– బాధితులకు ఇంటి స్థలం, పరిహారం అందజేసిన ప్రభుత్వం
పోలవరం: పోలవరం ప్రాజెక్టు పునఃనిర్మాణం, పునఃనిర్మాణ ప్యాకేజీ కింది నిర్వాసితులకు సరైన పరిహారం అందజేయడం ద్వారా పౌరుల హక్కులను పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, ఉప-లోకాయుక్త సంస్థ మరోసారి కీలక పాత్ర వహించింది. వివరాలివి…
పోలవరం ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ప్రయోజనాల నుండి తమను మినహాయించడంపై నల్లాల వెంకట రమణమ్మ, నల్లాల శేషగిరి లోకాయుక్త ఫిర్యాదును దాఖలు చేశారు. వారిద్దరి నివాసాలు ప్రభావిత ముంపు ప్రాంతంలో ఉన్నప్పటికీ వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు. దీంతో లోకాయుక్త సంస్థ జోక్యం చేసుకుంది. దీని ఫలితంగా ప్రాజెక్టు నిర్వాహకుడు, ఎక్సీ ఆఫిషియో జాయింట్ కలెక్టర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, ధవళేశ్వరం వారు ఫిర్యాదిదారులను సప్లమెంటరీ డ్రాస్ట్ ఆర్ అండ్ ఆర్ పథకంలో చేర్చారు. ఇంకా, ఫిర్యాదిదారులకు ఇంటిస్థలం కేటాయింపుతో పాటు రూ.6,36,000 లు, రూ.25,000 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెల్లించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు బాధితులకు పై పరిహారం చెల్లించినట్టు లోకాయుక్తకు తెలిపారు.
ఇదిలావుండగా, కుమ్మరిలోన గ్రామం, తుని మండలంలోని అన్ని ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల ప్రయోజనం కోసం ప్రభుత్వం రూ.9.50 కోట్లు మంజూరు చేసింది. ఈ ఫిర్యాదు వలన ఫిర్యాదిదారులతో పాటు ఇతర ప్రభావిత కుటుంబాలకు కూడా ప్రయోజనాలు కలిగాయి. ఫిర్యాదిదారుల సమస్య పరిష్కారం అవడంతో ఉప-లోకాయుక్త పి.రజని ఈ ఫిర్యాదును మూసివేస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు.