Suryaa.co.in

Political News

లోకసత్తా-2 గా జనసేనను మార్చాలి!

జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తో బీజేపీ ఈక్వేషన్ భలే గమ్మత్తుగా సాగుతున్నట్టుగా కనపడుతున్నది . జనసేన కు , తెలంగాణ బీజేపీకి చుట్టపు చూపులు కూడా లేవు. ఈ రెండింటి మధ్య మాటా – మంతీ కూడా లేవు . తెలంగాణ లోఅధికారం లోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నప్పటికీ ; తెలంగాణ లో – ముఖ్యంగా పాతిక అసెంబ్లీ స్థానాలు , అయిదు ఎం పీ స్థానాలు గల హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో చెప్పుకోదగిన ఫ్యాన్ ఫాలోయింగ్ గలిగిన పవన్ కళ్యాణ్ ను టీ . బీజేపీ పట్టించుకోవడం లేదు . కన్నెత్తి కూడా పవన్ కళ్యాణ్ వైపు చూడడం లేదు . బీజేపీ మా మిత్ర పక్షం అని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు .

అధికారం అనేదానిపై ఆశ , అవకాశం లేని ఆంధ్ర లో మాత్రం – బీజేపీ… పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షాలు . అయినా, ఈ రెండు పార్టీలు కలుసుకున్నట్టు , మాట్లాడుకున్నట్టు , జాయింట్ గా ఒక రాజకీయ కార్యక్రమం చేపట్టినట్టు కనపడవు . బీజేపీ ఆఫీస్ మీద వాలిన కాకి జనసేన ఆఫీస్ మీద వాలగా ఎవరూ చూడలేదు. ఇద్దరం అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని బీజేపీ ఆంధ్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడప్పుడూ కితకితలు పెడుతుంటారు . అది విన్న జనమేమో నవ్వలేక మెలికలు తిరిగి పడిపోతుంటారు.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు . రాజకీయ పనిమీదే వచ్చారు . కానీ , హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కళ్యాణ్ ను కలవమని కబురు పెట్టలేదు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తావనే కనపడలేదు. పై పెచ్చు , బీజేపీతో అంటూ సొంటూ లేని జూనియర్ ఎన్ టీ ఆర్ ను రాత్రి భోజనానికి అమిత్ షా ఆహ్వానించారు. బంధుత్వ పరంగా , ఎన్ టీ ఆర్ – చంద్రబాబుకు అల్లుడు వరస. భార్యకు కూడా దగ్గరి బంధువు. బీజేపీ సభ్యుడు కాదు . అసలు బీజేపీ తో ఏ రకమైన ‘ కనెక్షనూ’ లేని వాడు . తెలంగాణ లో కంటే , ఆంధ్ర లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవాడు. అయినప్పటికీ, ఎన్ టీ ఆర్ ను పట్టించుకున్న అమిత్ షా, బీజేపీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదు .

నిజానికి -పవన్ కళ్యాణ్ ను ఒక ప్రభావశీలమైన ప్రాక్టికల్ రాజకీయ నాయకుడిగా బీజేపీ గుర్తించడం లేదు అనడానికి ఇవన్నీ సంకేతాలుగా భావించవచ్చు. ఉదాహరణకు , ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష వంతున ఆర్ధిక సాయం చేయడానికి తిరుపతి లో ఏర్పాటైన సభలో ఆయన రాజకీయ నీతుల ప్రసంగం చేశారు. దాని సారాంశం ఆయన అభిమానుల కైనా అర్ధం అయిందో లేదో తెలియదు .
దేశానికి మూడో ప్రత్యామ్నాయం కావాలి అన్నారు . ఏపీ కీ కావాలి అన్నారు . డిష్ట్రక్టివ్ పాలిటిక్స్ చెయ్యను అన్నారు . అందుకే , మునుగోడు లో పోటీ పెట్టలేదు అన్నారు. ప్రజారాజ్యం ఉంటే , ఇప్పుడు మూడో ప్రత్యామ్న్యాయం అయి ఉండేదన్నారు . వైసీపీ వాళ్ళు దానిని అంతం చేశారని అన్నారు . చనిపోయేవరకు బంగారు ఏ పీ కోసం కృషి చేస్తూనే ఉంటాను అన్నారు . పదవుల మీద ఆశ లేదు అన్నారు . రాయల సీమలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నారు . సాక్షుత్తు తన కుటుంబ సభ్యుడినే అవమానిస్తారా అన్నారు .
ఈ ప్రకటనల్లో 2024 ఎన్నికలకు పనికి వచ్చే మాటలు ఏమీ కనపడలేదు.
ఒక మంచి సోషల్ ప్రెషర్ గ్రూప్ లాగా – లోకసత్తా -2 లాగా నీతులు , హితోపవచనాలకు జనసేనను పవన్ కళ్యాణ్ తీర్చి దిద్దితే , తెలుగు రాష్ట్రాలకు మంచి సేవ చేసిన వారు అవుతారు.

– బీవీ రాయుడు

LEAVE A RESPONSE