– నిపుణుల కమిటీ నియామకం
– నాలుగు నెలల్లో రిపోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది.
కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.
మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది.
మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువు విధించింది.