Suryaa.co.in

Editorial

నక్సల్స్ ‘నరమేధం’పై..హక్కుల నేతల నోళ్లు పెగలవేం?

మావోల ‘శవ’తాండవంపై స్పందించని మేధావులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వయో వృద్ధుడైన వరవరరావు‌ను.. మానవతావాదంతో జైలు నుంచి విడిపించాలంటూ, కేంద్రానికి పంపిన వినతిపత్రంలో సంతకం చేసిన, డజన్లమంది మేథావుల చేతులు ఇప్పుడెందుకు ముడుచుకున్నాయ్?
మానవ హక్కులపై గుండెలవిసేలా రోదించే మేధావులు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు?
దేశంలో మానవ హక్కులు మంట కలిసిపోతున్నాయంటూ టన్నుల కొద్దీ కన్నీరు కార్చే కుహనా మేధావులు, యూనివర్శిటీ ప్రొఫెసర్ల నోళ్లు  పెగలవేం?

నక్సల్స్‌పై దాడులు జరిగినప్పుడల్లా ఆకాశం అదిరేంత స్థాయిలో అరిచే మేధావులు ఇప్పుడు నవరంధ్రాలూ మూసుకున్నారేం?
ఎస్… ఇది.. చత్తీస్‌ఘడ్  దండకారణ్యంలో జవాన్ల నెత్తురు రుచిచూసిన మావోల మారణకాండ తర్వాత.. మానవతావాదుల మస్తిష్కం రేపిన ప్రశ్నల అలజడి! 24 మంది జవాన్లకు కర్కశంగా కాల్చి చంపి, మరో రెండు డజన్ల మందిని క్షతగాత్రులను చేసిన మావోల ‘శవతాండవం’పై ఒక్కరంటే ఒక్క మానవ హక్కుల మేధావి గానీ…వరవరరావు‌‌పై కరుణ ప్రదర్శించి, ఆయనను విడుదల చేయాలంటూ  సంతగించిన ఒక్క పాత్రికేయ వృద్ధుల నుంచి గానీ కనీస ఖండన కనిపించక , వినిపించని పలాయన వాదం చూసిన తర్వాత.. మెదడుపై తల ఉన్న ఎవరికయినా వచ్చే ఆగ్రహావేశమే ఇది.

దండకారణ్యంలో జవాన్లపై మావోల నరమేధం మానవత్వానికే మాయనిమచ్చ. హింసకు హింసే సమాధానం అని నమ్మే మావోలను సమర్ధిస్తున్న మానవ హక్కుల మేధావులు.. తాజా మారణకాండలో ‘ప్రశ్నల బోనులో ముద్దాయి’లుగా నిలబడ్డారు. వయసుడిగినా ఇంకా మానవహక్కులపై మమకారం చావని వృద్ధజంబూకాలు, సోకాల్డ్ సెక్యులరిస్టులు, మేధావుల ముసుగేసుకున్న ప్రొఫెసర్లు.. తాజా దండకారణ్యంలో జవాన్లపై జరిగిన దారుణకాండకు, ఏం సమాధానం చెబుతారు? అసలు ఈ కుహనా మేధావుల గొంతు ఒకరోజు దాటినా ఎందుకు మూసుకుపోయింది? ఇంతకూ వీరు విశ్వసించేది ప్రజాస్వామ్యమా? లేక మావోస్వామ్యమా?

రక్తానికి రక్తం సిద్ధాంతమయితే, ఈ భూమ్మీద ప్రతి ఒక్క జీవీ విగతజీవిగానే ఉంటుంది. ఒకరికి ప్రాణం పోయలేని వారు, మరొకరి ప్రాణం తీయడం నేరమే కాదు, అనైతికం కూడా. ఆ హక్కు ఎవరికీ లేదు.  ఆ పని పోలీసులు చేసినా, మావోలు చేసినా, టె ర్రిస్టులు చేసినా అది ఖండనార్హమే. సమాజంలో తుపాకులు పట్టడం చట్టవిరుద్ధమన్నది పోలీసుల వాదనయితే, రాజ్యహింసకు గురవుతున్న   వర్గాల కోసమే తుపాకులు పట్టి, సమాజం కోసమే సమిథలవుతున్నామనేది మావోయిస్టుల ప్రతివాదన. ఎవరి కోణంలో వారి వాదన సబబుగానే కనిపించడం సహజం. ఈ వాదనకు ఆది, అంతం లేదు. ఇది చెట్టు ముందా? విత్తు ముందా? అన్న తర్క-వితర్కవాదనలా కనిపిస్తుంది. అయితే రాజ్యహింసతోపాటు, మావోల హింస వల్ల నేలకొరుగుతున్నవి మాత్రం మానవ ప్రాణాలేనన్నది విస్మరించకూడదు.

