-మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
రైతులను పట్టించుకోని గత ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ప్రశ్నించారా అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటున్న సీఎం వైయస్ జగన్‌పై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏరోజైనా రైతులను పట్టించుకున్నారా అని నిలదీశారు. క్రాప్ హాలీడే అంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అన్నదాతలకు సంబంధించి పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఎల్లో మీడియాలో రాశారు. ఎవరికైనా పట్టాదారు పాస్ పుస్తకం ఉండి.. రైతు ఆత్మహత్య జరిగితే ఒక్క కుటుంబానికైనా సరే ప్రభుత్వం నుంచి అందించాల్సిన నష్టపరిహారం అందలేదని మీరు ఎక్కడైనా రుజువు చేయండి అంటూ మంత్రి సవాలు విసిరారు. అలాగే సీసీఆర్టీ కార్డు ఉన్న ఏ రైతు కుటుంబానికైనా సరే ఒక్క కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందలేదని మీరు మా దృష్టికి తీసుకురాగలరా?. దానిపై మాట్లాడకుండా రకరకాల వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజలు మీ కథనాలు చూసి ఈసడించుకుంటున్నారని గ్రహించండి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం ఇస్తున్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ. 5 లక్షలు ప్రకటించి..ఇందులో అప్పులవారికి రూ.1.50 లక్షలు ఇచ్చి..రూ.3.50 లక్షలు తహశీల్దార్ జాయింట్ అకౌంట్‌లో పెట్టి దానికి సంబంధించిన వడ్డీని వాడుకున్న పరిస్థితి ఉండేది. ఈ రోజు మా ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన రూ.7 లక్షలు వెంటనే బాధిత కుటుంబానికి చెల్లిస్తున్నాం. మీరు ఆ విధంగా కాకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే..ఇది రైతు ఆత్మహత్య కాదు అంటూ అనర్హులుగా ప్రకటించారు. నిజంగా నష్టపోయిన రైతులను కూడా అనర్హులుగా ప్రకటించి ఆ కుటుంబాలకు ద్రోహం, అన్యాయం చేశారు. ఇది జగమెరిగిన సత్యం. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో రైతులు బోర్లువేసుకోవడం, వాటిలో నీరు రాకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే వారు. అటువంటి పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు అప్పట్లో రూ.5 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని అనర్హులుగా ప్రకటించేవారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో నిజంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించేందుకు విచారణ చేపట్టారు. 471 మంది రైతులు నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ప్రభుత్వమే ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 21.35 కోట్లు చెల్లించింది. ఇది వాస్తవం కాదా? ఇదే పత్రికలు, ఇదే దత్తపుత్రుడు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. ఈ రోజు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా..రైతుల వద్ద సీసీఆర్‌సీ కార్డు లేకపోయినా వైయస్‌ఆర్ బీమా పథకం కింద రూ.1 లక్ష ఇవ్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఎలా చేయాలనే అంశంపై దృష్టి పెట్టాం. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రకరకాల రాతలు రాస్తూ ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలను వక్రీకరించేవిధంగా ఉన్నాయి. లేనిపోని వాటిని అంటకట్టే విధంగా ఈ రోజు ఓ వర్గం మీడియా, ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
కొన్ని పేపర్లు క్రాప్ హాలీడే అని కథనాలు రాశాయి. అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చాం. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు. మీ హాయంలో వందలాది కరువు మండలాలుగా ప్రకటించారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలు ప్రకటించారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక కరువు మండలాలుగా ప్రకటించే అవకాశం రాలేదు. ప్రకృతి సహకరిస్తోంది. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు కళకళలాడుతున్నాయి. ముందుగానే నీళ్లిస్తున్నాం. నీళ్లిస్తున్నామనగానే క్రాప్ హాలీడే గురించి మాట్లాడారు. ఏదో ఒక విధంగా రైతులను మభ్యపెట్టాలని, రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా కూడా ఏ రోజు కూడా రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆలోచించలేదు.
రైతులకు సంబంధించి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం రూ.5,500 బటన్ నొక్కి డబ్బులు విడుదల చేస్తే ఇంత మంది రైతులకు మేలు జరిగిందని చెప్పాల్సిన పత్రికలు ..కుర్చీలు ఖాళీ అయ్యాయని తప్పుడు రాతలు రాస్తున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు. మా ప్రభుత్వం అలా చేయలేదే. ఆ ప్రభుత్వానికి మద్దతిచ్చిన దత్తపుత్రుడు ఎందుకు రుణమాఫీ చేయలేదని ప్రశ్నించలేదే? అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు.