ఏపీలో వైసీపీకి కాలం చెల్లింది

-జగన్ రెడ్డి, వైసీపీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు
-ఐప్యాక్ సర్వేల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని తేలింది..
-అధికారాన్ని నిలబెట్టుకునేందుకే చంద్రబాబుపై కుప్పంలో దాడి
-లేపాక్షి, ఢిల్లీ కుంభకోణాల్లో జగన్ కుటుంబం పాత్ర
-దాడులు,బెదిరింపులు, అక్రమ కేసులకు టీడీపీ భయపడే ఛాన్స్ లేదు..
-చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కాలం చెల్లిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘అవినీతి, అసత్య ప్రచారం అనే పునాదులు మీద పుట్టిన వైసీపీ ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఛీ కొట్టి తరిమేస్తున్నారు. రాష్ట్రమంతటా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇటీవల కుప్పంలో జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, కుప్పం మార్కెటింగ్ చైర్మన్ విద్యాసాగర్ లు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. దీనికి పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుప్పంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కలిగిన నాయకుడు చంద్రబాబు పర్యటిస్తుంటే, దానిని కుప్పం, పీలేరు, పుంగనూరు, చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ముందుగా వచ్చిన వైసీపీ గూండాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు పర్యటనపై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తల తలలు పగులకొట్టడం, అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం, టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టడం వంటి సంఘ విద్రోహ చర్యలకు వైసీపీ పాల్పడింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వైసీపీ గూండాలను పోలీసులు వదిలేశారు. దాడులకు గురై, నష్టపోయిన టీడీపీ కార్యకర్తలు 60మందిపై అక్రమ కేసులు బనాయించారు. కుప్పం ఘటనను నిరసించిన టీడీపీ నాయకులపై ఏపీలో కొంత మంది సీఐలు బెదిరింపులకు పాల్పడం, కాల్చిపారేస్తా అని బెదిరించడం, తొడగొట్టి మీసాలు మెలివేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు దిగారు. పోలీసులు ఇంత తంతు చేస్తున్నా..వీటిపై డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కనీసం నోరుమెదపకపోవడం పోలీసుల ఏకపక్ష ధోరణికి అద్దం పడుతుంది

లేపాక్షి, ఢిల్లీ కుంభకోణాలను దాటవేసేందుకే కుప్పం దాడులు…
ఒక్క ఛాన్స్ అంటూ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. లేపాక్షికి సంబంధించిన రూ.10వేల కోట్ల విలువైన రైతుల భూములను జగన్ కుటుంబం కబ్జా చేసింది. ఈ విషయం ఇటీవల మీడియా వేదికగా బట్టబయలైంది. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగన్, తన భార్య భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి, తన కుటుంబసభ్యుల పేర్లు బయటకు వచ్చాయి. కావలిలో దళిత యువకుడిని వైసీపీ నాయకులు వేధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్ లో ఈ విషయాలను పేర్కొన్నాడు. ఈ విషయాలు ప్రజల్లో చర్చ జరగకుండ ఉండేందుకు జగన్ రెడ్డి కుప్పంలో వైసీపీ గూండాలతో ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి చేయించి, అల్లర్లు సృష్టించారు

ఐప్యాక్ రిపోర్టులతో జగన్ కు ఓటమిభయం
ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమిని మూటగట్టుకోబోతోందని తేలింది. దీంతో జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తన దోపిడీ రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి రకరకాల ఎత్తుగడలను జగన్ రెడ్డి ప్రయోగిస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తున్నారు. వీటిని ప్రజలు విశ్వసించకపోవడంతో కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దాడికి తెగబడ్డారు. దీని ద్వారా రాష్ట్రమంతా ప్రతిపక్ష నాయకులను బెదిరించే సంకేతాలను పంపాలని చూశారు. దీనికి పెద్దిరెడ్డి, పోలీసులు సహకరించారు

60మందిపై పోలీసులు అక్రమ కేసులు..
కుప్పంలో ప్రతిపక్ష నాయకుడి పర్యటనపై దాడిచేసిన వైసీపీ గూండాలను పోలీసులు కాపాడుతున్నారు. బాధిత టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. కుప్పం ఘటనలో మొత్తంగా 60మందిపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి కేసులతో పోలీసులు టీడీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన గూండాలను వదిలేసి, టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడాన్ని కుప్పం ప్రజలు నిలదీస్తున్నారు. వైసీపీ నాయకుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నాయకులపై స్థానిక మహిళలే తిరగబడుతున్నారు.

ఆ పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు..
కుప్పంలో ప్రతిపక్షనేత చంద్రబాబు తన పర్యటనకు పోలీసుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. కానీ చంద్రబాబు పర్యటనను ప్రశాంతంగా నిర్వహించడంలో చిత్తూరుజిల్లా పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అన్నా క్యాంటీన్ ను వైసీపీ గూండాలు ధ్వంసం చేస్తుంటే, టీడీపీ కార్యకర్తల తలలు పగులకొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై పోలీసులు ఎదురుదాడి ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు, వైసీపీ గూండాలు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టారు.

కుప్పం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అనంతపురం రాప్తాడు సీఐ చినగౌస్ టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డాడు. కాల్చిపారేస్తా అంటూ బెదిరించాడు. అదేజిల్లాలో కదిరి సీఐ తమ్మిశెట్టి మధు టీడీపీ నాయకులను రెచ్చగొట్టి, గొడవపడి, తొడగొట్టి మీసం మెలేశారు. రాష్ట్రంలో పోలీసులు ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా డీజీపీ కనీసం నేటి వరకు నోరుమెదపలేదు. పోలీసుల ఏకపక్ష ధోరణికి ప్రతిచర్యలు తప్పకుండా ఉంటాయి. అన్యాయంగా వ్యవహరించిన పోలీసులు ప్రైవేటు కేసులు ఎదుర్కోవాలి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుపెట్టుకోవాలి

వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు…
జగన్ రెడ్డి ప్రతిపక్షంపై దాడులు, అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నాడు. ఇటువంటి ఉడత ఊపులకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. వైసీపీ అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఎన్ని దాడులనైనా, ఎన్ని అక్రమ కేసులనైనా, చివరకు జైళ్లకు వెళ్లడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. టీడీపీని భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి అవివేకానికి నిదర్శనం

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి
జగన్ రెడ్డికి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. ప్రతిపక్ష నాయకుడిపై దాడులు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, నిర్బంధాలు, అక్రమ కేసులతో గెలవాలనుకోవడం అవివేకం. దమ్ముంటే తన ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి, తక్షణమే ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసురుతున్నాం. దమ్ముంటే స్వీకరించాలి. తాము ఎటువంటి పరిపాలనను కావాలనుకుంటున్నారో తీర్పునివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు