పదేళ్లుగా పూర్తికాని జగన్మోహన్ రెడ్డి 43 వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాభియోగ కేసుల ట్రయల్
సీబీఐ కోర్టు విచారణకు హాజరు కాకుండా అద్భుతమైన ఆర్డర్ తెచ్చుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి
చట్టం అందరికీ సమానమే అంటుంటారు కానీ … చట్టానికి నేను అతీతుడనని
నిరూపించుకున్న జగన్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై హై కోర్టును ఆశ్రయించిన ఉండవల్లి…
జగన్ ప్రభుత్వంలో జరిగిన ల్యాండ్, శ్యాండ్, మైన్ అవినీతిపై కూడా కోర్టును ఆశ్రయించాలి
చంద్రబాబుని తప్పుడు కేసు లో అరెస్టు చేయగలిగిన వారికి నేను, నారా లోకేష్ ఎంత?
చంద్రబాబును కస్టడీలో 9 మంది అధికారులు ప్రశ్నించడం ఏమిటో? ఏ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ అధికారే ప్రశ్నిస్తారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
వ్యవస్థలను వివస్త్రాలను చేసి ఆడుకుంటున్న మహా మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి . పదేళ్ల క్రితం సెప్టెంబర్ 23వ తేదీన 43 వేల కోట్ల రూపాయల అవినీతి నేరాభియోగ కేసుల నుంచి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన రోజును పండుగలా జరుపుకోవడంలో తప్పులేదు. చట్టం అందరికీ సమానమని అంటారు. కానీ ఆ చట్టానికి అతీతుడిని నేనని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందరికీ చట్టాలు ఒకటే అయినా , నాకు చట్టం వేరు… అందరికీ రాజ్యాంగం ఒకటే అయినా , నాకు రాజ్యాంగం వేరని, రాజ్యాంగాన్ని పునర్ లిఖించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.
43 వేల కోట్ల రూపాయల అవినీతికి జగన్మోహన్ రెడ్డి పాల్పడినట్లుగా శాస్త్రీయ ఆధారాలను సిబిఐ అధికారులు, న్యాయస్థానానికి సమర్పించినప్పటికీ, గత పదేళ్లుగా ఆర్థిక నేరాభియోగాల కేసుల ట్రయల్ కూడా పూర్తికాకుండా నిరంతరం పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ అడ్డుకోగలిగిన సమర్థుడని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ కోర్టుకు విచారణకే హాజరు కావలసిన అవసరం లేదన్నట్లుగా అద్భుతమైన ఆర్డర్ తెచ్చుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. 51 నెలలపాటు సిబిఐ కోర్టు విచారణకు హాజరు కాకుండా, ఆర్థిక నేరాభియోగ కేసుల ట్రయల్ కూడా పూర్తికాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ… పదవ బెయిలు దినోత్సవ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడమన్నది ఆర్డినరీ నాయకుడికి సాధ్యం కాదన్నారు. ఇది కేవలం శ్రీయుత, శ్రీమాన్ ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని, ఆయనకు ఈ సందర్భంగా దశమ బెయిల్ దినోత్సవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అందమైన కేకును రఘురామకృష్ణం రాజు కట్ చేశారు.. ఇలాగే ఎన్నో, మరెన్నో బెయిల్ దినోత్సవ వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అయితే జగన్మోహన్ రెడ్డి 11వ బెయిల్ వార్షికోత్సవ దినోత్సవం నాటికి నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండను. జగన్మోహన్ రెడ్డి బెయిల్ దినోత్సవ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడానికి నాకు మూడు అడుగుల ఆజానుభావుడే స్ఫూర్తి అని ఆయన తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఠా నాయకుడు విడుదలైన తేదీ సందర్భంగా నాకు సదరు మూడు అడుగుల ఆజానుభావుడు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు ఎంతగా కామెంట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే. చట్టం అందరికీ సమానమంటే, నాకు వేరని నిరూపించుకున్నారు. కోడి కత్తి గుచ్చుకుందో లేదో తెలియదు. కానీ కోడి కత్తి కేసులో ఐదేళ్లుగా నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి నో బెయిల్. గొడ్డలితో బాబాయిని వేసిన వాడికి మాత్రం బెయిల్ అంటూ అపహాస్యం చేశారు .
