– వినుకొండ హత్యలో కుట్ర కోణం?
– శాంతిభద్రతలపై సీఎం శ్వేతపత్రం విడుదల రోజే హత్య
– ఇదేరోజు పుంగనూరులో కార్లపై దాడితో హడావిడి
– పోలీసులకు సమాచారం లేకుండానే వచ్చిన మిథున్‌రెడ్డి
– లా ఆర్డరులో లేదని చెప్పేందుకే దాడుల కథలు?
– అసెంబ్లీ సమావేశాలకు ముందే హత్యలపై అనుమానాలు?
-రాష్ట్రంలో గురువారం జరిగిన అన్ని ఘటనలపైనా అనుమానాలే
– హంతకుడు, హతుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే
– సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్
– ఇప్పుడు జగన్ ఓదార్పు ఎవరికి?
– నేడు జగన్ వినుకొండ ఓదార్పు యాత్ర
– దానికోసం బెంగళూరు నుంచి విజయవాడకు
– ఇద్దరు వైసీపీ కార్యకర్తల ఘర్షణ
– ఇద్దరూ బొల్లాకు అనుచరులేనన్న ఆరోపణలు
– హతుడు-హంతకుడు వైసీపీ రౌడీషీటర్ అనుచరులే
– గతంలో ఇద్దరికీ పాత గొడవలు
– హత్యకు వైసీపీ రాజకీయరంగు
– టీడీపీపై నెట్టే ‘శవ’రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్‌రెడ్డి ఐదేళ్ల విధ్వంసపాలనలో కూలిపోయిన వ్యవస్థలు, లూటీ అయిన శాఖలు, ఆయా శాఖల్లో చేసిన అప్పుల వివరాలపై శ్వేతపత్రం ప్రకటించి..ఐదేళ్ల వికృత జగన్నాటకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్న, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దూకుడుకు బ్రేకులు వేసే యత్నం.. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ.. సరిగ్గా శాంతిభద్రతలపై శ్వేతపత్రం ప్రకటించే రోజునే రెండు ప్రాంతాల్లో రెండు ఘటనలు. అవి సహజమా? సృష్టించినవా? పల్నాడు జిల్లాలో హత్య. అన్నమయ్య జిల్లాలో దాడులు!
ఫలితంగా రాష్ర్టంలో శాంతిభద్రతలు లేవని సంకేతాలిచ్చే రాజకీయ కుట్ర. విచిత్రంగా రెండూ వైసీపీ నేతల కేంద్రంగా జరిగినవే. ఇది నిస్సందేహంగా కుట్ర కోణమన్నది పోలీసుల అనుమానం. సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై శ్వేతపత్రం ప్రకటించే రోజు.. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న సందర్భం. అందుకే ఒక హత్య, ఒక దాడి. అసలేం జరుగుతోంది?
11 స్థానాలకు పడిపోయిన వైసీపీ బలం పెంచుకోవాలంటే, మరో నాలుగేళ్ల పదినెలల సమయం ఉంది. ఆలోగా అల్లర్లకు ప్రాణం పోసి, ఆ వేడిలో రాజకీయ చలికాచుకోవాలన్న వైసీపీ కుట్రలు బూమెరాంగవుతున్నాయి. వినుకొండ హత్య దానికి నిలువెత్తు నిదర్శనం. ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య ఉన్న పాత కక్షల ఫలితంగా, అందులో ఒకరు హత్యకు గురయ్యారు. హత్య చేసిన మైనారిటీ నేత మాజీ ఎమ్మెల్యే, ఒక రౌడీషీటర్‌కు ప్రధాన అనుచరుడు.
హతుడు కూడా వైసీపీ కోసం జెండా ఎత్తిన వాడే. దానికి సంబంధించి వారిద్దరూ వైసీపీ కోసం పనిచేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ హుటాహుటిన బెంగళూరు నుంచి వినుకొండ ఓదార్పుయాత్రకు వస్తున్నారు. బాగుంది. మరి ఆయన ఇప్పుడు ఎవరిని ఓదారుస్తారు? చనిపోయిన సొంత పార్టీ కుటుంబసభ్యులనా? చంపిన సొంత పార్టీ కుటుంబసభ్యుడినా? అదీ ఇప్పుడు ఫ్యాను పార్టీలో ఉక్కపోని ఉత్కంఠ.
ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే అయినప్పడు, జగన్ ఎవరిని నిందిస్తారని వైసీపీ సీనియర్ల సందేహం. నిజంగా హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి, ఈ హత్యకు టీడీపీనే కారణమని ఆరోపిస్తే జగన్ ఇబ్బందిపడతారంటున్నారు. అప్పుడు వైసీపీలో చురుగ్గా పనిచేసిన జిలానీ ఫొటోలు టీడీపీ, మీడియాకు విడుదల చేస్తేజగనన్న పరువుపోతుందన్నది సీనియర్ నేతల ఆందోళన.
వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను, అదే పార్టీకి చెందిన జిలానీ అనే మరో కార్యకర్త.. పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో దారుణంగా తల-చేయి నరికేశాడు. ఆ ఘటనను ఎంచక్కా వీడియో తీస్తున్నా ఎవరూ హంతకుడి ప్రయతాన్ని అడ్డుకోలేదు. ఆ తర్వాత వైసీపీ అధికార మీడియాలో వైసీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త దారుణంగా చంపేశాడంటూ ఊపిరాడకుండా వార్తలు వదిలారు. వైకాపేయులు కూడా ఏపీలో లా ఆర్డరులో లేదంటూ టన్నులకొద్దీ కన్నీరు. మాజీ మంత్రి అంబటి అయితే మల్లికాగర్గ్ ఎస్పీగా ఉంటే అసలు ఈ హత్య జరిగేదే కాదని ప్రవచించారు. అంటే ఒకవేళ మల్లికాగర్గ్ ఎస్పీగా ఉంటే.. జిలానీ అనే హంతకుడు ఆమె వద్దకు వెళ్లి రషీద్ అనేవాడిని చంపాలా?వద్దా అని అడిగితే.. ఎస్పీగారు వద్దని చెబితే జిలానీ రషీదును చంపకుండా వదిలేస్తారన్నట్లుంది అంబటి భాష్యం. అయినా ఫలానా ఎస్పీ ఉంటే హత్యలు జరగడం, ఫలానా ఎస్పీ ఉంటే హత్యలు జరగకపోవడం ఉండవన్న సంగతి సీనియర్ నాయకుడయిన అంబటికి తెలియ పోవడమే ఆశ్చర్యం.
రషీద్ హత్య సంగతి తెలిసి బెంగళూరు ప్యాలెస్‌లో వెరైటీ డ్రస్సులేసుకుని కాలక్షేపం చేస్తున్న జగనన్న, హుటాహుటిని విజయవాడ వెళ్లారు. శుక్రవారం వినుకొండకు పరామర్శ కోసం బయలుదేరుతున్నారు. ఇదీ వినుకొండ కథ.
ఇక వాస్తవంలోకి వెళితే.. రషీద్ అనే మైనారిటీ వ్యక్తి. నిఖార్సయిన పదహారణాల వైసీపీ కార్యకర్త. గత ఎమ్మెల్యే విజయం కోసం శ్రమదానం చేసిన మైనారిటీ కార్యకర్త. ఇక రషీదును నిర్భయంగా చంపిన జిలానీ కూడా కరుడుగట్టి వైసీపీ కార్యకర్తనే. ఇద్దరూ రౌడీ షీటర్ ఖాన్‌కు అనుచరులేనన్నది వినుకొండవాసులకెరుకే. కాకపోతే హంతకుడికి ఖాన్ కాస్తంత ఎక్కువ ఖాసు మనిషి.
అంటే చంపినవాడు, చనిపోయినవాడూ వైసీపీ కార్యకర్తలేనని మెడమీద తల ఉన్న అందరికీ అర్ధమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున హతుడు రషీద్… నరసరావుపేట నుంచి వచ్చిన ఒక కేసు సెటిల్‌మెంట్ కేసులో జోక్యం చేసుకున్న జిలానీపై, బీరుబాటిల్‌తో దాడి చేశారని, అప్పటినుంచి ఇద్దరిమధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
దానిని మనసులో ఉంచుకున్న హంతకుడు జిలానీ ఏడాది తర్వాత, సరిగ్గా ఇదేరోజు రషీదును చంపేశారన్నది అక్కడి వారి కథనం. అటు జిల్లా ఎస్పీ కూడా ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే హత్యకు కారణమని, అందులో రాజకీయకోణం లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం వినుకొండకు వెళ్లనున్న జగన్‌కు విచిత్రమైన సమస్య వచ్చిపడింది. ఆయన… ముందు హతుడైన తన పార్టీ కార్యకర్త రషీద్ ఇంటికి వెళతారా? లేక తన పార్టీకే చెందిన హంతకుడు జిలానీ ఇంటికి వెళతారా? ఎందుకంటే ఇద్దరూ తన పార్టీ ముద్దుల కార్యకర్తలే. ఒకరి ఇంటికి వెళ్లి మరొకరి ఇంటికి వెళ్లకపోతే, అటు బ్రహ్మనాయుడికి పరేషానీ. పైగా హంతకుడు బ్రహ్మనాయుడు ముద్దుల అనుచరుడు ఖాన్‌కు, శిష్యుడైన జిలానీనాయె.
జగన్.. హతుడి ఇంటికి వెళ్లి పరామర్శిస్తే, ఖాన్‌కు-ఆయన అనుచరుడైన హంతకుడికి పితలాటం. దానితో జగనన్న.. ఇప్పుడు హతుడి ఇంటికి వెళతారా? లేక హంతకుడి ఇంటికి వెళతారా? లేక మధ్యేమార్గంగా బ్రహ్మనాయుడు గెస్టుహౌస్‌లో కూర్చుని, ఇద్దరినీ ఒకేసారి ఓదారుస్తారా?.. చూడాలి.
ఇక హతుడు-హంతకుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనంటూ సోషల్‌మీడియా ఫొటోలు, వీడియోలతో కోడైకూస్తోంది. దానితో
అప్పటివరకూ టీడీపీ కార్యకర్త చంపారంటూ, గాయగత్తర చేసిన వైసీపీ సోషల్‌మీడియా నుంచి జవాబు లేదు. వారి మౌనంతో సహజంగా ఇది టీడీపీపై చల్లే బురద రాజకీయమని ప్రజలకు అర్ధమయిపోయింది. ఫలితంగా ఒక కార్యకర్త మరో కార్యకర్తను చంపితే, దానికి టీడీపీతో సంబంధం ఏమిటన్న చర్చకు తెరలేచింది.
అయితే ఇందులో కుట్రకోణం ఉందన్నది మరో అనుమానం. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు, అదేరోజు శ్వేతపత్రం సమర్పించేరోజు. కాబట్టి అదేరోజు జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని, బాబు పాలనలో శాంతిభద్రతలు లేవని, సీఎం శ్వేతపత్రం విడుద ల చేసే రోజునే హత్య జరిగిందని, పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించేందుకు.. ఉదంతాలతో కూడిన రంగస్థలం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది.
పుంగనూరులో ఎంపి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే పర్యటించడం, ఆయన కార్లపై దాడి జరగడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి బాధితులు మిథున్‌ను కలిసేందుకు ప్రయత్నించిన సందర్భానికి, వైసీపీ రాజకీయరంగు అద్దినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
దీన్నిబట్టి.. వినుకొండ హంతకుడితోపాటు, ఆయన గురువైన రౌడీ షీటర్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుంటేగానీ, అసలు కథ బయటకు రాదు. అంటే.. ఇది ఇద్దరే కలసి చేశారా? లేక వారి వెనుక మరెవరైనా ఉన్నారా? వారికి గత వారంరోజుల్లో వచ్చిన ఫోన్లు ఎవరివి? అన్న కోణంలో విచారిస్తే తప్ప, నిజాలు బయటకు రావు.
త ఎన్నికలకు ముందు పులివెందులలో బాబాయ్ వివేకాను, సొంత వారే చంపారని సీబీఐ తేల్చేసింది. అయితే బాబాయ్ హత్యకు టీడీపీనే కారణమంటూ, సొంత మీడియాలో అల్లిన ‘నారాసురరక్తచరిత్ర’ అనే రంగుల సానుభూతి కథతో, ఓట్లు కొల్లగొట్టిన గతానుభవాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అదీ చంద్రబాబు శ్వేతపత్రం ప్రకటించేరోజునే, రెండు ప్రధాన ఘటనలు ఎందుకు జరిగాయో, సులభంగా అర్ధమవుతుందన్నది సీనియర్ ఐపిఎస్ అధికారుల ఉవాచ. అంటే ఆ ప్రకారంగా.. అసలు గురువారం రాష్ట్రంలో జరిగిన పలు హత్యలు, దాడులు, దొంగతనాల వెనక సైతం ఎవరో ఉన్నారన్న అనుమానం సహజం. ఈ కోణంలో ఖాకీబుర్రలకు పదునుపెడితే కలుగులోని అదృశ్యశక్తులు బయటకువస్తారు కదా? పోలీసులూ.. మీకు అర్ధమవుతోందా?