– చెత్త పన్ను రద్దుపై మంత్రి సవిత హర్షం
అమరావతి: చెత్త పన్ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల్లో చెత్త పన్ను ఒకటన్నారు. పేదల నుంచి కూడా చెత్త పనులు వసూలు చేసిన వ్యక్తి జగన్ అని మంత్రి మండిపడ్డారు. దేశం యావత్తూ అవాక్కయ్యేలా చెత్త పన్ను నిర్ణయం తీసుకున్న జగన్… అన్ని రకాల పన్నులు, ఛార్జీలు పెంచి గడిచిన అయిదేళ్లు ప్రజలను పీల్చిపిప్పి చేశారన్నారు. ఆదాయం సృష్టించుకోవడం చేతగాని జగన్ … పన్నులు, చార్జీల పెంపుతో కాలం నెట్టుకొచ్చారన్నారు.
చెత్త పన్ను చెల్లించలేమని ప్రజలు తిరగబడితే… అధికారులతో బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. చివరికి పెన్షన్ల చెల్లింపులో కూడా చెత్త పన్ను మినహాయించుకుని లబ్ధిదారులకు నగదు ఇచ్చేవారన్నారు. ఇదే విషయం గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు… ఎన్నికల ముందు చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, గాంధీ జయంతి సందర్భంగా చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేయడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. చెత్త పన్ను రద్దుతో ప్రజలపై ముఖ్యంగా పేదలపై భారం తప్పుతుందని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు.