– ఓడిన ఎమ్మెల్యేల కక్కుర్తి పనులు
– ఎమ్మెల్యే ఆఫీసుల ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన లేకితనం
– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ఆఫీసులోనూ ఇదే తీరు
– పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఓయు విద్యార్ధులు
– నల్గొండ మాజీ ఎమ్మెల్యేల ఆఫీసులలో ఫర్నీచర్ మాయం
– గతంలో స్పీకర్ ఆఫీసులో ఫర్నీచర్ తరలించుకున్న కోడెలపై కేసు
– ఆయన తనయుడి ఆఫీసుకు ఫర్నిచర్ తరలించిన వైనం
– కోట్లు సంపాదించినా ఈ కక్కుర్తి ఎందుకంటూ సోషల్‌మీడియాలో విసుర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కక్కుర్తికి ఫ్యాంటూ షర్టూ వేస్తే వారు కొందరు మాజీ ఎమ్మెల్యేలవుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేలు తమ కార్యాలయాలకు ప్రభుత్వం ఇచ్చిన ఫర్నీచర్‌ను ఎత్తుకెళ్లిన లేకితనం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ విధులు నిర్వహించిన ఆఫీసు ఫర్నీచర్‌ను ఎత్తుకెళుతుంటే, ఓయు విద్యార్ధులు దానిని అడ్డుకుని పోలీసులకు అప్పగించిన వైనం.. మాజీల కక్కుర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అసలు నల్లగొండ జిల్లాలో అయితే.. మాజీల ఆఫీసులలో ఫర్నీచర్ మొత్తం కాకులు ఎత్తుకెళ్లాయట. ఆ వింతలూ, విచిత్రాలేమిటో చూద్దాం రండి.
వారంతా ఎమ్మెల్యేలు. నెలకు జీతం అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు. ఓడిపోతే వచ్చే పెన్షన్ నెలకు 50 వేల రూపాయలు. ఇక బతక నేర్చిన ఎమ్మెల్యేల సంపాదనకయితే లెక్కాపత్రం ఉండదు. అంటే రియల్ ఎస్టేటూ, భూముల సెటిల్‌మెంట్ లాంటివన్నమాట. నియోజకవర్గ పరిథిలోని సీఐ, ఎస్‌ఐ, ఎమ్మార్వో, డీఎస్పీ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్సు అధికారుల బదిలీలు- పోస్టింగులలో పిండుకున్న వారికి పిండుకున్నంత.
ఇవి కాక నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో పర్సంటేజీ సప‘రేటు’. తమ నియోజకవర్గాల పరిథిలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, అక్కడి ఎమ్మెల్యేలకు ముడుపులు పువ్వుల్లో పెట్టి సమర్పించుకోవలసిందే. లేకపోతే ఎమ్మార్వోలు రంగంలోకి దిగిపోతారంతే! ఇసుక-క్వారీ-మైనింగులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలకయితే పండేగ పండగ. ఇక సర్కారు స్కీములు.. అంటే దళితబంధు, డబుల్‌బెడ్‌రూముల వంటి పథకాల్లో కమిషన్లు సరేసరి. ప్రభుత్వ స్కీముల్లో కొందరు ఎమ్మెల్యేలు, కమిషన్లు తీసుకుంటున్నారని స్వయంగా నాటి సీఎం కేసీఆర్, తన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఈరకంగా ‘నాలుగు చేతులా’ అలుపూ సొలుపూ లేకుండా, యమకొట్టుడు కొడుతున్న ఎమ్మెల్యేలకు ఇదేం లేకితనం? ఇదేం కక్కుర్తి? ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులలో, ప్రభుత్వం ఇచ్చిన ఫర్నీచర్లు కూడా ఎత్తుకె ళ్లే లేకితనాన్ని ఏమనాలి? వందలకోట్లు సంపాదించినా.. 15 లక్షల ఖరీదయ్యే ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన ఈ ‘‘కక్కుర్తి వికాస్ ఎమ్మెల్యేల కాఫీక్లబ్’’లోకి వెళదాం రండి.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో, అందరికీ వారి నియోజకవర్గాల్లోనే క్యాంపు ఆఫీసులు ప్రభుత్వ ఖర్చుతో నిర్మించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనలకు వెళ్లినప్పుడు, వారు హోటళ్లు-ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లో ఉండకుండా, క్యాంపు ఆఫీసులోనే ఉండే విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. ఆ మేరకు ప్రభుత్వ నిధుల నుంచి, దాదాపు 20 లక్షల వరకూ మంజూరు చేసి ఫర్నీచర్ కొనుగోలు చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ సొంత ఖర్చుతో, ఎమ్మెల్యే ఆఫీసులలో మరింత మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసుకున్నారు.
నిజానికి ఈ ఫర్నీచర్ ప్రభుత్వ సంపద. ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓడినప్పటికీ, తర్వాత వచ్చే ఎమ్మెల్యేలు వాటిని ప్రజావసరాల కోసం వినియోగించుకుంటారు. ఆ ఫర్నీచర్ కూడా అక్కడే స్థిరంగా ఉంచాలి. కానీ ఇటీవలి ఎన్నికల్లో ఓడిన కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. ఫలితాలు వెలువడుతున్న సమయంలో, వాటిని తరలించుకుపోవడం సంచలనం సృష్టించింది. మంత్రిగా చేసిన శ్రీనివాసగౌడ్ ఆఫీసులో, ఫర్నీచర్‌ను తరలించుకునే ప్రయత్నం జరిగింది.
