జగన్‌తో ఆ ముగ్గురు కలసి కుట్ర చేశారు
తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దు
వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా.?
పెన్షన్ దారుల మరణాలకు జగన్ బాధ్యత వహించి సీఎంగా తప్పుకోవాలి
రాజకీయ స్వార్థంతో జగన్ కుట్రలు చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు
శవాలతో నీచ రాజకీయాలు చేయడం జగన్ నైజం
అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్…పెంచబోయే పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ మాసాలకూ వర్తింపు
ప్రతి ఇంటికీ పెద్ద కొడుకునవుతా….నేరుగా ఇంటికే పెన్షన్ అందిస్తా
నాది సమాజ హితం….జగన్ ది స్వార్థం
-మీడియా సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
నల్లజర్ల :- రాజకీయ కుట్రతో పెన్షన్ దారుల మరణాలకు కారకుడైన జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి తక్షణమే వైదొలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలతో ప్రజల ప్రాణాలు తీస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్లలో శుక్రవారం చంద్రబాబు విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘‘రాజకీయాల్లో చేసే మంచి పనులతో ఓట్లు అడగాలి…కానీ తప్పుడు ప్రచారాన్ని చేసి లబ్ధిపొందడం సరికాదు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయాలు ఉన్నాయి. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. గత ఎన్నికల్లో బాబాయిని చంపి నెపం మాపై నెట్టి సానుభూతితో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వృద్ధులను చంపేసి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ దురుద్ధేశంలో అధికారుల పాత్ర కూడా ఉంది.
1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ ఎందుకివ్వలేదు. ఓడిపోతామన్న భయంతోనే అప్పు తెచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టారు. మార్చితో బడ్జెట్ ముగుస్తుంది…దీంతో ముందే నిధులు ఖాతా నుండి తీసుకోవాలి. దీన్ని ముందే గమనించి డబ్బులు డ్రా చేసి పెన్షన్లు అందిస్తే ఇబ్బందులు ఉండవు. స్వార్థ రాజీకీయాల కోసం ఖజానా ఖాళీ చేసి 1వ తేదీన ఇవ్వలేదు. ఏప్రిల్ 3వ తేదీన ఇస్తామని మార్చి 27న సర్క్యులర్ ఇచ్చారు. వాలంటీర్లను పెన్సన్ పంపిణీలో జోక్యం చేసుకోకూడదని మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగులు తప్ప వాలంటీర్లు మాత్రమే పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ చెప్పలేదు. మార్చి 30వ తేదీన ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తూ…పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ఇచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పన్నాగం చేశారు. ఇన్నాళ్లూ మీటింగ్ లకు రాకపోతే పథకాలు తొలగిస్తూ…బెదిరించారు. రాజీనామా చేసిన వాలంటీర్ల నియామకాలపైనే తన తొలిసంతకం అని జగన్ సిగ్గులేకుండా చెప్పాడు.
వాలంటీర్లు తటస్థంగా ఉండాలని మేము మొదటి నుండి కోరుతున్నాం. వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు…మేము వచ్చిన తర్వాత కూడా వ్యవస్థను కొనసాగిస్తాం. మంచి చదువున్న వారికి కెరీర్ బిల్డ్ చేస్తాం. మళ్లీ ఈ ప్రభుత్వం రావడం లేదు…రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు రావు. మీ రాజకీయం కోసం వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా.? నా హయాంలో పంచాయతీ, రెవెన్యూ అధికారులతో పెన్షన్లు పంపిణీ చేశాను.
నేడు రాష్ట్రంలో 1.35 వేల మంది వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ఉన్నారు. వారితో పెన్షన్లు అందిస్తే ఒక్క రోజులోనే ఇవ్వొచ్చు. నేను ఇటీవల సీఎస్, ఈసీతో కూడా మాట్లాడాను…పంపణీ చేసే వ్యవస్థ ఉంది…ఈ ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెట్టేందుకు చూస్తోందిని చెప్పా. ఇంటింటికీ వెళ్లి పెన్సన్ అందిస్తామని చెప్పారు…మరి ఎందుకు చేయలేదు.? 1వ తేదీన ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా…లేవు. 3వ తేదీ సాయంత్రం డబ్బులు విడుదల చేశారు. రెండు రోజుల పాటు రమ్మనడం..వెళ్లమనడం చేశారు. మంచాలు, వీల్ చైర్లో తీసుకురావడం రాజకీయ విన్యాసం కాక మరేమిటి.? అని ప్రశ్నించారు.
