లక్ష మందితో ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ

-సర్దార్ పటేల్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానల పరిశీలన
-సువిశాలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో సభ నిర్వహణకే బండి సంజయ్ మొగ్గు
-కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు భరోసా కల్పించేందుకు 15న సభ నిర్వహిస్తున్నామన్న బండి సంజయ్
-సభను సక్సెస్ ద్వారా ఖమ్మంలో బీజేపీ దమ్మెంతో చూపిస్తామని వెల్లడి
-పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడిన బండి సంజయ్
-స్థానిక సునీల్ కేఫ్ లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ సేవించిన బండి

ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి స్థానిక సర్దార్ పటేల్ గ్రౌండ్ తోపాటు ఆ పక్కనే ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానాలను పరిశీలించారు.

తొలుత పటేల్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పినప్పటికీ ఆ తరువాత బీజీఎన్నార్ మైదానం పరిశీలించాక ఆ మైదానంలోనే సభ నిర్వహించేందుకు మొగ్గు చూపారు. అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్న బండి సంజయ్ కుమార్ సువిశాలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయా మైదానాల పరిశీలన సందర్భంగా అక్కడే పిల్లలతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు వద్దకు వచ్చి స్థానిక సునీల్ కేఫ్ లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాగారు. ఈ సందర్భగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….

ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఖమ్మం డిగ్రీ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. సభ ఏర్పాట్లను పరిశీలించడానికే ఇక్కడికి వచ్చాం. అన్నింటికీ అనుకూలమైన మైదానం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షకు తగ్గకుండా జన సమీకరణ చేస్తాం.ఖమ్మంలో బీజేపీ సత్తా, దమ్ము చూపడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జరిగిన సన్నాహక సమావేశంలో కార్యకర్తల జోష్ చూస్తే లక్ష మందిని మించి సభకు హాజరయ్యే అవకాశముంది.

ఖమ్మం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నా. దేశం కోసం, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపాలని కోరుతున్నా. బీజేపీ కార్యకర్తలంతా పోలింగ్ బూత్ ల వారీగా ప్రచారం చేయాలి. సభకు తీసుకురావాలి. జన సమీకరణపై రాష్ట్ర సీనియర్ నాయకులతో ఓ కమిటీని వేయబోతున్నాం.

నిరుద్యోగ మార్చ్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో మీరంతా చూశారు… అమిత్ షా బహిరంగ సభను ఇతర జిల్లాల్లో నిర్వహించాలని ఒత్తిడి వస్తున్నప్పటికీ కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించడానికి, బీజేపీ దమ్మేందో చూపడానికే ఇక్కడ సభ నిర్వహించాలని నిర్ణయించాం. కార్యకర్తలు, యువత ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుతున్నా.

Leave a Reply