ఆ సమాచారం ముందుగా తెలుసుకున్న ఓయు విద్యార్ధులు, రవీంద్రభారతిలోని ఆయన ఆఫీసు వద్ద మాటు వేశారు. సరిగ్గా కొందరు వ్యక్తులు పైకి వెళ్లడం, ఫర్నీచర్‌ను లారీల్లో ఎక్కించే సమయానికి ఓయు విద్యార్ధులు అడ్డుపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి ఫర్నీచర్ తరలింపును అడ్డుకున్నారు. అయితే మంత్రి శ్రీనివాసగౌడ్ చెబితేనే తాము ఫర్నీచర్ తీసుకువెళుతున్నామని వారు చెప్పడం ప్రస్తావనార్హం.
తాజాగా నల్లగొండ జిల్లాలో అయితే ఈ లేకితనం వికృతరూపం దాల్చింది. మొత్తం 12 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులలోని ఫర్నీచర్‌ను కాకులు ఎత్తుపోయాయట. ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ డీఈ సురేంద్రకుమార్ స్వయంగా వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే ఆఫీసులలో ఫర్నీచర్లు మాయమయ్యాయి. ఈ విషయాన్ని మేం మాజీ ఎమ్మల్యేలు, వారి పీఏలకు సమాచారం ఇచ్చామ’ని ఆయన వెల్లడించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆఫీసును తనిఖీ చేసిన సందర్భంలో, ఈ ఫర్నీచర్ మాయం బట్టబయలయింది.
ఇక బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ భవనంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఆఫీసులు ఉన్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రెండు ఆఫీసులలో.. ఒక ఆఫీసు నుంచి ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫైళ్లను తరలించేందుకు చేసిన ప్రయత్నం మీడియాలో వెలుగుచూసింది. అక్కడికి మీడియా వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు, వాటిని అక్కడే వ దిలేసి పరారయిన వైనం సంచలనం సృష్టించింది.
పశసంవర్ధక శాఖలోని ఫైళ్లు కూడా మాయమైన ఘటన వివాదమవుతోంది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఆ శాఖ ఓఎస్డీ కల్యాణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు అంతకుముందు టూరిజం శాఖ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంపై, భారీ అనుమానాలు తెరపైకి వచ్చాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీఐ జాతీయ నేత నారాయణ, ఇది ఫైళ్లను కాల్చేందుకు జరిగిన కుట్ర అని ఆరోపించారు. అయితే.. ఫర్నీచర్ ఖరీదును సదరు ఎమ్మెల్యేల పెన్షన్లలో రికవరీ చేసే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ పనిచేస్తారా అన్నదే ప్రశ్న.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కార్యాలయ ఫర్నీచర్‌ను, అమరావతికి తరలించారు. అయితే ఆ ఫర్నీచర్ అంతా అమరావతిలోని అసెంబ్లీకి చేరలేదు. వాటిని నాటి స్పీకర్ దివంగత కోడెల తనయుడి భవనంలో ఉంచారు. ఆ విషయం కొన్నేళ్లపాటు రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వెలుగుచూసింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఫర్నీచర్ ఎత్తుకెళ్లలేదని, వాటిని తన కుమారుడి భవనంలోనే ఉంచానని ఆయన మీడియాకు వెల్లడించారు. అవసరమైతే దాని ఖరీదు ఎంతో చెబితే తాను చెల్లిస్తానని, గతంలో కూడా అలా జరిగిందని ఆయన చెప్పారు.
దానిపై ప్రభుత్వం కేసు పెట్టింది. కోడెల తనయుడు శివరామ్ షోరూంలో దాచిన 20 కుర్చీలను స్వాధీనం చేసుకుంది. మళ్లీ ఆ కేసు ఏమైందో తెలియదు. తర్వాత తనయుడికి చెందిన షోరూమ్‌పైనా కేసులు నమోదు చేశారు. ఉద్యోగాలు-కాంట్రాక్టులు ఇప్పిస్తామని.. తమ వద్ద కోడెల తనయుడు శివరాం డబ్బులు తీసుకున్నారంటూ, రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు కేసులు పెట్టారు. ఇందులో దాదాపు అన్ని కేసుల్లోనూ శివరామ్‌కు బెయిల్ వచ్చింది. అందరినీ వేధించి, వెన్నాడే అలవాటున్న జగన్ సర్కారు ఈ విషయంలో మాత్రం కనికరించడమే ఆశ్చర్యం. అది వేరే విషయం.
ఈ ఘటనలు కొన్ని దశాబ్దాల నుంచి, కష్టపడి సంపాదించుకున్న కోడెల ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. తర్వాత ఆయన తనయుడికి సంబంధించిన భవనాల్లో, ప్రభుత్వ ఆఫీసులను అధిక మొత్తం చెల్లించి అద్దెలకు ఇవ్వడం కూడా వివాదం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత దాదాపు అలాంటి సన్నివేశాలే, తెలంగాణలో దర్శనమివ్వడం ప్రస్తావనార్హం.
అయితే ఈ కక్కుర్తి పనులపై సోషల్‌మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘ఒకటి రెండు తరాలు తిన్నా తరగ ని ఆస్తులు ఉంచుకుని ఏమిటీ లేకిపనులు?’.. ‘ఎంత తింటారు? అవి మీకు అరుగుతాయా?’… ‘మీరు తినేది అన్నమేనా? లేక డబ్బులా?’.. ఎవరెంత సంపాదించినా చివరకు ఏమీ వెంట తీసుకువెళ్లరు కదా? మరెందుకీ ఆత్రం’.. అంటూ రిన్ సబ్బుతో వారి లేకితనాన్ని కడిగిపారేస్తున్నారు. ఏం చేస్తాం?… కొన్ని జీవితాలంతే!