Suryaa.co.in

Editorial

జగన్‌తో జంగ్ అంత వీజీ కాదు!

– టీడీపీ సమరోత్సాహం ఫలిస్తుందా?
– జగన్‌ను ఎదుర్కొనే శక్తి సమకూర్చుకుందా?
– అసలు బీజేపీ వ్యూహం ఏమిటి?
– వైసీపీకి బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా?
– బాబు అపాయింట్‌మెంట్ వ్యవస్థ ఇంకా మారలేదా?
– ఇప్పటికీ ఇంకా ‘ధర్మదర్శనాలే’నా?
– నేతల్లో నమ్మకం కలిగించడంలో బాబు సఫలమవుతున్నారా?
– జగన్ సోషల్ ఇంజనీరింగ్‌ను బాబు ఫాలో అవుతారా?
– పీకే ఆలోచనలకు విరుగుడు మంత్రం ఉందా?
– పార్టీ ఆఫీసును ప్రక్షాళన చేస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ జింకను వేటాడేప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుందో తెలుసా? అట్టాంటి మరి పులినే వేటాడాలంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి? అన్ని బండ్లు కూడా వద్దురా. పెట్రోల్ రేట్లు కూడా పెరిగినయ్ కదా. అందరూ కలసి ఓ బండ్లోనే వెళ్లండి. మీరెంత సైలెంట్‌గా ఉంటే.. మర్డర్ అంత సైలెంట్‌గా ఉంటుంది’’
– ఇది మహేష్ హీరోగా వచ్చిన సినిమాలో తనికెళ్ల భరణి, తన ప్రత్యర్ధి గురించి చెప్పిన డైలాగిది. ఇది ప్రసుతం ఏపీలో జగన్ సర్కారును భూస్థాపితం చేయాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ తపనకు సరిపోతుందని స్వయంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో వైసీపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ బలం తరిగిపోతోందని.. టీడీపీ బలం పెరిగిపోతోందని.. ఓ నాలుగు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ ఖాతాలో చేరాయన్న చర్చ నేపథ్యంలో… అంగ-అర్ధబలం దండిగా ఉన్న జగన్‌ను అంత తక్కువ అంచనా వేయడం మంచిదికాదన్న విభిన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది.

జగన్ పాలనపై ఉద్యోగులు, విద్యాధికులు, తటస్థులు, ఇంకా మరికొన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో.. బటన్ నొక్కడం ద్వారా లబ్ధిపొందుతున్న వర్గాలను, విస్మరించకూడదన్న హెచ్చరికలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా పెద్దగా రాజకీయానుభవం లేని జగన్.. సోషల్ ఇంజనీరింగ్‌లో సాధిస్తున్న విజయాలను, విస్మరించడానికి వీల్లేదంటున్నారు. వైసీపీ సోషల్ ఇంజనీరింగ్‌లో.. జగన్ ఫార్ములాను టికెట్లలో పాటించకపోతే, ఆశించిన లక్ష్యం చేరడం కష్టమన్న వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ బృందం ఆలోచనలు, మళ్లీ ఎన్నికల ముందు మరోసారి అమలయ్యే ప్రమాదం ఉన్నందున.. దానికి విరుగుడు చర్యల దిశగా, నిర్ణయాలు తీసుకోవలసి ఉందంటున్నారు. కులాల చిచ్చులో బలయ్యే అలవాటున్న ఏపీలో.. దాన్ని అస్త్రంగా సంధించే జగన్ సీఎం అయినందున.. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా, చూసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా కమ్మ కులంపై గత ఎన్నికల్లో చేసిన దుష్ప్రచారం ఫలించినందున, ఈసారి జాగ్రత్తగా ఉండటం మంచిదంటున్నారు. ఆ మేరకు గుంటూరు-కృష్ణా జిల్లాల్లో కమ్మ వర్గానికి సీట్లు తగ్గించి.. అనంతపురం, ప్రకాశం, పశ్చిమగోదావరి, విశాఖ నగరంలో మేరకు కమ్మవర్గానికి సీట్లివ్వడం ద్వారా, సోషల్ ఇంజనీరింగ్ చేయాలంటున్నారు. ఎస్సీల నియోజకవర్గాల్లో కూడా కమ్మ నేతలే పెత్తనం చేస్తున్న సంప్రదాయానికి తెర దించకపోతే కష్టమంటున్నారు.

ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిలో, ఇప్పటికీ పెద్దగా మార్పు రాలేదన్న చర్చ జరుగుతోంది. ఆయన అనుసరిస్తున్న అపాయింట్‌మెంట్ వ్యవస్థ ఇంకా మారలేదని, ఎవరు ప్రధానమో-ఎవరు అప్రధానమో గుర్తించే వ్యవస్థను, ఇప్పటికీ గుర్తించలేదని సీనియర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగిన యంత్రాంగాన్ని ఇంకా సమరకూర్చుకోలేకపోవడం, ఒక మైనస్ పాయింట్ అంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు సూటు-బూటు వేసుకున్న వారికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. ప్రతిపక్షంలోని వచ్చి, బలమైన ప్రత్యర్థితో పోరాడుతున్న సమయంలో కూడా, ఇంకా ‘దర్మదర్శనాల’ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడూ.. అధికారంలో లేనప్పుడు అందరినీ వెయిట్ చేయించే విధానం, ఇప్పుడు వర్కవుట్ కాదంటున్నారు. ముఖ్యంగా.. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను నెత్తికెక్కించుకుని, నేతలు-కార్యకర్తలను పట్టించుకోని అధినేత వైఖరి మారిందన్న సంకేతాలు పంపించడం ప్రధానమంటున్నారు.

విపక్షంలోకి వచ్చిన ప్రతిసారీ.. ‘‘అధికారంలో ఉన్నప్పుడు అధికారుల మాటలు విని తప్పు చేశాం. ఈసారి కార్యకర్తలకే ప్రాధాన్యం’’ అని చెప్పడం.. తర్వాత మళ్లీ అధికారులకే ప్రాధాన్యం ఇవ్వడం అధినేతకు అలవాటయిందన్న భావన, పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. ఈసారి తన మాటలను.. చేతల ద్వారా చూపిస్తేనే, బాబుపై విశ్వసనీయత పెరుగుతుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. అంటే విపక్ష నేతగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను కలిసే విధానంపైనే, వారు భవిష్యత్తును అంచనా వేస్తారంటున్నారు.

ఇక అంగ బలం-అర్ధబలంతోపాటు.. కేంద్రంలో బీజేపీ దన్ను పుష్కలంగా ఉన్న జగన్‌ను, అంత తక్కువ అంచనా వేయడం తెలివైన పనికాదంటున్నారు. అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకుని, ప్రధాన ఆదాయ వనరులపై పట్టు బిగించిన జగన్ పార్టీతో.. ఎన్నికల ఖర్చులో పోటీకి సిద్ధపడటం కూడా సవాలేనని, టీడీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

చేతికి ఎముకలేకుండా రాష్ట్రానికి అప్పులు ఇస్తున్న బీజేపీ సర్కారు, కీలకమైన కేసుల్లోనూ పరోక్ష సాయం చేస్తోందన్న విషయాన్ని గ్రహించాల్సి ఉందంటున్నారు. వివేకా హత్య కేసు తేల్చకపోవడం, మధ్యలో సీబీఐ ఎస్పీని మార్చడం, జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వడం వంటి అంశాలను టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

జగన్ సర్కారును విమర్శిస్తున్న తమ పార్టీ నేతలను పక్కకుపెడుతున్న బీజేపీ రాజకీయ వ్యూహం అర్ధం చేసుకోకుండా, టీడీపీ ముందుకు వెళ్లకూడదంటున్నారు. వైసీపీతో బీజేపీది బంతిపూల యుద్ధమా? బలమైన యుద్ధమా అని తేల్చుకున్న తర్వాతనే, తెగిస్తే మంచిదన్నది టీడీపీ సీనియర్ల వాదన.