ఇది క్షుద్ర రాజకీయ భూమి. ఆలోచనలు, అడుగులూ అన్నీ క్షుద్రమే. పాకిస్తాన్‌లో కమ్యూనిజంపై నిషేధం విధించారు. కానీ మన కమ్యూనిస్టులు.. దేశ నాయకత్వం రక్షణ కోణంలో తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. అదే కమ్యూనిస్టు పార్టీకి మూలపుటమ్మ అయిన చైనా, మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని అనుక్షణం తపిస్తుంటుంది. మన దేశ భూభాగంపై తన రాక్షస పాదాలు మోపుతుంది. దానిని మన దేశ నాయకత్వం ప్రతిఘటించినప్పుడల్లాఐ  దానికి ఈ దేశపు కామ్రేడ్లు మద్దతు ప్రకటించకుండా మౌనంగా ఉంటారు. చైనాలో ఇస్లాంపై నిషేధం ఉంది. కానీ మన దేశ కమ్యూనిస్టులు మాత్రం, ఇక్కడి ముస్లిముల హక్కులు-రక్షణ అంటూ టన్నుల కొద్దీ సానుభూతి కురిపిస్తుంటారే తప్ప, చైనాలో ఇస్లాంపై ఎందుకు నిషేధం విధించారని మాత్రం అడగరు. వరవరరావు‌ వయో వృద్ధుడయినందున.. ఆయనను మానవతా వాదంతో విడిపించాలని కోరే సోకాల్డ్ మేధావులు, వృద్ధ పాత్రికేయులు, ప్రొఫెసర్లు..  ఆయన సైనికులు-పోలీసులను చంపుతున్న మావోల చర్యలను బహిరంగంగానే మద్దతునిస్తుంటే మాత్రం మాట్లాడరు. అందుకే ఇది క్షుద్ర రాజకీయ భూమి! కాదనే దమ్మెవరికయినా ఉందా?

చత్తీస్‌ఘడ్ మారణహోమంలో నేలకొరిగిన జవాన్లలో కొందరు తప్ప, మిగిలిన వారంతా భూమిపుత్రులే. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. అలాంటి వారికి మావోయిజం, లెనినిజం అంటే ఏమిటో తెలియదు. తెలిసిందల్లా తమ పై అధికారులు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లడమే. దేశం కోసం చేస్తున్న  త్యాగాలను చూసి వారి గ్రామాల ప్రజల ఛాతీ గర్వంతో ఉప్పొంగిపోతుంటుంది. సెలవులకు వచ్చిన వారిని గ్రామప్రజలు, నిజమయిన హీరోల్లా భావిస్తారు. అలాంటి హీరోలు విగతజీవులై, వారి కాయం  శవపేటికలో ఒదిగిపోయి గాలిరాక మగ్గిపోయి, చితిమంటల మధ్య చిక్కిన ఆ విషాదాన్ని చూసిన ఆయా గ్రామస్తులెవరయినా  మావోల చర్యను స్వాగతిస్తారా? ఖండిస్తారా? పొట్టకూటి కోసం కుటుంబాలను విడిచిపెట్టిన వారంతా, తిరిగి శవపేటికపై కళ్లముందు కనిపించే ఆ విషాద దృశ్యాన్ని చూసి, ఎంతమంది తల్లుల గుండెలు  తట్టుకుంటాయి? ఎంతమంది తండ్రుల హృదయాలు తల్లడిల్లి ఉంటాయి? ఒక జవానును మావోలు.. ఐసిఎస్ తీవ్రవాదుల తరహాలో తలకు తూటాలు పెట్టి పేల్చిన వీడియోలు చూస్తే.. ఎన్ని కోట్ల మంది గుండెలు భారంతో బరువెక్కి ఉంటాయి? ఇంకెంతమంది గుండెలు మావోలకు వ్యతిరేకంగా మండి ఉంటాయి? ఇవన్నీ మానవ హక్కుల మేధావులకు కనిపించకపోవడమే మరింత విషాదం.

ఇంత దారుణమారణకాండ సృష్టించిన మావోలు దానివల్ల సాధించినదేమిటో, సాధించబోయేదేమిటో అర్ధం కాని ప్రశ్న. దశాబ్దాల నుంచి తుపాకులనే నమ్ముకున్న వారంతా వ్యవస్థను మార్చకపోగా, ఎదురుదాడుల్లో విగతజీవులుగా మారి, తలిదండ్రులకు పుట్టెదు విషాదం మిగులుస్తున్నారన్నది మాత్రం అనుభవం చెప్పిన సత్యం. వ్యవస్థను ఎవరూ మార్చలేరన్నది ఎంత సత్యమో.. చివరాఖరకు పోరాటవాదులే సర్దుకుని, తత్వం తెలుసుకుని ఈ వ్యవస్థకు అనుగుణంగా నడుచుకోక తప్పదన్నది అంతే సత్యం. కొన్నేళ్ల జరుగుతున్న ఈ పెనుగులాటలో జరుగుతుంది ఇదే.
ఈ మారణకాండకు భారత సైన్యం కచ్చితంగా బదులు తీర్చుకుంటుందనేది నిర్వివాదం. తమ సహచరుల మరణాలకు సమాధానం చెప్పేందుకు, సైనికుల గుండెలు  ప్రతీకారేచ్ఛతో  రగలిపోవడం సహజం. అప్పుడు నేలకొరిగే మావోల నెత్తుటి శరీరాన్ని చూసి రోదించేది కూడా వారి తలిదండ్రులే. కానీ.. ఇప్పుడు దండకారణ్యంలో మావోల అరాచకాన్ని ఖండించకుండా, నవరంధ్రాలూ మూసుకున్న ఇదే మానవహక్కుల మేధావుల గుండెలు… రేపటిరోజున జరగనున్న భారతసైనికుల  ప్రతీకార చర్యలపై  రోదిస్తే మాత్రం.. అది నిస్సందేహమే దేశద్రోహమే! దట్సాల్!!

LEAVE A RESPONSE