గోడౌన్లపై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశం ఏమైంది?
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఓ గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. గుడిసెకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. పదిమంది తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిలో స్థానికులు, కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు.
ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదంతో అక్కడున్నవారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉరుకులు, పరుగులు తీశారు. ఘటనాస్థలంలో బీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పదిగంటలకే కారేపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమైన కొద్దిసేపటికే బాణాసంచా పేల్చడంతో ప్రక్కనున్న పూరిగుడిసెపై పడడంతో మంటలు వ్యాపించాయి.
గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలు వ్యాపించి సంఘటన జరిగిన ప్రాంతంలో ఒకరు ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందడం పలువురు గాయపడటం జరిగింది. కేవలం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి . నగరంలోని మల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం మల్లాపూర్ పారిశ్రామికవాడలోని రసాయనిక పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో జనాలు పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నా ఆరుగంటల పైనే అగ్నిగుండంగా మారింది. పెయింటింగ్ రసాయనాలతో మంటలు, ఘాటైన వాసనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు మౌలాలి, నాచారం, చర్లపల్లి అగ్నిమాపక సిబ్బంది సుమారు ఆరు శకటాలతో ప్రయత్నించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
గతంలో ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తూ అన్ని వివరాలు సేకరించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హడావుడి చేస్తుంటారు. గోడౌన్లపై సర్వే చేసి రిపోర్టు అందివ్వాలని గత నెలలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. కనీసం అగ్ని ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్, చర్లపల్లి లోనూ కనీస చర్యలు చేపట్టలేదు.
రెసిడెన్షియల్ భవనాలను కమర్షియల్ పర్పస్ లో వాడుతున్నట్లు అధికారుల దృష్టికి వస్తున్నా పట్టించుకోవడం లేదు. అన్నీ పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు వాటిపై అదనంగా ఫ్లోర్లు నిర్మిస్తూ వాటిని ఇష్టారీతిన వినియోగిస్తుండటంతో ఇది కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్లపైనే దృష్టి నిర్మాణాలు పూర్తయిన బిల్డింగ్ను ఏ పర్పస్లో వాడుతున్నారనే విషయాన్ని బల్దియా పట్టించుకోవడంలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్ గా ఉందా? లేదా? అని మాత్రమే చూస్తున్నారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారుల లోపాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలని కౌన్సిల్ సమావేశాల్లోనూ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నందుకు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ప్రాంతంలో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతోంది.