ఉత్తరాయణం మొన్న రాత్రి 8.33కి మొదలైంది
ఉత్తరాయణాన్ని కైవల్య పాదం అనీ అంటారు. కైవల్యం అంటే ‘రెండు పదార్థాలు ఒకటిగా అవడం’ అన్న అర్థమూ ఉంది. ఇవాళ మొదలైన ఉత్తరాయణంలో లేదా కైవల్య పాదంలో సరితనంతో మనం ఒకటిగా కలవడం మొదలవాలి.
మనం సరిగ్గా లేకపోవడమే మన సమస్య లేదా మన సమస్యలకు మూలం. సరిగ్గా లేనివాటివల్లే, సరిగ్గా లేకపోవడంవల్లే మనకు సమస్యలు వస్తున్నాయి.
మనం సేకరించుకున్న, మనం జీర్ణించుకున్న, మనం చేస్తూ వస్తున్న తప్పుల నుంచి మనం బయటపడాలి; మన మధ్యతరగతి మాంద్యం నుంచి మనంత మనం బయటపడాలి.
మనం మన నుంచి బయటపడాలి. సరిగ్గా ఉండడానికి మనం మాలిమి అవాలి.
మనం సరైన వాళ్లం, మనకు తెలిసింది సరైంది, మనం అనుకుంటున్నది సరైంది వంటి తప్పులను మనం ఇకనైనా వదిలించుకోవాలి. ‘నా అభిప్రాయం’ అని ఆవులిస్తూండే వికార వ్యాధిని మనం నయం చేసుకోవాలి. ‘అభిప్రాయం కాదు అవగాహన కావాలి’ మనకు.
ప్రపంచంలో సరైన విషయాలు ఉన్నాయి. ‘సరైన విషయాలు ఆరుబయట ఒలకబోసి ఉన్నాయి’ వాటిని మనం సేకరించుకోవాలి. వాటిని సేకరించుకోవాలంటే మనం మన అభిప్రాయాల నుంచీ, అనుకోవడం నుంచీ, అబద్ధాల నుంచీ, మూర్ఖత్వం నుంచీ, చెడ్డతనం నుంచీ బయటకు రావాలి.
ఉత్తరాయణం అంటే భూమి తన తీరును మార్చుకోవడం అని మనకు తెలిసిందే. భూమే తనను తాను మార్చుకుంటోంది! భూమిని ఆదర్శంగా తీసుకుని మనమూ మనల్ని మార్చుకుందాం.
ఇదిగో ఈ మొదలైన కైవల్య పాదంలో మన పాదాల్ని ‘సరి’వైపుకు కదిపి మనం సరిగ్గా ఉండడంలోకి చేరుకుందాం. మనం సరిగ్గా ఉండి సంక్షేమంతో మమైకం ఔదాం.
– రోచిష్మాన్
9444012279