– భార్య భారతీరెడ్డిపైనా ఆరోపణలు?
– గోవిందప్ప పెదవి విప్పిన ఫలితమేనా?
– జగన్ అరెస్టుకు సిట్ సిద్ధమవుతోందా?
– అందుకే దంపతులు గవర్నర్‌ను కలిశారా?
– అరెస్టు సంకేతాలున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారా?
– సిట్ తనను పిలిచి అరెస్టు చేస్తుందని జగన్ భావిస్తున్నారా?
– ఆ మేరకు జగన్ మానసికంగా సిద్ధమవుతున్నారా?
– వందరోజులు మనవి కాదనుకోండంటున్న జగన్
– విపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ భారతీతో గవర్నర్‌ను కలవని జగన్
– ఈసారి ప్రత్యేకతపైనే పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు
– జగన్ అరెస్టయితే భారతికి పార్టీ పగ్గాలు?
– జగన్ అరెస్టును ధృవీకరిస్తున్న సజ్జల వ్యాఖ్యలు
– జగన్ జైలులో ఉన్నప్పుడే భయపడలేదన్న సజ్జల
– అరెస్టుపై క్యాడర్‌ను మానసికంగా సిద్ధం చేస్తున్న సజ్జల?
– దానిని ధృవీకరించిన మాజీ ఎంపి మాధవ్ తాజా వ్యాఖ్యలు
-తాజా పీఏసీ భేటీలో సీనియర్లు అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరిక
– మీరు జాగ్రత్తగా ఉండాలన్న పీఏసీ సభ్యులు
– మీ భద్రతే మాకు ముఖ్యమన్న సీనియర్లు
– మిథున్‌రెడ్డి అరెస్టుతో మానసిక స్ధైర్యం దెబ్బతిందా?
– క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతినలేదంటున్న సీనియర్లు
– పార్టీ వర్గాల్లో జగన్ అరెస్టుపై చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)
లిక్కర్ కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎంపి మిథున్‌రెడ్డి అరెస్టు తర్వాత, సిట్ మలి అడుగు తాడేపల్లి ప్యాలెస్కేనా? భారతి సిమెంట్ డైరక్టర్ గోవిందప్ప స్టేట్మెంట్ ఆధారంగా జగన్‌ను విచారణకు పిలిచేందుకు సిట్ సిద్ధమవుతోందా? ఆ మేరకు జగన్ సహా ఆయన వ్యూహ బృందం కూడా, తమ అధినేత అరెస్టుపై మానసికంగా సిద్ధంగానే ఉన్నారా? కొద్దిరోజుల క్రితం సజ్జల, తాజాగా మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ తమ అధినేత అరెస్టుపై చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయా? సీనియర్లంతా ఇకపై అలర్ట్‌గా ఉండాలన్న జగన్ హెచ్చరికల సంకేతాలూ అవేనా? మరి జగనన్న లిక్కరు ‘లెక్క’లో జైలుకెళితే, పార్టీని నడిపించేదెవరు? భార్య భారతీరెడ్డినా.. సలహాదారు సజ్జలనా? ‘ఐదేళ్లలో ఓ వందరోజులు మీవి కాదనుకోండ’న్న జగన్ వ్యాఖ్యలను, తనకూ అన్వయించుకుంటున్నారా?.. ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.
వేలకోట్ల లిక్కర్ కుంభకోణంలో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న వైనం, ఆ పార్టీ నాయకులను కలవరపెడుతోంది. ఎంపి మిథున్‌రెడ్డి తర్వాత అరెస్టు జగన్‌దేనని పార్టీ సీనియర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు, వారి మాటలే స్పష్టం చేస్తున్నాయి. అసలు వారిని పార్టీ నాయకత్వమే ఆ మేర కు మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పార్టీ అగ్రనేత జగన్ సలహాదారయిన సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. జగన్‌ను గతంలో అరెస్టు చేసినప్పుడే పార్టీకి ఏమీ కాలేదని, తర్వాత ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. జగన్ అరెస్టు చేసినా భయపడేది లేదని, క్యాడర్ చెక్కుచెదరదని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ సైతం జగన్ అరెస్టుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించడం బట్టి.. ముందుగా నాయకులను మానసికంగా సిద్ధంగా చేసే వ్యూహం అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
నిజానికి జగన్.. తనతో సహా పార్టీనేతలు అరెస్టులకు మానసికంగా సిద్ధంగా ఉండాలని, మొదటినుంచీ చెబుతూనే ఉన్నారు. ‘‘ఐదేళ్లలో ఓ మూడు నెలలు మీవి కావనుకోండి. అరెస్టు చేసి జైల్లో పెడతారు. కేసులమీద కేసులు పెడతారు. అంతకుమించి ఏమీ చేయలేరు. మనం న్యాయపోరాటం చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనమూ ఏమీ చేయలేం. తర్వాత మనదే రాజ్యం అని చెబుతూ వస్తున్నారు. తన అరెస్టు విషయంలోనూ ఆయన అదే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది.
