Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయాల్లో నైతిక విలువలు, నిబద్దత కల్గిన వ్యక్తి జె.ఆర్ పుష్పరాజ్

– జె.ఆర్ పుష్పరాజ్ మృతి పార్టీకి, దళిత జాతికి తీరని లోటు

రాజకీయాల్లో నైతిక విలువలు, నిజాయితీ నిబద్దత కల్గిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, జె.ఆర్ పుష్పరాజ్ మృతి పార్టీకి, దళిత జాతికి తీరని లోటని టీడీపీ నేతలు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జె.ఆర్ పుష్పరాజ్ చిత్ర పటానికి టీడీపీ ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మల్యాద్రి, టీడీపీ నేతలు పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పనిచేసిన పుష్పరాజ్ , నిబద్ధత గల నేతగా, దళిత నేతగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారు.

ఎన్టీఆర్ కేబినెట్ లో క్రీడాశాఖ మంత్రిగా, చంద్రబాబు హయాంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. అంచనాల కమిటీ చైర్మన్ గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, పుడ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారని, ఏ పదవి ఇచ్చినా తన పనితీరుతో ఆపదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి పుష్పరాజ్. కాల్వ శ్రీనివాసులు వంటి కొత్తతరం నాయకుల్ని టీడీపీలోకి తీసుకొచ్చారని అన్నారు. కొంతమంది వైసీపీ దళిత నేతలు తమ స్వార్దం కోసం జగన్ రెడ్డికి దళిత జాతిని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారని, కానీ దళిత జాతి అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని నమ్మి కడవరకు పుష్పరాజ్ టీడీపీలో ఉన్నారని నేతలు అన్నారు.

పుష్పరాజ్ మృతి తెలుగుదేశం పార్టీకి, దళిత జాతికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరూతూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు గొట్టెముక్కల రఘురామరాజు, అనంతపురం జిల్లా నేతలు రామ్మోహన్ చౌదరి, కొప్పుల నాగరాజు, మల్లికార్జున, వై.పి రమేష్ , లక్ష్మి నారాయణ, కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటి సభ్యులు హజీ హసన్ భాషా, టీడీపీ ఎన్.ఆర్.ఐ కో ఆర్డినేటర్ రాజశేఖర్, హెచ్. ఆర్డీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE