Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలి

-ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలి
– వైసీపీ నాయకుల స్వార్థచింతన వల్ల రాయలసీమ నష్టపోయిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
– జేఏసీ ముసుగులో వైసీపీ నాయకుల రాజకీయ కుట్రల్ని భగ్నం చేయాలి
– మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ వికృత రాజకీయ క్రీడలకు అంతులేకుండాపోతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకొమ్మని, అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు పెద్దపీట వేయమని ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబితే… ఈ మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా అభివృద్ది కార్యక్రమాలు చేయలేదు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు విభజన రాజకీయాలు చేస్తున్నారు. అధికారంలో ఉండేవారే ఆందోళనలు చేస్తున్నారు. అధికారంలో ఉండేవారే ఆందోళన చేయడమంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లు అవుతుంది. రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారాలు, అవకాశమిస్తే ఆ అవకాశాలను స్వార్థానికి మార్చుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధికారంలో ఉండి రాయలసీమకు అన్యాయం జరిగిందని ర్యాలీ చేయడం, ఆక్రోశాన్ని వెళ్లగక్కడం జరుగుతోంది.

1937లో శ్రీ బాగ్ ఒడంబడిక అమలు జరగడంలేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ ఒప్పందంలోని అంశాలను అమలు చేయొద్దని ఎవరూ అనలేదు. ఎవరు అభివృద్ధి నిరోధకులుగా మారారో ప్రజలు గ్రహిస్తున్నారు. టీడీపీ హయాంలో రాయలసీమకు న్యాయం చేశాం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ ను అభివృద్ధి చేయొద్దని ఎవరూ చెప్పలేదు. సామాజిక పెద్దలే ప్రభుత్వ స్థానాల్లో ఉండి రాయలసీమ పట్ల హీనంగా వ్యవహించారు. అధికారం వైసీపీ చేతుల్లోనే ఉంది. అభివృద్ధి చేయాల్సింది మీరు. దాన్ని విస్మరించి కొత్తగా ప్రాంతీయ విబేధాలు, విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

మేధావుల ముసుగులు జగన్ జీతగాళ్లు ఉన్నారు. సీఎం రాయలసీమ వాసులుగా ఉండి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టు పనులు పడకేశాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే అభివృద్ధి జరగదు అనే విషయం వైసీపీ నాయకులకు తెలియదా? ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు జగన్ ను రాయలసీమను అభివృద్ధి చేయండని ఎందుకు అడగలేదు. రాయలసీమ మొత్తం మీ ఆధిపత్యంలోనే నడుస్తోంది.

కడపలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనంతపురంలో వెంకటరామిరెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారే.. జగన్ ను ఎందుకు అడగరు? అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకునే వ్యక్తి చంద్రబాబు. ఆ వికేంద్రీకరణలో అభివృద్ధి ఉండాలి. చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో రూ.10,747 కోట్లు ఖర్చు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమ గొంతు కోశారు. జగన్ కు చెందిన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. కేసీఆర్ తో అంటకాగుతూ రాయలసీమకు తీరని ఇబ్బందులు సృష్టించారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాయలసీమను నాశనం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ఇలా ఎంతకాలం మోసం చేస్తారు?

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం వైసీపీది. అలా రాయలసీమ పేరు చెప్పి పేదరికాన్ని చూపి సొమ్ము చేసుకుంటున్నారు. తర తరగాలుగా రాయలసీమను దోచుకుతింటున్నా ఇంకా మీ కడుపు నిండలేదా? రాయలసీమను వైసీపీ నాయకులు బంగారు బాతులా మార్చుకున్నారు. పేదరికాన్ని రూపుమాపలేదు. సాగు, తాగునీటి వసతి కల్పించలేదు. గంపగుత్తగా ఓట్లేసి గెలిపిస్తే వారి మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఇది న్యాయమా? తాత, తండ్రులు అనేక దశాబ్దాలుగా రాయలసీమ పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. జగన్ కూడా అదే పద్దతిని అవలంబిస్తున్నారు. రాయలసీమ గొంతు కోస్తున్నారు.

రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడక పూర్వం ప్రజల్లో అక్షరాస్యత తక్కువగా ఉండేది. పరిణామాలపట్ల ప్రజలకు అవగాహన లేదు, కమ్యునిస్టు పార్టీల పట్ల ప్రజలు మొగ్గు చూపేవారు. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నుంచి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రాయలసీమకు మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో శ్వేతపత్రం విడుదల చేయాలి. హంద్రీనీవాకు రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టాం.

ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి పూనుకోవడంలేదు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు. జగన్ ను ప్రజలు రాయలసీమ ద్రోహిగా చూడాలి. మూడు రాజధానుల కోసం రాయలసీమను ఎరగా, బూచిగా చూపుతున్నారు. దీన్ని అందరూ నిలదీయాలి, ప్రశ్నించాలి. కుహనా మేధావులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ఎవరు కూడా రాయలసీమ ప్రయోజనాలను కాపాడలేరు. రాయలసీమకు న్యాయం జరిపించలేరు.

కేవలం అది చంద్రబాబునాయుడుతోనే సాధ్యం. రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చెందడానికి బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలి. ప్రస్తుతం రైతులకు రాయితీతో బిందు సేద్య పరికరాలు సరఫరా చేయలేదు. మూడేళ్లుగా ఆపేశారు. మొన్ననే ప్రారంభించామని చెబుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ను తూ తూ మంత్రంగా అమలు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సొంతంగా డ్రిప్ పరికరాలు రైతులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలు వైసీపీ నాయకుల తలకెక్కడంలేదా?

గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను వైసీపీ అమలుపరచడంలేదు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదు. రాయలసీమ దుర్బిక్ష నివారణా పథకం ఏమైందో తెలపాలి. దానికి కోటి రూపాయలైనా ఖర్చు చేశారా? పథకాలను ప్రచారంలో పెడుతున్నారేగాని డబ్బులివ్వడంలేదు. అవి కాగితాలకే పరిమితమౌతున్నాయి. మధ్యలో అభివృద్ధి పనులు నిలిచిపోయిన వాటిని పూర్తి చేయడంలేదు. వైసీపీ పాపాలవల్ల, స్వార్థ చింతన వల్ల రాయలసీమ ఎంత నష్టపోయిందో మేం ప్రజలకు తెలియజేస్తాం. అన్ని వర్గాల ప్రజలను సమాయాత్తం చేస్తాం. పురుషోత్తమరెడ్డి లాంటి కొంతమంది కుహానా మేధావులు, జగన్ జీతగాళ్లు వైసీపీ పంచన చేరి సాగిస్తున్న దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతాం. వీళ్ల కుట్రలను బద్దలు కొడదాం… జగన్ కు బుద్దిచెబుదాం. జరుగుతున్న పరిణామాలు, జేఏసీ ముసుగులో వైసీపీ నాయకులు సాగిస్తున్న దుర్మార్గాలపట్ల రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

LEAVE A RESPONSE