-ఐఐఐటి డిఎం సంచాలకులు అచార్య సోమయాజులు
-కర్నూలు ఐఐఐటి డిఎం, నార్వే అగ్ధర్ విశ్వ విద్యాలయం మధ్య అంతర్జాతీయ ఒప్పందం
-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్-ఆటోమేషన్ లో రెండు సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ
పరస్పరం ఉమ్మడి పరిశోధన, విద్యార్ధులకు రెండు సంవత్సరాల అంతర్జాతీయ విద్యతో కూడిన మాస్టర్స్ డిగ్రీ అందించటం ధ్యేయంగా నార్వే అగ్ధర్ విశ్వవిద్యాలయంతో తమ సంస్ధ ఒప్పందం చేసుకుందని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ – కర్నూలు) సంచాలకులు అచార్య సోమయాజులు తెలిపారు.
దీర్ఘకాలిక వాణిజ్యేతర ప్రాతిపదికన జ్ఞానాన్ని వ్యాప్తి చూస్తూ, పరిశోధన, అభివృద్ధి, విద్య, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం వంటివి ఈ ఒప్పందంలో ముఖ్య ఉద్దేశాలన్నారు. సోమవారం కర్నూలులోని ఐఐఐటి డిఎం ఆవరణలోని సంచాలకుల నూతన ఛాంబర్ లో నార్వే అగ్ధర్ విశ్వవిద్యాలయంతో ఈ మేరకు అవగాహనా ఒప్పందం జరిగింది.
ఒప్పంద పత్రాలను మార్చుకున్న అనంతరం అచార్య సోమయాజులు మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాలలో పరస్పర ఆసక్తులను గుర్తించి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో ఉన్నత విద్యా సంస్థల పాత్ర యొక్క ప్రాముఖ్యతను పెంపొందించటం వంటివి ఈ ఒప్పంద కార్యక్రమంలో కీలకంగా ఉన్నాయన్నారు.
ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, మ్యాన్యుఫాక్చరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాలలో ఇకపై ఈ రెండు సంస్ధలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. కర్నూలు ఐఐఐటి డిఎంలో చదివే విద్యార్దులకు ఎక్రైజ్ కార్యక్రమంలో భాగంగా నార్వేలో చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఎంటెక్ రెండు సంవత్సరాలలో ఏదేని ఒక సంవత్సరం నార్వేలో మరో సంవత్సరం కర్నూలు ఐఐఐటి డిఎం విద్యాభ్యాసం చేస్తారన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్, రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగాలలో 2023-2024 విద్యాసంవత్సరానికి గానూఎంటెక్ కోర్సును ప్రారంభిస్తున్నామని అచార్య సోమయాజులు తెలిపారు. అగ్ధర్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ జోరున్ మోనా స్కోఫ్టెలాండ్ గిస్లెఫాస్ మాట్లాడుతూ ఒప్పందం ఫలితంగా కేవలం విద్యార్ధులే కాక, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పరస్పర మార్పిడి సాధ్యమవుతుందన్నారు. విద్యాసంబంధ ప్రచురణలు, నివేదికల పరస్పర మార్పిడి, ఉమ్మడి సింపోజియంలు, సదస్సులు, ఉపన్యాసాలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఐఐఐటి డిఎం రిజిస్ట్రార్ క్యాతారి గురుమూర్తి మాట్లాడుతూ ఈ అవగాహన వల్ల మన విద్యార్ధులు ఎటువంటి అదనపు ఆర్ధిక భారం లేకుండా నార్వే విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ట్రాన్స్ స్క్రిప్ట్స్ పొందగలుగుతారన్నారు. విద్యార్దుల మార్పిడి కార్యక్రమంలో అక్కడ చదివే కాలానికి పూర్తిగా ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుందని, కేవలం వసతి, ఆహారం కోసం మాత్రమే విద్యార్ధులు వ్యయం చేయవలసి ఉంటుందన్నారు. నార్వే విశ్వవిద్యాలయంతో ప్రస్తుతం ఐదు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నామని గురుమూర్తి తెలిపారు.
కార్యక్రమంలో నార్వే విశ్వవిద్యాలయం ఐసిటి విభాగ అధిపతి మైఖేల్ రైగార్డ్ హన్సేన్, ఇంజనీరింగ్, సైన్సు విభాగపు అధిపతి పాల్ రాగ్నర్ స్వెన్నెవిగ్ హెడ్, విశ్వవిద్యాలయ అంతర్జాతీయ సమన్వయకర్త పాల్ గ్రాండల్, విద్యాసంబంధ సీనియర్ సలహాదారులు గీర్ ఓవింద్ క్లోక్స్టాడ్, న్యూఢిల్లీలోని రాయల్ నార్వేజియన్ ఎంబసీ కౌన్సెలర్ ఎలిసబెత్ స్ట్రాండ్ విగ్టెల్, ఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ సి కృష్ణ మోహన్, నార్వే అగ్ధర్ విశ్వవిద్యాలయం నుండి అచార్య లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐఐఐటి సంచాలకుల వారి నూతన ఛాంబర్ ను కార్యాలయాన్ని అగ్ధర్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ జోరున్ మోనా స్కోఫ్టెలాండ్ గిస్లెఫాస్ ప్రారంభించారు. విద్యాసంస్ధ ఆవరణలో నార్వే ప్రతినిధులు మొక్కలు నాటారు. విద్యార్ధులకు అందిస్తున్న సౌకర్యాలు, కోర్సుల గురించి సంస్ధ సంచాలకులు అచార్య సోమయాజులు, రిజిస్ట్రార్ గురుమూర్తి నార్వే బృందానికి వివరించారు.