పెన్షన్లపై పేటెంట్ హక్కు టీడీపీదే
ఎన్టీఆర్ రూ.30లతో పెన్షన్ విధానాన్ని తెచ్చారు. తర్వాత నేను రూ.75 చేశా…2004లో రాజశేఖర్ రెడ్డి వచ్చి రూ.200 చేశారు. 2014లో నేను మళ్లీ వచ్చాక రూ.1000 ఒకేసారి పెంచాను. ఖర్చలు పెరిగాయని ఆలోచించి రూ.2 వేలు చేశాను. నువ్వు వచ్చాక ఇచ్చింది ఎంత ఐదేళ్లలో వెయ్యి పెంచావు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పి ఆదుకున్నా. ఒక నెలలో తీసుకోకపోయినా మరో నెలలో తీసుకునే వెసులుబుటా కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడున్నా పెన్షన్ తీసుకునే విధానాన్ని తీసుకొచ్చా.
కానీ జగన్ నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించారు. దీనిపైనా ఈసీ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కోడ్ వచ్చాక ప్రభుత్వ అధికారాలు పరిమితిలో ఉంటాయి. వాలంటీర్లు లేకపోతే పంచాయతీ, సచివాలయ అధికారులు ఏమయ్యారు.? ఒక్కొక్కరు 50 ఇళ్లకు ఇవ్వొచ్చు…ఎందుకు ఇవ్వలేదు.? సైకో సీఎం ఇవ్వొద్దని అడ్డపెడితే అధికార యంత్రాంగం చేస్తుందా.? జగన్ తో సీఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డి, సెర్ప్ సీఈవో మురళీధరెడ్డి కలిసి ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు తీశారు.
సీఈసీ దీనిపై విచారణ చేయాలి. నేను మెగా డీఎస్సీపై తొలిసంతకం పెడతానని చెప్పా…జగన్ వాలంటీర్ల నియామకాలపె సంతకం పెడతా అన్నాడు. నాది సమాజ హితం..జగన్ ది స్వార్థం. దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టి దాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం అత్యంత నీచం. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వమే కుట్రలు చేసి ప్రజల ప్రాణాలు తీసి ప్రతిపక్షాలపై నెట్టి నీచరాజకీయం చేస్తోంది. వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమం ఇచ్చి పేరు తెచ్చుకుంటుంది. ప్రజల ప్రాణాలు, ఆస్తలుకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెట్టడం బాధాకరం’ అని అన్నారు.
పెంచబోయే పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ మాసాలకూ వర్తింపు
మేము పెంచబోయే పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కూడా వర్తిస్తుంది…మూడు నెలలకు పెంచిన పెన్షన్ రూ.3 వేలను రూ.4 వేలతో కలిపి ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి పథకం ఇవ్వడం నా బాధ్యత. జగన్ మాయల ఫకీరు కంటే దారుణం. ఎప్పుడు వచ్చి ఎవరి నెత్తిన చేయిపెట్టి, ఎవర్ని శవం చేస్తాడో తెలీదు. పెన్షన్లపై పేటెంట్ హక్కు టీడీపీదే. అధికారంలోకి రాగానే అర్హులకు రూ.4వేల పెన్షన్ ఇవ్వబోతునున్నాం.
డప్పు కళాకారులకు పెన్షన్ తొలగించారు. తటస్థులకు తొలగించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా ఇంటికొచ్చి పెన్షన్ అందిస్తా. ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజలకు వివరిస్తాం. సైకోలు తాత్కాలికంగా ఆనందపడతారు…కానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. బకాసురుడు, రావణాసురుడు, దుర్యోదణుడు, ఎంతో మంది రాక్షసులను చూశాం..వాళ్లు కూడా చివరకు శిక్ష అనుభవించారు. జగన్ ఒక దుర్మార్గుడు. స్వార్థం కోసం ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాగాన్ని ఉపయోగించుకున్నారు. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే…తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దు.’’ అని చంద్రబాబు సూచించారు.