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సమాజంలో గౌరవం ఉన్న ఉండవల్లి హైకోర్టులో పిల్ వేయాలి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై సిబిఐ విచారణ కోరుతూ సమాజంలో గౌరవం ఉన్న పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీములో 370 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాజకీయాలలో అవినీతి మరకలు అంటని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి కి ఏమీ తెలియదని ఉండవల్లి అరుణ్ కుమార్ గుడ్డలు ఊడదీసిన తీరు అద్భుతం.
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే సీఐడీ కంటే, సిబిఐ అయితే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని భావించి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు విఫలమయ్యారు. రాష్ట్ర ఖజానాకు గండి పడితే, తన గుండెకు చిల్లు పడినట్లుగా భావించి అవినీతిని నిగ్గు తేల్చాలని హైకోర్టులో పిల్ వేసినట్లుగానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలలో అవినీతిపై కూడా పిల్ దాఖలు చేయాలి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ల్యాండ్, శ్యాండ్, మై న్లలో అవినీతి జరుగుతోందంటూ గతంలో పేర్కొన్న ఉండవల్లి అరుణ్ కుమార్, అదే అవినీతిపై సిబిఐ విచారణను కోరాలి. సీ మెన్స్ ప్రస్తుత డైరెక్టర్ ఈడీ కేసుల్లో ఒక అఫిడవిట్ ఇచ్చారు.ఆ అఫిడవిట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలుకు 95 నుంచి 98% కైండ్ ఇచ్చామని పేర్కొన్నారు. అయినా అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే, నిజమైపోతుందన్నట్లుగా … సూర్యుడు మీద ఉమ్మి వేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని జైలులో పెట్టి హింసించే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
ఏదైనా పట్టుకుంటే వదలని విక్రమార్కుడైన ఉండవల్లి అరుణ్ కుమార్… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై న్యాయస్థానాలలో పోరాటం చేయాలి. ఇసుక కుంభకోణంలో కోటాను కోట్లు దోచేస్తున్నారని గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. మద్యం లోని అవినీతి సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటుందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ఆమె కూడా మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.
నరసాపురంలో లక్ష రూపాయల మద్యాన్ని విక్రయించి, కేవలం 700 రూపాయల మధ్యమే విక్రయించినట్లుగా రసీదులు కట్ చేసిన వైనాన్ని వెలుగులోకి పురందరేశ్వరి తీసుకువచ్చారు. మద్యం అక్రమాలపై గత రెండున్నర ఏళ్లుగా నేను మాట్లాడుతూనే ఉన్నాను. మద్యం అక్రమాలలో లక్ష కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు చేరినట్లుగా గతంలో ఉండవల్లి చెప్పిన మాటలను విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ సమాజంలోనూ, న్యాయస్థానాలలోనూ గౌరమున్న వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ కేసు వేసినట్లుగానే, జగన్ ప్రభుత్వ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి.
స్కిల్ డెవలప్మెంట్ స్కీం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో అమలు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ పై సి ఐ డి విచారణ జరిపితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటుంది. అదే సిబిఐ విచారణ జరిపితే ఇతర రాష్ట్రాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలైన తీరును, ఆంధ్ర ప్రదేశ్ లో అమలు అయిన తీరును బెరీజు వేసుకుంటుంది.
అలాగే నైపుణ్య శిక్షణ కేంద్రాలను సందర్శించి, పరికరాలను మదింపు చేస్తుంది. రాష్ట్రంలో 40 క్లస్టర్ల పరిధిలో వందలాది కాలేజీలలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను గత ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తే, సిఐడి అధికారులు ఒక్క నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా తనిఖీ చేయలేదు. నైపుణ్య శిక్షణ కేంద్రాలలో ఉన్న పరికరాలను మదింపు చేసిన పాపాన పోలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ పై సిబిఐ విచారణ కోరుతూ ఉండవల్లి వేసిన పిటిషన్ పై ప్రజలు ఆయన్ని అపార్థం చేసుకోవడం బాధనిపిస్తోంది. ఎవరు తప్పు చేసినా ఉండవల్లి న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లారు.
