం బ్యారేజ్ డ్యామేజ్ కాకుండా చూడాలి… ఒకవేళ డామేజ్ జరిగితే అసలుకే మోసం
-ముస్లిం సమాజం పై ఉన్న గౌరవం మా పార్టీ నాయకులు చేసిన తప్పులకు శిరసు వంచి క్షమాపణలు కోరుతున్నా…
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులను విచారించనిదే మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని విస్తృత కుట్ర కోణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం, అందరికంటే ముందే జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు. ఆయనకు ఆ విషయాన్ని ఎవరు చెప్పారన్నదే అత్యంత ముఖ్యం. జగన్ మోహన్ రెడ్డి నాకు తెలియదు…. చెప్పలేదంటే కుదరదు. నిత్యం ప్రజా సమస్యల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి తన పని ఒత్తిడి నుంచి, వీలు చూసుకుని సిబిఐ కి ఎప్పుడు సమయాన్ని కేటాయిస్తారనే దానిపైనే ఎన్ని రోజులు వాయిదా కావాలన్నది తేలుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సిబిఐ అధికారులు ఒకసారి కాగితంపై పెట్టిన తర్వాత తప్పకుండా వివరణ ఇవ్వాల్సిందే. ప్రత్యేక హోదా కోసం కేంద్ర పెద్దలతో ఎన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ, పేపర్ పై పెట్టిన సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి నుంచి స్టేట్మెంట్ ను తీసుకోవాల్సిందే. ఎవరు చెప్పారు… ఏమని చెప్పారన్న దానిపై జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వక తప్పదన్నారు.

హైకోర్టు బెయిల్ మంజూరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న మాగుంట రాఘవరెడ్డి అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే హైకోర్టు మానవతా దృక్పథంతో 15 రోజులపాటు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై, 24 గంటలు గడవక ముందే ఈడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు, మాగుంట రాఘవరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. నిందితుల పట్ల ఈడి ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటే, సిబిఐ మాత్రం ఉదాసీన వైఖరిని అవలంబించడం విమర్శలకు దారి తీస్తోంది.

సిబిఐని అందరూ అంటున్నారు అంటే, అనరా మరి. వైఎస్ వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఒంటరి పోరాటాన్ని చేస్తున్నారు. దిక్కుమాలిన కొడుకుల కన్నా…కంటే ఇటువంటి ఒక కూతురుని కనాలి అని అనిపించే విధంగా సునీత పోరాటం ఉంది. 100 కోట్ల విలువైన మద్యం కుంభకోణం, రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణంతో పోలిస్తే చాలా చిన్నది. ఢిల్లీ మద్యంకుంభకోణంలో చాలామంది పాత్ర ఉంది. అయినా నిందితుడు మాగుంట రాఘవరెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన 15 రోజుల బెయిల్ పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి రద్దు చేసింది అంటే… హత్య కేసులో నిందితుడికి హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ ను తప్పకుండా రద్దు చేస్తుందనేదే నా భావన అని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పార్టీ పునాదులు కదిలిపోతాయేమోనని భయం లేకుండా అతిగా స్పందిస్తున్న జగన్మోహన్ రెడ్డి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వైయస్ భాస్కర్ రెడ్డిని త్యాగం చేసిన మా పార్టీ నాయకత్వం, మరొక నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి విషయానికొచ్చేటప్పటికి అతిగా స్పందిస్తోంది. పార్టీ పునాదులు కదిలిపోతాయేమో నన్ను భయం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. వృద్ధుడైన భాస్కర్ రెడ్డికి లేని వెసులుబాటును వైఎస్ అవినాష్ రెడ్డికి కల్పించడం దురదృష్టకరం. వైయస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ ఆధారంగా, వైయస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా 40 పేజీల కౌంటర్ అఫిడవిట్ ను సిబిఐ దాఖలు చేసింది. అందులో A8 నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించింది.

వైఎస్ భాస్కర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలిగిన ఎంతో సమర్థత కలిగిన వ్యక్తి అని ఆయన్ని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు ఎదురైన సంఘటనలను కూడా సిబిఐ ప్రస్తావించింది. వైఎస్ వివేక హత్యకుట్రలో ముగ్గురు నిందితులు దేవి రెడ్డి ఉమా శంకర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిల పాత్ర కీలకం. హత్యలో పాల్గొన్న నిందితులు కేవలం డబ్బు ఆశ కోసమే వైఎస్ వివేకాను మట్టుబెట్టారు. హత్యకు దేవి రెడ్డి ఉమా శంకర్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి లు పథక రచన చేశారు అని సిబిఐ చెప్పింది .కానీ హత్య పథకరచన వెనకనున్న విస్తృత కుట్ర కోణాన్ని చేదించే దిశగా పరిశోధన చేస్తున్నామని సీ బీ ఐ తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.

ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సాక్షులైన గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిబిఐ అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టు రక్షణను కోరాల్సిన దుస్థితి విచారణా ధికారికి ఎదురయిందని సిబిఐ వెల్లడించింది. సాక్షులకు రక్షణ కావాలి కాబట్టి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టులో అంత సులభంగా బెయిల్ లభించకపోవచ్చునని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. బెయిల్ మంజూరు విషయములో ఏదైనా జరగవచ్చు. బెయిల్ మంజూరు అనేది న్యాయమూర్తి విచక్షణాధికారం. బెయిలు ఇవ్వడం సబబేనని న్యాయమూర్తి భావిస్తే ఇవ్వవచ్చు, సబబు కాదని భావిస్తే ఇవ్వక పోను వచ్చునని తెలిపారు.

A9 నిందితుడు ఎవరు?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని A8 నిందితుడిగా సిబిఐ తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. ఈ కేసులో A9 నిందితుడు ఎవరు?. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం జగన్మోహన్ రెడ్డికి అదే రోజు తెల్లవారుజామున 6.15 నిమిషాలకు ముందే తెలుసు. దీనితో మొత్తం ఈ కేసును తిరిగి చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం స్టేట్మెంట్ కూడా ఉంది. హత్య జరిగిన తర్వాత మా ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పడం, అదే విషయాన్ని సాక్షి మీడియా స్టోరీ నడిపించడం, వైఎస్ వివేక శవానికి కట్లు కట్టడం, వైయస్ వివేక శవం వద్దనే నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారందరూ ఉన్నారని అప్పటి సీఐ శంకరయ్య, పనిమనిషి లక్ష్మీ, ఇనాయతుల్లా చెప్పడం జరిగింది.

ఈ కేసులో 161 స్టేట్మెంట్ ఇస్తానని చెప్పినా గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఎలుకలు కొరికి చనిపోయాడు అట . అప్పటికే 161 స్టేట్మెంట్ ఇచ్చిన సిఐ శంకరయ్యకు పోస్టింగు లభించడంతో 164 స్టేట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించడం పరిశీలిస్తే, సాక్షులను నిందితులు ప్రభావితం చేస్తున్నారని సిబిఐ బలంగా చెప్పింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఒక కన్ను మరొక కన్నును ఎందుకు పొడుచుకుంటుందని పేర్కొనడం, సాక్షి దినపత్రిక, మీడియాలో ప్రాధాన్యత లేని అంశాలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల సాక్షులు భయపడరా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఆసుపత్రికి వెళ్ళి సాక్షులతో సీ బీ ఐ అధికారులు మాట్లాడలేని పరిస్థితిని సృష్టించిన నేపథ్యంలో, బెయిల్ వచ్చిందని మా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కర్ర సాము చేస్తూ, వీధుల్లో వీరాంగం సృష్టించిన పరిస్థితులలో నిందితులకు బెయిల్ ఇచ్చి వదిలి వేస్తే సాక్షులు ప్రభావితం కారా? అని నిలదీశారు.

దొంగ ఓట్లను ప్రతిపక్షాలు గుర్తించాలి… లేకపోతే ఇబ్బందులు తప్పవు
దొంగ ఓట్లను ప్రతిపక్షాలు గుర్తించాలి. ఇంటింటికి వెళ్లి ఓటర్ పేరును అడిగి తెలుసుకోవాలి. దొంగ ఓట్లను నమోదు చేయడమనేది మా పార్టీ నేతలకు ఒక అలవాటుగా మారింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు అప్రమత్తంగా లేకపోతే రాజకీయంగా వారికి ఇబ్బందులు తప్పవని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. గుంటూరులో ఎవరూ లేని ఒక ఇంట్లో 800 దొంగ ఓట్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమోదు చేశారు.

మరొక ఇంట్లో 187 ఓట్లను నమోదు చేశారు.. దొంగ ఓట్ల బలాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాలను గెలుస్తామని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష పార్టీల నాయకులు దృష్టి సారించాలి. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను తీసుకొని పరిశీలించాలి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను కూడా తొలగించి ఉంటారు. అప్రమత్తంగా వ్యవహరించి, అధికార పార్టీ కుయుక్తులను అడ్డుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

మద్య నిషేధం, సిపిఎస్ రద్దు చేయకుండానే 99% హామీలను పూర్తి చేశారట…
రాష్ట్రంలో మధ్య నిషేధం చేస్తామని చెప్పి చేయకుండానే, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయకుండానే ఎన్నికల్లో ఇచ్చిన 99% హామీలను పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ ఒక్క శాతం మాత్రం కూడా ఎందుకు వదిలివేశారోనని ఎద్దేవా చేశారు. నిన్న మొన్నటి వరకు 98.7 హామీలను అమలు చేశామని చెప్పేవారు. ఇప్పుడు ఎన్నికల్లో తాము ఇచ్చిన 99% హామీలను పూర్తి చేయడం వల్ల రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలలో గెలుస్తామని చెబుతున్న అధికార పార్టీ నాయకులు, రాష్ట్రంలో ఎన్నికలను దశలవారీగా నిర్వహించాలని కోరడం హాస్యాస్పదం. దశలవారీగా ఎన్నికల నిర్వహణను అడ్డుకొని తీరుతామని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తే దొంగ ఓట్లను సులభంగా వినియోగించుకొని గెలుపొంద వచ్చుననేది మా పార్టీ నాయకత్వం యొక్క వ్యూహం.

తమిళనాడు నుంచి చిత్తూరుకు దొంగ ఓటర్లను తరలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు ఏడవ తరగతి చదువని వారిని కూడా ఓటర్లుగా చేర్పించారు. అధికార పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న వ్యక్తిగా… ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మంచి పనులు చేస్తామని చెబుతున్నప్పటికీ, మా పార్టీ నాయకులు చేస్తున్న తప్పులను అడ్డుకోవాలన్నారు.

లోకేష్ కు వస్తున్న ప్రజాదరణ చూసే దొంగ ఓట్ల నమోదుకు ప్రయత్నం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర కు లభిస్తున్న ప్రజాదరణ చూసే దొంగ ఓట్ల నమోదుకు మా పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు . గతంలో ఎన్టీ రామారావు ను చూసేందుకు రాయలసీమలో ప్రజలు మిద్దెలు, మేడలు ఎక్కడం చూశాం. ఇప్పుడు లోకేష్ కు కూడా అటువంటి ప్రజాధారణే లభిస్తుంది. లోకేష్ కూడా ఎంతో పరిణితితో విజ్ఞానంతో మాట్లాడుతున్నారు. యువ గళం పాదయాత్రకు తమ ఊహకందనంత మంది జనాలు వస్తున్నారని రాయలసీమ ప్రాంత నాయకులే చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే, ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం వచ్చినట్లే కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

డిజైన్, నిర్మాణం చేసింది ఒకే సంస్థ… ఇక తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అవకాశమే లేదు
పోలవరం బండ్ డిజైన్, నిర్మాణము చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. బండ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి అంటే ఆ సంస్థ డిజైన్, నిర్మాణ లోపమే అయి ఉంటుంది. బండ్ కు పెద్ద ఎత్తున పగుళ్ళు ఏర్పడ్డప్పటికీ, ముఖ్యమంత్రి మాత్రం వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. బండ్ నిర్మాణం అన్నది 81 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న నిర్మాణం. స్పీల్ వే రక్షణ కోసం నిర్మించిన బండ్ ఇలా పగుళ్లు ఏర్పడితే ఎలా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

రివర్స్ టెండరింగ్ పేరిట అనుభవం ఉన్న వారిని కాదని అనుభవం లేని వారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం దురదృష్టకరం. మెయిన్ బ్యారేజ్ కు ఏదైనా డ్యామేజ్ జరిగితే అసలుకే మోసం వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్యారేజ్ కు డ్యామేజ్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. కేంద్రం నుంచి తరువాత నిధులను రాబట్టుకోవచ్చు. బ్యారేజీకి డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు.

జగన్ క్రిస్టియన్ అయితే రెడ్డి కారు
జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని విశ్వసిస్తే రెడ్డి కాలేరన్నది టిడిపి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అభిప్రాయము అయి ఉంటుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. నిజమైన క్రైస్తవుడు కులం పేరు పెట్టుకోరు. జగన్ క్రిస్టియన్ అయితే రెడ్డి కాకూడదు. ఆయన రెడ్డి అయితే, క్రైస్తవ మత విశ్వాసాలపై ఆయనకు నమ్మకం లేనట్టేనని, క్రైస్తవ మతంలో వర్ణ విభేదాలకు తావు లేదన్నారు.

రంగుల పిచ్చి మా వారికి ముదిరింది
మా పార్టీ నాయకులకు రంగుల పిచ్చి ముదిరింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లకు రంగులు వేసిన మా ప్రభుత్వం, హద్దురాళ్లకు, మూత్రశాలలు, ఆస్తి పత్రాలు, నోటు పుస్తకాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించింది. గతంలో దుర్గ గుడి ఉత్సవాలలో మా పార్టీ రంగులను పోలిన లైటింగ్ ఏర్పాటు చేశాము. అయినా హిందువులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నిరసన తెలియజేయలేదు.

కానీ మసీదు ఎంట్రన్స్ లలో ఫ్లెక్సీలు, మినార్లకు మా పార్టీ రంగులు కలిగిన బుడుగలను ఏర్పాటు చేస్తే ముస్లిం మత పెద్దలు నిరసన తెలియజేశారు. పార్టీ తరపున క్షమాపణలను చెప్పాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. అయితే మా పార్టీ నాయకత్వానికి క్షమాపణలు చెప్పే అలవాటు లేనందున, ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా, ఇప్పటివరకు ఉంచుకోబడిన సభ్యుడిగా ముస్లిం మతంపై నాకున్న గౌరవంతో శిరసు వంచి మా పార్టీ పక్షాన ముస్లిం సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు.

LEAVE A RESPONSE