దానికి తగినట్లుగానే అటు జగన్ దంపతులు హటాత్తుగా గవర్నర్‌తో భేటీ కావడం, ఈ అనుమానాలకు మరింత బలం చే కూర్చింది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు భార్య భారతీరెడ్డితో కలసి, గవర్నర్‌ను కలిసిన దాఖలాలు లేవు. ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలోనే ఇద్దరూ గవర్నర్‌ను కలిశారు.
మరి ఇప్పుడు వారిద్దరూ గవర్నర్‌ను ఎందుకు కలిశారు? ఏమి చర్చించారన్న అంశంపై చర్చ జరుగుతోంది. తన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని, సిట్ తనకు నోటీసు ఇచ్చి, తర్వాత మిథున్‌రెడ్డి మాదిరిగానే అరెస్టు చేయబోతోందని ఆయన, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో లిక్కర్ కేసులో భారతీ సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప ప్రకటన ఆధారంగా తనతోపాటు, తన భార్య భారతీరెడ్డిని కూడా ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తాజాగా జరిగిన పీఏసీ భేటీలో కూడా సీనియర్లు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించడం చర్చనీయాంశమయింది. కాగా తాజా పరిణామాలతో క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతిందని నాయకులు చెబుతున్నారు. ఇక జగన్ అరె స్టయితే అది మరీ సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
ఇదిలాఉండగా.. లిక్కర్ కేసులో జగన్‌ను కూటమి ప్రభుత్వం కాకుండా, ఈడీ అరెస్టు చే స్తుందన్న ప్రచారం జరిగింది. లిక్కర్ కేసులో హవాలా, మనీలాండరింగ్ కూడా ఉండటంతోపాటు, ఈ కేసు వివరాలను ఈడీ కూడా తీసుకుంది. దానితో జగన్‌ను రాజకీయంగా ఈడీ అరెస్టు చేస్తేనే కూటమి ఇమేజికి నష్టం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమయింది.
అయితే అందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉందని, ఫలితంగా అరెస్టు ఆలస్యమవుతున్న సందర్భంలో సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా కేసు ఈడీ చేతిలోకి వెళితే, జగన్ జుట్టు మళ్లీ ే ంద్రంలోని బీజేపీ చేతికి వెళుతుందన్న చర్చ కూడా జరగకపోలేదు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు జగన్‌పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నందున, ఈడీ కేసులో జగన్ అరెస్టు అవుతారన్న గ్యారంటీపై సహజంగానే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్‌ను సిట్ అరెస్టు చేయవచ్చంటున్నారు.
అయితే.. జగన్‌ను అరెస్టు చేసే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయదని, ఇప్పటికే జగన్ మళ్లీ వస్తే ఎలా అన్న భయంతో ఉన్న కూటమి ప్రభుత్వం, అంత సాహసం చేస్తుందనుకోవడం లేదని వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో క్యాడర్ నైతికస్థైర్యం దెబ్బతినలేదు. వాళ్లు మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామన్న నమ్మకంతో ఉన్నారు’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
పార్టీ పగ్గాలు భారతీరెడ్డికి?
కాగా పార్టీ అధినేత జగన్ ఒకవేళ అరెస్టయితే ఆయన భార్య భారతీరెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో మొదలయింది. జగన్‌కు సన్నిహితుడైన సజ్జల, వైవి సుబ్బారెడ్డి, బొత్స వంటి సీనియర్ల సలహాతో పార్టీని నడిపించవచ్చని పార్టీ నేతలు సూచనప్రాయంగా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కీలక అంశాలలో ఆమె జోక్యం చేసుకునేవారని, పార్టీ వ్యవహారాలు కూడా ఆమెకు కొత్తకాదు కాబట్టి.. అధినేత అరెస్టయి, బెయిల్‌పై బయటకొచ్చేంతవరకూ భారతీరెడ్డి పార్టీని నడిపించే అవకాశాలుంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.