కేవలం 370 కోట్ల రూపాయల అవినీతి గురించి ఇంతటి శ్రద్ధ వహించారు అంటేనే ఆ స్ఫూర్తి రాజమహేంద్రవరములో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆనాటి దురాచారాలపై కందుకూరి వీరేశలింగం పోరాడిన విషయం తెలిసిందే. అవినీతిపై ఉండవల్లి పూరించిన శంఖారావం కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులతో పాటు ఉండవల్లి అభిమానుల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కోరుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్రంలో మద్యం, ఇసుక, మట్టి తవ్వకాలలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ కోసం ఉండవల్లి న్యాయ పోరాటాన్ని చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అదే నేను న్యాయపోరాటం చేయవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తో వ్యక్తిగత వైరం వల్లే న్యాయపోరాటం చేస్తున్నానని ప్రజలు భావించే అవకాశం ఆయన అన్నారు.
వైఎస్ వివేకా కేసు డైవర్ట్ చేయడానికి చంద్రబాబు అరెస్టు చేశారేమో?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకోవడంతో, ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేశారేమోనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ కేసులో కేసు డైరీ కీలకం కానుంది. కేసు డైరీ స్వీకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనడంతో, ఎవరు ఎవరితో అర్ధరాత్రి తరువాత హత్య జరిగిన పిదప ప్రజలకు తెలియకుండా మాట్లాడుకున్నది కేసు డైరీలో సవివరంగా ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ అక్రమ అరెస్టుల పర్వానికి తెరలేపి ఉంటారు.
అక్టోబర్ 11వ తేదీన జరగనున్న వాదనలలో అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తాను ఇచ్చిన 161 స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవద్దని పిటీషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ కు కౌంటర్ గా సిబిఐ వాయిస్ రికార్డును కోర్టుకు సమర్పించింది. అలాగే అవినాష్ రెడ్డి కూడా తన 161 స్టేట్మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకోవద్దంటూ కోర్టును అభ్యర్థించగా, దర్యాప్తు సంస్థ కౌంటర్ దాఖలు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
నా కళ్ళల్లోకి చూడాలంటే నిచ్చెన వేసుకుని చూడాల్సిన వ్యక్తులు అస్సాం… అస్సాం అంటూ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని ఆశించాం. ఆశ ఆడి ఆశ అయింది. పై కోర్టుకు వెళ్తాం. హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఒక విలేకరి నన్ను కోరగా… మైండ్ బ్లాంక్ అయింది… పై కోర్టుకు వెళ్లడమేనని చెప్పాను. దానికి మా వెధవలు రియలైజేషన్ అంటూ వ్యాఖ్యానించారు.
నాకు రియలైజేషన్ ఎప్పుడు ఉంది. జడ్జిలను చంపేయాలని, నరికి వేయాలని కామెంట్లు చేసి కేసులు పెట్టగానే పారిపోయి తల దాచుకున్న వారు ఇప్పుడు నాకు రియలైజేషన్ అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాలను నేను గౌరవించినంతగా మరెవరు గౌరవించి ఉండరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైనే అవాకులు చవాకులు పేలి ఆయన కాళ్లు మొక్కటం నా ప్రస్తుత పార్టీ నాయకులకు మాత్రమే చెల్లింది. న్యాయ వ్యవస్థ అంటే నాకు అపారమైన గౌరవం. న్యాయ వ్యవస్థ వల్లే బ్రతికిపోయానని నేను ఇప్పటికీ భావిస్తూ ఉంటాను. కింద న్యాయస్థానాలలో న్యాయం జరగనప్పుడు, సుప్రీం కోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసించే వ్యక్తిని నేను.
