న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా తెలుగు తేజం నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్రపతి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించారు.
ఈనెల 23న జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే పదవీ విరమణ చేయనుండగా 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన ఎన్వీ రమణ 1983లో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్, క్రిమినల్, కానిస్టిట్యూషనల్, లేబర్, ఎలక్షన్ మ్యాటర్‌లకు సంబంధించిన కేసులు అనేకం వాదించారు.
2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పర్మినెంట్ జడ్జ్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వెళ్లారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. మొత్తానికి సుప్రీం కోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ హోంశాఖకు పంపంది.
హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లింది. అంతిమంగా రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లయింది. సుప్రీం కోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. తన వృత్తి ప్రస్థానంలో న్యాయవాది దగ్గర నుంచి న్యాయమూర్తి వరకూ అనేక కీలక కేసులలో ఎన్వీ రమణ తనదైన ముద్రవేసుకున్నారు. ఇక, సుప్రీం కోర్టు జడ్జిగా అనేక కీలక కేసుల విచారణలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇంట్లో మహిళలు చేసే పని, ఆఫీస్‌లో భర్త చేసే పనికన్నా తక్కువేమీ కాదని తీర్పునిచ్చింది ఆయనే.
తర్వాత ఎండీ అన్వర్ వర్సెస్ ఎన్‌సీటీ ఢిల్లీ, అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూకశ్మీర్ లాంటి కీలక కేసుల తీర్పుల్లో ఆయన జడ్జిగా ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో 4జీ సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని తీర్పునిచ్చిన ముగ్గురు జడ్జిల బెంచ్‌కు జస్టిస్ రమణ హెడ్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను న్యాయశాఖ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు.
ఆ తర్వాత ఇప్పటివరకు మరో తెలుగు వ్యక్తికి ఆ అవకాశం దక్కలేదు. ఇక, జస్టిస్ రమణ గతంలోకి వెళ్తే… కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. ఎన్. గణపతిరావు, సరోజినిలు ఆయన తల్లిదండ్రులు. జస్టిస్ రమణ కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి, అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్ కళాశాలలో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదై, న్యాయవాద వృత్తి ప్రారంభించారు.
సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో జస్టిస్ రమణ దిట్ట. రాజ్యాంగపరమైన వివాదాలు, కార్మిక చట్టాలు, ఎన్నికల సర్వీసులకు సంబంధించిన కేసులపై న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో వాదనలు వినిపించారు. రైల్వేతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్‌గా విధులు నిర్వహిస్తూ 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో ఆంధ్రపదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలపై సుమోటోగా పిటిషన్‌లను విచారణకు స్వీకరించి అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ ఢిల్లీలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి నిడో తానియాను దుకాణాదారులు కొట్టి చంపిన విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటోగా విచారించారు. అదనపు కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
అంతేగాక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేశారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి ఢిల్లీ హైకోర్టులో ఈ-ఫైలింగ్‌ను ప్రారంభించారు. జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. రాష్ట్ర న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయడానికి చాలా కృషి చేశారు. కేసు విచారణ ప్రక్రియ కక్షిదారుకు అర్థమయ్యే స్థానిక భాషలో ఉండాలని, న్యాయవాదులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియని స్థితిలో వారుండరాదన్నది జస్టిస్ రమణ భావన.
అందుకే న్యాయవ్యవస్థలో తెలుగు అమలు చేయాల్సిన అవసరం ఉందని, జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా అధికార భాషా సంఘంతో కలిసి సెమినార్ నిర్వహించారు. న్యాయవ్యవస్థలో తెలుగు భాష అమలు నిమిత్తం ఈ సెమినార్ పలు తీర్మానాలు అప్పటి ప్రభుత్వానికి పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సమ్మతించి తెలుగు అమలుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది.