Suryaa.co.in

Political News

జయహో జగన్‌!

యెస్‌. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి నిజంగా జై కొట్టాల్సిందే. ఎందుకంటే ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌. నిజాలను నిర్భయంగా చెప్పేస్తారు.. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతారు. చేయగలిగింది చేస్తామని చెబుతారు.. చేయలేకపోతే.. చేయలేనని చెప్పేస్తారు. ఇదీ జగన్‌ నైజం.

నాడు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని ఖరాఖండీగా చెప్పేసినా.. నేడు పోలవరంతో నాకేం సంబంధం లేదని తెగేసి చెప్పేసినా.. అది జగన్‌ లాంటి రాజకీయ నేతకే చెల్లింది. పోలవరం ప్రాజెక్టుకు.. నాకు సంబంధం లేదని సీఎం జగన్‌ ఇప్పుడేదో చెప్పినంత మాత్రాన.. ఇదేదో సంచలన కామెంట్‌ అని.. అలా ఎలా చెప్పేస్తారని తెగ గుంజేసుకుంటున్నారు ఆయనంటే గిట్టని వారు.

కానీ.. జగన్‌ వైఖరిని మొదటి నుంచి గమనించిన వాళ్లకు ఇదేం ఆశ్చర్యంగా ఉండదు. ఇదేదో నోటి మాటగా చెప్పడం లేదు. జగన్‌ వైఖరి ఇది అని చెప్పడానికి పక్కా ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. కొంచెం ఫ్లాష్‌ బ్యాక్‌కు వెళ్లండి.. 2014 ఎన్నికలకు ముందు తాను రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేనని ఖరాఖండీగా చెప్పేశారు. ఇలా ఎవరైనా చెప్పగలరా..? అంటే గతంలో ఉచిత విద్యుత్‌ ఇవ్వలేనని చంద్రబాబు చెప్పారనుకోండి.. అది వేరే విషయం.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఉచిత విద్యుత్‌ కొనసాగించారు.. రైతు రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయలేనని చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ప్రెస్‌ ది బటన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారనుకోండి. ఇది వేరే విషయం.

మనలో మన మాట ఈ బటన్ నొక్కే విధానాన్ని 2009 ఎన్నికల్లోనే టీడీపీ ప్రస్తావించింది. దీన్ని లోకేష్ అప్పట్లో రూపకల్పన చేశారు.. ఆ సమయంలో జగన్ సూపర్ బిజినెస్ మ్యానుగా ఎదిగి.. దాన్ని మరింత పటిష్టపర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడా టాపిక్‌ ఎందుకులెండీ వదిలేద్దాం. ఇక టాపిక్కులోకి వస్తే.. గత ఎన్నికల్లో కాపు రిజర్వేషన్లను ఇవ్వలేనని జగన్‌ చెప్పేశారు.. జగన్‌ చెప్పేశారు కదా.. ఇంకా దాని గురించి ఆయన్ను అడిగేదేం ఉందని కాపు రిజర్వేషన్ల విషయంలో సైలెంట్‌ అయిపోయారు పోరాట యోధులు.

చంద్రబాబు ఇస్తానని చెప్పారు కాబట్టి.. అడిగాం.. ఇవ్వనని చెప్పిన వారినేం అడుగుతాం అంటారు ఇంకొందరు కుల పెద్దలు. ఇదీ వేరే విషయం అనుకోండి. ఇక సీపీఎస్‌ విధానాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక.. మేమేదో అనుకున్నాం.. దాన్ని రద్దు చేయలేం.. ఆ స్థానంలో కొత్త విధానాన్ని తెస్తాం అన్నారు.

అప్పుడేదో అనుకున్నాం.. ఇప్పుడు అది సాధ్యపడదు.. చేయలేం అని చెప్పడానికి ఎంతటి గుండె ధైర్యం కావాలి..? ఇది జగన్‌ వల్లే సాధ్యం. అందుకే జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌. ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి తెస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో ఎవరి అవసరం లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. దీంతో ప్రత్యేక హోదా విషయంలో తన అసక్తతను కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేశారు సీఎం జగన్‌మోహన్ రెడ్డి.

కేంద్రానికి సంపూర్ణ మెజార్టీ రాదని అనుకున్నాం.. సంకీర్ణం వస్తే ప్రత్యేక హోదా సాధిద్దాం అనుకున్నాం.. కానీ అలా కాలేదే.. దేవుడు దయ తలవలేదే.. వచ్చే ఎన్నికల్లో (2024) దేవుడు కచ్చితంగా దయ తలుస్తాడు.. కేంద్రంలో సంకీర్ణం వస్తుంది.. అప్పుడు కేంద్రం మెడలు వంచుదాం అన్నారు. జగన్ సార్‌ చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో దేవుడి దయ తలచాలి.. కేంద్రంలో సంకీర్ణం రావాలి.. కేంద్రం మెడలు వంచాలి.. ప్రత్యేక హోదా రావాలని కోరుకుందాం.. ప్రార్ధిద్దాం. దేవుడి దయ.. మన చల్లని దీవెనలు ఉంటే ఎందుకు సాధ్యం కాదు. కచ్చితంగా అయి తీరుతుంది.

ఇక ఇప్పుడు పోలవరం వంతు. అవును గతంలో పోలవరం విషయంలో రకరకాలుగా మాట్లాడాం.. వివిధ రకాలుగా చెప్పాం. అప్పుడు ఏదో అయిపోతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఏం చేస్తాం చెప్పండి. రాజీపడదాం.. కేంద్రం వైపు చూద్దాం.. ఇంతకు మించి ఏమైనా చేయగలమా..? అని జగన్‌ స్పష్టంగా కడుపులో ఏదీ దాచుకోకుండా చెప్పేశారు. ఇలా ఓ కీలక ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చెప్పగలరా..? కానీ జగన్‌ చెప్పేశారు. అందుకే జయహో జగన్‌..! ప్రాజెక్టు మనం కట్టడం లేదన్నప్పుడు.. సంబంధం లేదన్నప్పుడు.. కాంట్రాక్టరును ఎందుకు మార్చారు..?

సర్వం పోగొట్టుకున్న నిర్వాసితులు ఇంకా ఏం రాజీపడాలి..? ఢయాఫ్రం వాల్‌ దెబ్బతినేలా చేసి.. ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తెచ్చి.. ఇప్పుడు నాకేం సంబంధం లేదు.. తూచ్‌ అని ఎలా అనగలరు..? అని ప్రతిపక్షాలు ఏదేదో అడుగుతున్నాయనుకోండి అది వేరే విషయం. కానీ నిర్వాసితులు కానీ.. బాధితులు కానీ.. సీఎం జగన్‌ను అడిగారా..? లేదే.. అడగలేదే.

చూశారా..? బాధితులు ఎందుకు అడగలేదో తెలుసా..? ఎందుకంటే జగనన్నపై వారికున్న నమ్మకం. తమ బతుకులను ఇవాళ కాకున్నా.. పదేళ్లో.. 15 ఏళ్ల తర్వాతైనా జగన్ బాగుపరుస్తాడనే నమ్మకం వాళ్లది. ఇలా ట్రెండ్‌ సెట్టర్‌గా మారి తనకున్న క్రెడిబులిటిని జగన్ నిలబెట్టుకున్నారనే చెప్పాలి. అందుకే ద గ్రేట్‌ క్రెడిబులిటీ మాస్టర్‌ ఒన్‌ అండ్ ఒన్లీ జగన్‌.

– కుమార్
(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)

LEAVE A RESPONSE