వైసీపీ సోషల్ మీడియా విభాగం ఏసీబీ కోర్టులో అస్సాం… హైకోర్టు లో అస్సాం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు సుప్రీం కోర్టులో కూడా అస్సామని వ్యాఖ్యలు చేయండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వైసిపి సోషల్ మీడియా బ్యాచ్ చేసే వ్యాఖ్యలు పంపిస్తాం. ఆ తరువాత మీరు అండమాన్ కు వెళ్లాల్సిందే. ఆరిపోయే దీపాన్ని నేను ఆపడం ఎందుకు…?!. జూన్ రెండవ తేదీ లేదంటే మూడవ తేదీన గుర్తుకులేదు… ప్రత్యేక విమానాన్ని వేసుకొని పదిమంది ఎంపీలు ఢిల్లీకి వచ్చి నన్ను అనర్హుడి గా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ ఇచ్చారు. ఇప్పటికీ నన్ను డిస్ క్వాలిఫై చేయించాలని ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు… అయినా మీరు చేయగలిగింది ఏమిటి?.
రాజ ద్రోహం అనే తప్పుడు కేసు పెట్టి అపహరించి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించానని ఒప్పుకుంటే మగాడు అని అనుకునేవాన్ని. నేను కొట్టించలేదని అందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నారు. ఇలా దొంగ దెబ్బ కొట్టాల్సిందే తప్పితే నిచ్చెన, స్టూల్ బ్యాచ్ చేయగలిగింది ఏముందంటూ ఎద్దేవా చేశారు .. చంద్రబాబు నాయుడు నే అక్రమ కేసులో అరెస్టు చేసిన వారికి నేను, నారా లోకేష్ ఎంత?!. ఇప్పటికే నాపై ఉన్న కేసుల సమాచారాన్ని తీసుకున్నా. ఈ గాడిదలు, ఓ సింహం, మరికొన్ని గొర్రెలు కలిసి ఏదైనా వంటకం వండితే ఆ వంటకాన్ని వారికి పిండంగా పెడతానని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దన్న న్యాయమూర్తికి ధన్యవాదాలు
పోలీస్ కస్టడీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని, విచారణను తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని పేర్కొన్న ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పోలీసు కస్టడీలో మా వారు ఎంతకైనా తెగిస్తారని న్యాయమూర్తి భావించి ఉంటారు. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారు. పోలీస్ కస్టడీలో చంద్రబాబు నాయుడుని విచారించడానికి 9 మంది అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఏ కేసులోనైనా ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే ప్రశ్నిస్తారు. మరి తొమ్మిది మంది అధికారులు ఎందుకు?.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నవరత్నాలు కలిసి వచ్చినట్లు 9 సంఖ్య తో విచారణకు నవగ్రహాలను ప్రవేశపెట్టారా అంటూ అపహాస్యం చేశారు. సిబిఐ కోర్టుకు 77 సార్లు రాని నిందితుడు పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గతంలో ఫైల్ చేశాను. కానీ అప్పట్లో ఫైల్ వెనక్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దశమ బెయిల్ వార్షికోత్సవం జరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం కోసం పోరాడుతా. అది నా లక్షణం.
న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. చంద్రబాబు నాయుడు కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టి వేసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. సోమవారం, మంగళవారం మాత్రమే కోర్టుకు పని దినాలు ఉండడంతో, ఈ రెండు రోజుల్లోనే కేసు లిస్ట్ అయ్యేవిధంగా చూడాలి. లేకపోతే వరుస సెలవుల నేపథ్యంలో వాయిదాకే సిఐడి తరపు న్యాయవాదులు మొగ్గు చూపే అవకాశం ఉంది.
చంద్రబాబు తరపు న్యాయవాదులు అప్రమత్తంగా ఉండి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం శపథం పసిగట్టినడుచుకోవాలి. సుప్రీంకోర్టులో ఎటువంటి వాయిదా లేకుండా చంద్రబాబు నాయుడు కి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. కస్టడీ తర్వాత ఏసీబీ న్యాయస్థానం కూడా బెయిల్ పిటిషన్ పరిశీలిస్తామని వెల్లడించింది. చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి న్యాయమూర్తి మీరు కస్టడీలో ఉన్నారు.
అంతమాత్రాన తప్పు చేసినట్లు కాదు అన్న వ్యాఖ్యలు స్వాంతన చేకూర్చే విధంగా ఉన్నాయి. ఏసీబీ కోర్టులో న్యాయం జరగాలని భగవంతుని ప్రార్థిద్దాం. దానికి మా పనికిమాలిన బ్యాచ్ అస్సాం అని అంటారా?, సమయమనం పాటిస్తారా అన్నది చూడాలని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.