Suryaa.co.in

Editorial

కొడాలి నానిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ కాళ్లు

– పాత ఫొటోలు కొత్తగా వైరల్‌
– గుడివాడ ఆత్మాభిమానం తాకట్టు అంటూ నెటిజన్ల ఫైర్‌
– తెలంగాణ ఆత్మాభిమానం ఎపిసోడ్‌లో చేరిన ‘ఆంధ్రా ఆత్మాభిమానం’

ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ‘ఆత్మాభిమానం సీజన్‌’ నడుస్తోంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పులను.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా, చేతులతో తీసి ఇచ్చిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది. దానితో తెలంగాణ ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని బండి సంజయ్‌, కేంద్రమంత్రి అమిత్‌షాకు తాకట్టు పెట్టారంటూ తెరాస నేతలు తెగ ఎదురుదాడి చేశారు. సరే.. అమిత్‌షా తనకు గురువుతో సమానం కాబట్టి, చెప్పులు మోశానని, అయినా తాను ఇటలీ నేత కాళ్లకు మొక్కలేదని సంజయ్‌ ఎదురుదాడి చేశారు. అమిత్‌షా-మోదీ వద్దకు వెళితే దేశభక్తి ఉప్పొంగుతుందని, అదే కేసీఆర్‌ దగ్గరకు వెళితే సిగరెట్‌- మందు వాసన వస్తుందంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. గతంలో ఇలాగే టంగుటూరి అంజయ్య ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు, నాటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో ఆయనను నానా చివాట్లు పెట్టిన ఫొటో పత్రికల్లో అచ్చయి, అది చివరకు తెలుగువాడి ఆత్మగౌరవం- ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టేంతవరకూ వెళ్లింది. అంతకంటే ముందు.. గుంటూరు జిల్లాలో పర్యటించిన సంజయ్‌గాంధీ చెప్పులను నాటి కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య మోసిన వైనం కూడా చర్చనీయాంశమయింది. కానీ అప్పుడు ఈ స్ధాయిలో మీడియా-సోషల్‌మీడియా ఉధృతి లేనందున, పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు సోషల్‌మీడియా డేగకళ్లతో ఎవ‘రెడీ’గా ఉంటోంది. బెడ్‌రూముల్లో కూడా రంధ్రాన్వేషణ చేస్తోంది. దీనితో నిత్యం జనంలో ఉండే నేతలు, సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా తారలు ఒళ్లంతా కళ్లు పెట్టుకుని జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక్కోసారి సదరు సెలబ్రిటీలు, వారి పక్కన ఉండే ప్రముఖుల కాలం, ఖర్మం కలసిరాకపోతే.. పురాతన కాలం నాటి ఫొటోలు కూడా.. లేటయినా, లేటెస్టుగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

ఇప్పుడు ఆంధ్రాలో కూడా అలాంటి ఆత్మాభిమానం గత్తరకు తెరలేచింది. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆత్మాభిమానం విమర్శల్లో అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పటికే హరికృష్ణ, గద్దె kodali-nani-harikrishnaరామ్మోహన్‌రావు కూర్చున్నప్పుడు వారికి కొడాలి నాని టీ అందిస్తున్న ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొత్తగా వైరల్‌ అవుతున్న మరొక ఫొటో కొడాలికి పితలాటకంగా మారింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో కొడాలి నాని, ఆయనతో సినిమాలు చేశారు. హరికృష్ణకు అనుచరుడిగా ముద్రపడిన కొడాలి, ఆ పరంపరలో భాగంగా హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్‌ వెంట ఉండేవారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్‌-కొడాలినాని-గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముగ్గురూ కుర్చీలో కూర్చున్నప్పుడు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొడాలి నాని తొడపై దర్జాగా కాళ్లేసుకున్న ఓ పాత ఫొటో ఒకటి ఇప్పుడు కొత్తగా వైరల్‌ అవుతోంది.

అమిత్‌షా చెప్పులు బండి సంజయ్‌ మోశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కొడాలి నాని తొడపై, ఎన్టీఆర్‌ కాళ్లు వేసిన ఫొటోలు కొడాలిని రాజకీయంగా ఇరుకునపెట్టేవేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానిపై నెటిజన్లు చేస్తున్న విమర్శలు కూడా కొడాలి ఇమేజ్‌ను దారుణంగా డామేజీ చేసేలా కనిపిస్తున్నాయి. ‘బూతులమంత్రిగా పనిచేసిన నానికి ఆత్మగౌరవం, ఆవకాయలూ పట్టవు’.. ‘ఆత్మగౌరవం లేని వారికి ఇలాంటి బానిస బతుకులు అలవాటే’.. ‘కాళ్లు వేయించుకుని గుడివాడ సీటు దక్కించుకున్న వ్యక్తి ఆత్మాభిమానం గురించి ఎందుకు ఆలోచిస్తాడు’.. ‘చంద్రబాబు ఎవరి కాళ్లో పట్టుకున్నాడని విమర్శించే కొడాలి నాని, ఈ ఫొటోకు ఏం సమాధానం చెబుతారు’.. ‘కొడాలి నాని మా గుడివాడ పరువు తీశారు’.. గుడివాడ ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్‌కు తాకట్టుపెట్టారు’.. అని నెటిజన్లు ప్రశ్నలు-విమర్శనాస్ర్తాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి లేటెస్టుగా వచ్చిన ఈ లేటు ఫొటో ఆత్మాభిమానం-ఆత్మగౌరవంపై, కొడాలి నాని ఏం చెబుతారో చూడాలి!

LEAVE A RESPONSE