అసలు రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహమేమిటి? అది టీడీపీకి అనుకూలమా? వ్యతిరేకమా? ఎన్నికల ముందు వైసీపీకి కేసీఆర్ చేసే సాయమేమిటి? టీడీపీకి మద్దతునిచ్చే వర్గాలను, మునుపటి మాదిరిగా దర్యాప్తు సంస్థల ద్వారా.. కేంద్రం అష్ట దిగ్బంధనం చేసి, పరోక్షంగా వైసీపీకి సాయపడుతుందా? లేదా?

లేక ఈ ఐదేళ్లూ బీజేపీని వ్యతిరేకించకుండా.. ‘అపాత్రసాయం’ చేసినందువల్ల, తనపై బీజేపీకి ఉన్న కోపం తగ్గి తటస్థంగా ఉంటుందా? అన్న విషయం నిర్ధరణ కాకుండా, విజయావకాశాలపై ధీమా పనికిరాదని టీడీపీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

బీజేపీకి ఏపీలో నయాపైసా బలం లేకపోయినా.. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతల్లో, సింహభాగం మండల స్థాయి నేతలయినప్పటికీ.. ఐటి- ఈడీ- ఇన్‌కంటాక్స్ వంటి ఆయుధాలు చేతిలో ఉన్న బీజేపీ వైఖరి ఏమిటన్నది తెలియకుండా, వ్యూహాలు రచించడం వల్ల ప్రయోజనం లేదన్నది సీనియర్ల వాదన.

ఇక ప్రస్తుతం జనసేనాధిపతి పవన్ తనతో కలసివస్తున్నప్పటికీ… అది శాశ్వతమా? తాత్కాలికమా? పవన్‌పై బీజేపీ ప్రభావం ఎంత? బీజేపీ ఆదేశాలను పవన్ అమలుచేస్తారా? ధిక్కరిస్తారా? ఎన్నికల ముందు పవన్‌తో కలసి పోటీ చేద్దామని బీజేపీ నిర్ణయిస్తే, దానికి పవన్ అంగీకరిస్తారా? లేదా? అన్న కీలక అంశాలు ఒక కొలిక్కి రాకుండా, తెలుగుదేశం చేసే సమరనినాదానికి అర్ధం ఉండదన్నది సీనియర్ల విశ్లేషణ.

అందువల్ల ముందు సంస్థాగతంగా బలపడి, నియోజకవర్గ ఇన్చార్జిలను భర్తీ చేసుకుంటే మంచిదన్న సూచన, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దానికంటే ముందు.. పార్టీ ప్రధాన కార్యాలయానికి ఉన్న కార్పోరేట్ లుక్‌ను మార్చి.. ఎన్టీఆర్ హయాం నాటి ‘కార్యకర్తల కార్యాలయం’గా మార్చాల్సి ఉందంటున్నారు. దానితోపాటు.. అధినేత అపాయింట్‌మెంట్ వ్యవస్థను మార్చి, అందరినీ కలిసే వ్యవస్థను ఏర్పాటుచేసుకోవలసి ఉందని చెబుతున్నారు. ప్రధానంగా తనకు నచ్చిన విధంగా కాకుండా, జనాలకు నచ్చే పద్ధతిని అమలుచేయాల్సిన అవసరం ఉంద ంటున్నారు.

ఇక మంగళగిరి పార్టీ ఆఫీసు వ్యవస్థను, పూర్తి స్థాయిలో ప్రక్షాళనం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పనిమంతులకు స్థానం కల్పించకుండా.. అగ్రనేతలు సిఫార్సు చేసిన వారికే పార్టీ ఆఫీసులో, పట్టం కడుతున్నారన్న ఆరోపణలకు తెరదింపాల్సిన సమయం వ చ్చిందంటున్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాలకు చెందిన ఫైనాన్సు, వడ్డీ వ్యాపారులు, అన్ని పార్టీలతో సంబంధాలుండి.. జిల్లాల్లో నయాపైసాకు పనికిరాని వారందరికీ, రాష్ట్ర కార్యాలయంలో రెడ్ కార్పెట్ వేస్తున్న వైనం విమర్శల పాలవుతోందని గుర్తు చేస్తున్నారు.

LEAVE A RESPONSE