– చంద్రబాబు అరెస్టుపై ఇప్పటిదాకా స్పందించని జూనియర్ ఎన్టీఆర్
– ట్వీట్‌లోనూ కనిపించని ఖండన
– బాబు అరెస్టును ఖండించిన పురందేశ్వరి
– రిమాండ్‌కు ముందు బాబుకు అన్న కుటుంబ సంఘీభావం
– అరెస్టుపై ఆనందంతో ఎన్టీఆర్‌ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
– అరెస్టును ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని
– జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై సోషల్‌మీడియాలో టీడీపీ అభిమానుల ఆగ్రహం
– జూనియర్ మౌనంపై కమ్మ వర్గం కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. టీడీపీ ఏపీబంద్‌కు పిలుపునిచ్చింది.
చంద్రబాబును రిమాండ్‌కు తరలించే ముందు.. దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా విజయవాడ వెళ్లి, ఆయనకు నైతిక మద్దతు ప్రకటించారు. అంతకుముందు.. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా, అర్ధరాత్రి వేళ చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తప్పుపట్టారు. ఎన్టీఆర్ తనయుడు కూడా బాబును కలిశారు. ఆ ప్రకారంగా దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా చంద్రబాబుకు అండగా నిలిచారు.
అయితే తన శత్రువైన చంద్రబాబు అరెస్టు అయిన ఆనందం.. దివంగత ఎన్టీఆర్ రెండో భార్య- వైసీపీ నేత లక్ష్మీపార్వతిలో స్పష్టంగా కనిపించింది. ఆమె తన ఆనందాన్ని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఎన్టీఆర్ ఆత్మతో పంచుకోవడం విశేషం. బాబు అరెస్టయిన నేపథ్యంలో లక్ష్మీపార్వతి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఆయనకు, తన భర్తకు నివాళులర్పించారు. చంద్రబాబుతో ఆమెకున్న వైరం అందరికీ తెలిసిందే కాబట్టి, అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
కానీ…తనది తెలుగుదేశం పార్టీ, తన కట్టె కాలేవరకూ తెలుగుదేశం జెండాకిందనే ఉంటానని, గతంలో ప్రకటించిన అన్న మనుమడిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. ఈ పరిణమాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. తమ మామ- టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా, మౌనంగా ఉండటం ఇప్పుడు సోషల్‌మీడియాలో కొత్త చర్చకు దారితీసింది.
చంద్రబాబును అరెస్టు చేసి 48 గంటలు దాటినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రధానంగా కమ్మ సామాజికవర్గం, ఎన్టీఆర్ మౌనంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. కనీసం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ అధినేత అరెస్టును ట్వీట్ ద్వారానయినా ఖండిస్తారేమోనని.. టీడీపీ అభిమానులు, కమ్మ సామాజికవర్గం ఆశించింది. అయితే ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం, వారిలో ఆగ్రహానికి గురిచేసింది.
తాత పేరు చెప్పుకుని మనుగడ సాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీకి అధ్యక్షుడిని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ స్పందించరా? కనీసం ఖండించరా? తాత కుటుంబం అంతా చంద్రబాబుకు అండగా నిలిస్తే, జూనియర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? చివరకు ఆయన సోదరి సుహాసిని కూడా ఖండించారు కదా? అంటే ఒకే కుటుంబంలో రెండు అభిప్రాయాలా? జగన్‌పై ఆయనకు ఎందుకంత మొహమాటం?
బూతుల నాని, వంశీ ఆ పార్టీలో ఉన్నారన్న ప్రేమనా? ఇకపై ఎన్టీఆర్ పేరు చెప్పుకోకుండా జూనియర్‌ను ఉండమనండి చూద్దాం. అన్నగారి కుటుంబం నుంచి ఇలాంటి వారు రావడం నందమూరి కుటుంబ దౌర్భాగ్యం’’ అని.. అన్న అభిమానులు- కమ్మ సామాజికవర్గం, సోషల్‌మీడియాలో జూనియర్‌ను చెడుగుడు ఆడుతున్నారు.