– అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
– ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా
– పదవీ కాలంలో చాలా నేర్చుకున్నా
– పార్లమెంటు సభ్యుల నుంచి లభించిన ఆప్యాయత, నమ్మకం ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటా
– రాజీనామా లేఖలో జగ్దీప్ ధన్ఖడ్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా చే శా రు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుంది.
జగదీప్ ధన్ఖడ్ 2022 ఆగస్టు 11 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్గా సేవలు అందించారు. అంతకుముందు ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు.
కాగా తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ధన్ఖడ్ లేఖలో పేర్కొన్నారు. తన పదవీ కాలంలో చాలా నేర్చుకున్నానని, పార్లమెంటు సభ్యుల నుంచి తనకు లభించిన ఆప్యాయత, నమ్మకం మరియు ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ధన్ఖడ్ అన్నారు.
తన పదవీ కాలంలో భారతదేశ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని చూసినందుకు ధన్ఖడ్ గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. “భారత్ ప్రపంచ ఖ్యాతి, అద్భుతమైన విజయాలతో నేను గర్వపడుతున్నాను. దేశం ఉజ్వల భవిష్యత్తుపై నాకు గట్టి నమ్మకం ఉంది” అని ఆయన తన లేఖలో తెలిపారు.
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో ధన్ఖడ్ తన రాజీనామా నిర్ణయం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.