Suryaa.co.in

Andhra Pradesh

పేర్ల మార్పులు తప్ప ఈ నాలుగేళ్లలో జగన్ సర్కార్ చేసింది ఏమీ లేదు

-విపరీతమైన డబ్బా కొట్టుకోవడం … ప్రశ్నిస్తే చితక్కొట్టడమే
-మహిళలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతాంగాన్ని నిలువునా మోసగించిన జగన్మోహన్ రెడ్డి
-పురోగతిలో పొరుగు రాష్ట్రం… అధోగతిలో ఆంధ్ర ప్రదేశ్
-ఈ నాలుగేళ్లలో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి శూన్యం
-వచ్చిన రెండు కంపెనీ కూడా టిడిపి ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదిరినవే
-సాగునీటి రంగాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
-కేంద్ర సహకారం లేకుండానే కాలేశ్వరం పూర్తిచేసిన కెసిఆర్
-చంద్రన్న దెబ్బకు… జగనన్న మంత్రుల ముఠా … ఠా
-స్థాయి మరిచి మాట్లాడుతున్న శాసన సభాపతి…
-పాల్ ఆశీస్సుల వల్లే గెలిచానని నేను చెబుతుంటే… తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్న పాల్
-హత్యా నేరాభియోగం లో ముందస్తు బెయిల్ కష్టమే
-ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి వేసిన వెంటనే అవినాష్ రెడ్డి అరెస్టు
-మార్గదర్శి ఆస్తుల అటాచ్మెంట్ ఉన్మాద చర్య
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఈ నాలుగేళ్లలో పేర్ల మార్పులు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం . దానికే విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటూ, తమకు తామే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఎవరైనా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే వారిని చితకొట్టడమే పనిగా పెట్టుకున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేయడం ద్వారా విధ్వంసం శాంపిల్ ను రాష్ట్ర ప్రజలకు రుచి చూపించారు. పుష్ప చిత్రంలో హీరో అల్లు అర్జున్ తగ్గేదే అంటూ చెట్లను నరికితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నరికి వేశారన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98.6 శాతం అమలు చేశామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, మహిళలకు ఇచ్చిన మధ్య నిషేధం హామీని తుంగలో తొక్కారు.

దశలవారీగా మద్య నియంత్రణ చేపట్టి, తాను అధికారం చేపట్టిన నాలుగవ ఏటా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తానన్నారు. లేకపోతే రానున్న ఎన్నికల్లో ఓట్లే అడగనని పేర్కొన్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 మే 30వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేసి నేటికీ సరిగ్గా నాలుగేళ్లు పూర్తి అవుతోంది. మధ్య నిషేధం హామీకి తూట్లు పొడుస్తూ, రానున్న 25 ఏళ్లకు మద్యం మీదే వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, ఆ ఆదాయానికి సరిపడా అప్పులను చేశారు.

మద్యం ఆదాయ వనరులపై దాదాపుగా 33 వేల కోట్ల రూపాయల అప్పును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. మద్య నిషేధం అంటూ చేస్తే ఈ అప్పును వెనక్కి కడుతానని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జీతాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో 33 వేల కోట్ల రూపాయల అప్పులు చెల్లించి, మద్య నిషేధం అమలు చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. మహిళలను మోసగించడం ద్వారా ఈ ప్రభుత్వ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఉద్యోగులకు సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీ, బాబు ఏదో తెలియక అన్నారన్న సజ్జల వ్యాఖ్యలతో అటకెక్కింది.

ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. సాక్షి దినపత్రిక క్యాలెండర్ విడుదల చేశారు కానీ జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్ర రైతాంగం నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, నాలుగు నెలలైనా రైతులకు డబ్బులు చెల్లించలేదు. ధాన్యం డబ్బులు ఇవ్వాలని అడిగిన రైతాంగాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి వెర్రి పప్పా అంటూ సంబోధించారు. వెర్రి పప్పా అంటే బూతు కాదట… బుజ్జి నాన్న అని పిలిచినట్లని మంత్రి చెప్పడంతో, ఇప్పుడు ప్రజలంతా మా పార్టీ నాయకులను వెర్రి పప్పా అని సంబోధిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నవాడు, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు కావడంతో ఆయన్ని ప్రజలంతా వెర్రి పప్పా అంటే బుజ్జి నాన్న అని ముద్దు గా పిలుచుకుంటున్నారు . ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పోలీసు రాజ్యమే నడిచింది. నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నన్ను తీసుకువెళ్లి కొట్టారు. వాట్సాప్ గ్రూపులలో సంక్షిప్త సందేశాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ముసలివారని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు చేసి వేధించారు. విద్యా దీవెన, విద్యా వసతీ పథకాలు అన్నవి ట్రాష్.

అమ్మ ఒడి అన్న పథకాన్ని మాత్రమే ఈ ప్రభుత్వం అమలు చేసింది. పేదల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందిని చదివిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కానీ, ఆ తరువాత ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. అమ్మ ఒడి పథకం అమలు కోసం ఎస్ సి, ఎస్టీలకు ఉపయోగపడే 29 పథకాలను ఈ ప్రభుత్వం ఎత్తివేసింది. బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పి, విద్యా వసతి, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాల లబ్ధిదారులకు ప్రత్యేకంగా కార్పోరేషన్ ద్వారా నిధులు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయమే అధికం
తెలుగుదేశం ప్రభుత్వము హయాంలో తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం అధికంగా ఉంది. 2018 – 2019 ఆర్థిక వార్షిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ టాక్స్ రెవిన్యూ, జిఎస్టి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్ టాక్స్, ఎక్సైజ్ ఆదాయం 62, 395 కోట్ల రూపాయలు కాగా, తెలంగాణ ఆదాయం 59, 612 కోట్లు. ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం మూడువేల కోట్ల రూపాయల కన్న అధికం. అదే 2022 – 2023 వార్షిక ఆర్థిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం 88 వేల కోట్లు కాగా, తెలంగాణ ఆదాయం లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 100% పెరిగితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం కేవలం 30 నుంచి 32 శాతం మాత్రమే పెరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి 18,779 కోట్ల రూపాయల ఆదాయం చేకూరింది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కు 6000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా లభించింది.

స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 5, 427 కోట్లు ఆదాయం లభించగా, తెలంగాణకు 5, 344 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే లభించింది. హైదరాబాదు వంటి నగరం తెలంగాణకు ఉన్నప్పటికీ, అమరావతి అభివృద్ధి పేరిట ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకొని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది . అదే 2022 – 2023 వార్షిక ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రూపంలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 38 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించగా, తెలంగాణకు 41, 888 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుంది.

తెలంగాణ గ్రోత్ రేట్ 220 నుంచి 230% కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం 50 నుంచి 55 శాతం మాత్రమే. స్టాంపు డ్యూటీ పెంచినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం 8,022 కోట్లు కాగా, తెలంగాణ ప్రభుత్వ ఆదాయం 14,228 కోట్లు. తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పతాక స్థాయికి చేరుకోగా, మన రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార వృద్ధి కేవలం 37% మాత్రమే నమోదు చేసుకుంది. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార విధ్వంసానికి కారకులెవరో ప్రజలు గమనించాలి.

2018 -19 వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మద్యంపై 6 వేల కోట్ల రూపాయల ఆదాయం లభించగా, తెలంగాణ ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మద్యాన్ని అప్పటి ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించలేదు. నాణ్యమైన మద్యాన్ని మద్యపాన ప్రియులకు అందుబాటులో ఉంచింది. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రముఖ బ్రాండ్లను విక్రయించేలా టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2022-2023 వార్షిక ఆర్థిక సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మద్యం ఆదాయం పదిహేను వేల కోట్లు కాగా, తెలంగాణ ప్రభుత్వ ఆదాయం 18 వేల కోట్ల రూపాయలు.

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ధరలు రెండింతలకు పైగానే పెంచారు. అయినా ఆదాయం తగ్గడం వెనుక, రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయించడమే కారణం. మద్యం దుకాణాలలో నగదు తప్ప, క్రెడిట్ కార్డులను అంగీకరించకపోవడం వల్లే తెలంగాణ కంటే ఆదాయం తగ్గింది. తెలంగాణలో మద్యం ఆదాయం పెరగడానికి అక్కడి మద్యం దుకాణాలలో డిజిటల్ పేమెంట్ లను స్వీకరించడం ఒక కారణం అయితే, అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచడం మరొక కారణమని తెలిపారు.

రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలతో పోలిస్తే సర్వనాశనం చేశారనేది నిజం. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేదు. పారిశ్రామికవేత్తలను వాటాల కోసం బెదిరించారు. విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు పేరిట సంతకాలు చేశారు తప్పితే, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రెండు పరిశ్రమలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే అంగీకారాలు కుదిరాయి. సాక్షి దినపత్రిక లో కోతలు తప్ప, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అన్నది శూన్యమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

హవ్వ…అప్పు తెచ్చి సంక్షేమమా?
అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు పోవడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింది. అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుకొని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను ఎవరు తీరుస్తారన్నది ప్రశ్నార్ధకమే. సాగునీటి రంగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

కాళేశ్వరం వంటి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి రూపాయి సహకారం లేకపోయినప్పటికీ పూర్తి చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన మొత్తంతో పోలిస్తే, ఈ ప్రభుత్వం సాగునీటి రంగం కోసం 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. పోలవరం పూర్తి చేసి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

బస్సు టికెట్లు తీసుకోమంటున్న మహిళలు
తెలుగుదేశం పార్టీ ఈనెల 28వ తేదీన మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టో అనంతరం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోవడానికి మహిళలు నిరాకరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసింది.

టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టో పై మంత్రులు అంబటి రాంబాబు, నాగార్జున, రోజా, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని నాని, లుచ్చామంత్రి జోగి రమేష్ వంటి వారు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. మహానాడులో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన టీజర్ కు జగనన్న మంత్రుల ముఠా దెబ్బకు ఠా అన్నది.

టిడిపి మేనిఫెస్టో విడుదల అనంతరం శాసన సభాపతి తన స్థాయిని మరిచి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు రక్షణను తొలగిస్తే మటాష్ అవుతారని పేర్కొనడం పరిశీలిస్తే, ఒళ్ళు మర్చిపోయి మాట్లాడినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడుకు రక్షణను తొలగించాలని కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొనడం సిగ్గుచేటు . తాను కూడా ఇదే విషయంపై ప్రధానమంత్రికి లేఖ రాస్తాను.

ప్రధాన ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి సెక్యూరిటీని తొలగించాలని పేర్కొనడంపై ఒక ఎంపీగా తన అభ్యంతరాన్ని తెలియజేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. ఒక శాసనసభాపతి, ప్రధాన ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ తొలగించమని ప్రధానికి లేఖ రాయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది పోలీసు సిబ్బంది సెక్యూరిటీతో, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళుతూ ప్రాణ రక్షణ కోసం పరదాల చాటున, ఏపుగా ఎదిగిన వృక్షాలను కొట్టివేయించి తిరుగుతున్నారు.

ముఖ్యమంత్రి ఎక్కడకు వెళ్లినా అక్కడ దుకాణాలను మూసివేయిస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు హాజరు కావాలంటే నల్ల చొక్కాలు, చున్నీలు ధరించరాదని ఆంక్షలు విధిస్తున్నారు. ఎన్నెన్నో కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రి కి మాత్రం సెక్యూరిటీ అవసరమా?, అదే ప్రధాన ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ అవసరం లేదంటారా?? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకు సెక్యూరిటీని తొలగిస్తే ఫినిష్ అవుతారని శాసనసభాపతి చేసిన వ్యాఖ్యలు తెలియని తనమా?, మూర్ఖత్వమా??, చేతగానితనమా?, పొగరుబోతు తనమని అనుకోవాలా అంటూ ప్రశ్నించారు.

బ్రదర్ అనిల్ వల్ల మా పార్టీ కి 17 శాతం ఓట్లు పడ్డాయి
కేఏ పాల్ ఆశీస్సుల వల్లే ఎన్నికల్లో నేను నెగ్గాను. కానీ, నేను వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి గెలిచానని కె ఏ పాల్ అంటున్నారు. నేను కేఏ పాల్ ఆశీస్సుల వల్లే గెలిచానని చెప్తుంటే ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా, అగౌరవ పరచుకునే విధంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తనకు కేఏ పాల్ రాడేదో దింపారని సాక్షి మీడియా ప్రచారం చేస్తూ, ఆయన్ని ఆకాశానికి ఎత్తుతోంది.

ఇందులో నాకు రాడ్ దింపిన అంశం ఏమిటో అర్థం కాలేదు.. బ్రదర్ అనిల్ ప్రచారం వల్ల గత ఎన్నికల్లో మా పార్టీకి 17 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి బ్రదర్ అనిల్ మా పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేవు. ఆ 17% ఓట్లు సంకనాకి పోయే ప్రమాదం ఉంది. జగన్ రావణ పాలన మళ్లీ రాష్ట్రంలో రావాలంటే కె ఏ పాల్ సహకారం ఎంతో అవసరం. ఎన్నికల పొత్తులో భాగంగా ప్రజాశాంతి పార్టీని మా పార్టీలో విలీనం చేసి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అంతర్జాతీయ పార్టీగా రూపొందించండి.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా పేర్కొంటున్నాం. ప్రజాశాంతి పార్టీ విలీనంతో అంతర్జాతీయ పార్టీ అవుతుంది. బ్రదర్ అనిల్ లేని లోటును కేఏ పాల్ పూడ్చాలి. సింహం సింగల్ గా వస్తుందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి, అంతర్జాతీయ సింహమైనా కె ఏ పాల్ తోడు కావాలి. ఈ ఇద్దరు సింహాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సన్నద్ధమవుతారు. కేఏ పాల్ తిట్లను కూడా నేను ఆశీస్సులు గానే భావిస్తున్నాను. రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. ఆ వలసలు నిలిచిపోవాలంటే, శ్రీమంతుడు సినిమాలో సైకిల్ వేసుకొని మహేష్ బాబు వచ్చినట్టుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి సంక్షేమం కోసం ఎవరైనా సైకిల్ వేసుకొని వస్తారా ? అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

హత్య కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ అసాధ్యం
హత్య కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ అన్నది అసాధ్యం. హత్య నేరం మోపబడిన నిందితుడి విచారణ అత్యంత అవసరమని దర్యాప్తు సంస్థ చెప్పినప్పుడు, ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇస్తుందని నేను అనుకోవడం లేదు. అదే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇంట్రిమ్ స్టే ఇవ్వడం ద్వారా, వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించారు.

బెయిల్ ఇవ్వడం అనేది న్యాయమూర్తి విచక్షణ అధికారమే అయినప్పటికీ, జూన్ 30వ తేదీలోగా కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కి ఈ కేసులో ప్రమేయం ఉన్నదని, రహస్య సాక్షి ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని చెప్పిన తర్వాత నిందితుడికి ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వకపోవచ్చు . ముందస్తు బెయిల్ తిరస్కరించిన వెంటనే అవినాష్ రెడ్డి ని అరెస్టు చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులకు సద్బుద్ధి ప్రసాదించాలి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకు భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలి. స్పీకర్ నోరు పారేసుకోకుండా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడే బుద్దిని ఇవ్వాలి . మార్గదర్శి సంస్థ కు చెందిన 794 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ఉన్మాద చర్య. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్ లను తాను ఉన్మాదులని అనడం లేదు.

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, ఒక్క ఫిర్యాదు కూడా లేనప్పటికీ మార్గదర్శి సంస్థపై దాడులు చేయడం దారుణం. ఈ కేసు న్యాయస్థానం ముందు నిలబడదు. చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులోనే కొట్టి వేయవచ్చు. అక్కడ ఏదైనా గజకర్ణ గోకర్ణ విద్యలతో మేనేజ్ చేసినా, హైకోర్టులో కొట్టివేయడం ఖాయమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE