– జలగం వెంగళరావుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాళి
– రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి జలగం
-విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి బాటలు
-తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన జలగం
– తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించిన ఘనత జలగంకే దక్కుతుంది
– ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు ప్రత్యేక ముద్ర
స్వర్గీయ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు జీవితం నేటి తరానికి ఆదర్శ ప్రాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. సర్దార్ జలగం వెంగళరావు శతజయంతి సందర్భంగా బుధవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా,పార్లమెంటు సభ్యుడిగా, జడ్పీ చైర్మన్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడిగా పదవులను అధిరోహించి ఆ పదవులకు వన్నె తెచ్చిన మహానేత అని కొనియాడారు.
జై ఆంధ్ర ఉద్యమం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జలగం వెంగళరావు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఆయనకే దక్కింది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాకతీయ, నాగార్జున, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయాల స్థాపన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే జరిగిందన్నారు. 1975 సంవత్సరంలో తొలి తెలుగు ప్రపంచ మహాసభలను నిర్వహించిన ఘనత కూడా జలగం వెంగళరావు కే దక్కిందన్నారు.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకునేందుకు తగిన చేయూతను అందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు పాత్ర మరువలేనిదన్నారు. భద్రాచలం పేపర్ బోర్డ్, స్పాంజ్ ఐరన్, , ఏపీ స్టిల్స్, నవభారత్, పెరోఎల్లోఈస్, కేటీపీఎస్ కెపాసిటీ పెంపు, హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణాల పనులు జలగం హయాంలోనే జరిగాయన్నారు. సింగరేణి గనుల అభివృద్ధి, కిన్నెరసాని ప్రాజెక్టు ఏర్పాటు, నాగార్జునసాగర్ కాలువ నిర్మాణాలు అభివృద్ధిలో మర్చిపోలేని మైలురాయిగా జలగం నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా పారిశ్రామిక అభివృద్ధితో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న అటవీ ప్రాంతం రూపురేఖలు మారిపోయి వేలాది మంది ప్రజలు ఉపాధి పొందడానికి జలగం తీసుకొచ్చిన పరిశ్రమల స్థాపనే కారణమన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విమోచన ఉద్యమంలో పాల్గొని జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించి జైలు జీవితం గడిపారని అన్నారు. నిజాం పాలనకు ఎదురుతిరిగి నందుకు ఆయనపై పలు మార్లు రజాకార్ల దాడులు జరిగినప్పటికీ వెన్ను చూపకుండా పోరాటం చేసిన ధీశాలి అని వివరించారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ నాయకుడిగా, పరిపాలనలో మచ్చలేని మహానాయకుడు గా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు జీవితం ఇప్పటికీ ఎప్పటికీ వచ్చే తరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.