Suryaa.co.in

Editorial

కమలం.. హస్తం.. మధ్యలో ‘విలీన’ షి‘కారు’

– ‘విలీన’బంధంలో బీఆర్‌ఎస్
– బీజే పీలో విలీమనంటూ కాంగ్రెస్ ఆరోపణలు
– కాంగ్రెస్‌లో కలుస్తుందంటూ బీజేపీ జోస్యం
– నడుమ నలుగుతున్న బీఆర్‌ఎస్
– తిప్పికొట్టలేని నిస్సహాయత
– కేసీఆర్ మౌనం
– ‘గులాబీ’దళంలో గందరగోళం
– ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీఆర్‌ఎస్
– హామీలపై జనంలో మొదలైన అసంతృప్తి
– గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ పునరాలోచన
– కాంగ్రెస్‌పై తొలగుతున్న భ్రమలు
– మధ్యలో నిలిచిపోయిన బీఆర్‌ఎస్ వలసలు
– విలీనం పుకార్లతో మళ్లీ బలహీనం
– కవితకు బెయిలే అసలు కారణం
– బీఆర్‌ఎస్ బయటపడేదెలా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

కేవలం కేసీఆర్ కూతురు కవిత బెయిల్ వ్యవహారం ఇప్పుడు బీఆర్‌ఎస్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఆమె బెయిల్ కేంద్రంగా అటు కాంగ్రెస్-ఇటు బీజేపీ గులాబీదళాన్ని నిర్వీర్యం చేసేందుకు కారణమవుతున్నాయి. ఒక్క బెయిల్ వ్యవహారం, బీఆర్‌ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనమవుతుందని బీజేపీ జోస్యం చెబుతుండగా, బీజేపీలో విలీనమవుతుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం, బీఆర్‌ఎస్ నేతలను గందరగోళంలో నెట్టేస్తున్న పరిస్థితి. దీనిని సమర్ధవంతంగా.. నాయకులకు విశ్వాసం కలిగించే స్థాయి తిప్పికొట్టకపోవడమే ఈ అనిశ్చితి-అభద్రతకు కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా కేసీఆర్ మౌనం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది.

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్న సామెత ఇప్పుడు బీఆర్‌ఎస్ విషయంలో నిజమవుతోంది. ఎన్నికల్లో ఓడిపోయి, అధికార వియోగం అనుభవిస్తున్నప్పటికీ, ఇంకా ప్రజల్లో చెక్కుచెదరని అభిమానాన్ని ఒడిసిపట్టుకోవడంలో బీఆర్‌ఎస్ బాసులు విఫలమవుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 150 రోజుల నుంచి ఢిల్లీ తీహార్ జైల్లో మగ్గుతున్న కేసీఆర్ కూతురు కవిత బెయిల్ వ్యవహారం.. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేందుకు కారణమయిన పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేయడం ఆశ్చర్యం. పోరాటాలు, అరెస్టులు, కేసులు కొత్తకాని బీఆర్‌ఎస్.. ఇప్పుడు కేవలం కవిత బెయిల్ పేరుతో, రెండుపార్టీల మధ్య విలీన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవడం వింత. దానిని ఖండించడంతోపాటు.. ఇంకా పార్టీని అంటిపెట్టుకున్న నేతల్లో విశ్వాసం కలిగించలేకపోతున్న, బీఆర్‌ఎస్ బాసుల నిస్సహాయత ఎవరికయినా జాలికలిగించేదే.

నిజానికి చాలామంది ప్రచారం చేస్తున్నట్లు.. రెండు ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నట్లు అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్, అంత బలహీనమైన పార్టీ కాదు. రాజకీ యాల్లో గెలుపు ఓటములు సహజం. ఆమాటకొస్తే అసలు ఆక్సిజన్‌తో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరైనా కలకన్నారా? రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు అందుకోకపోతే కాంగ్రెస్ నుదుట అధికార కళ వచ్చేదా? రేవ ంత్ రె క్కల కష్టం లేకపోతే కాంగ్రెస్ మళ్లీ ఏ పదో, పరకో సీట్లకు పరిమతమతమయ్యేది కదా?
రేవంత్ హామీల ఐడియా లేకపోతే కాంగ్రెస్ నుదుట సౌభాగ్య రేఖ కనిపించేదా? అసలు దేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని సంక్షేమకార్యక్రమాలు కేసీఆర్ చేసినా.. కేవలం కుటుంబపాలన, అహంకారం అనే ముద్ర వల్లే కదా కారు బోల్తా పడి ంది?! అన్నీ తనకు తెలుసనే దొరహంకారం, సహచరులు-అనుచరులకు అపాయింటుమెంట్లు ఇవ్వని అహంకారం-గర్వమే కదా బీఆరెస్‌ను ఓడించింది?! లేకపోతే బీఆరెస్‌ను ఓడించేంత మొనగాళ్లు ఎవరైనా ఉంటారా అన్నది ఇప్పటికీ వినిపించే ప్రశ్న.

రాజకీయాల్లో జయాపజయాలు దైవాధీనాలు. దాన్ని బట్టి పార్టీల భవితవ్యాన్ని అంచనా వేయడం అవివేకం. ఇప్పుడు బీఆర్‌ఎస్ భవిష్యత్తుకు సంబంధించి, కాంగ్రెస్-బీజేపీ అంచనాలు అలాగే కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ కూలిపోతే దానిపై తాను నిలబడాలన్నది బీజేపీ ఆశ. బీఆరెస్‌ను చంపేస్తే మైదానంలో ఒక్క బీజేపీతోనే పోరాడవచ్చన్నది కాంగ్రెస్ కోరిక. ఈలోగా బీఆరెస్ సర్కారు పాపాలపై రేవంత్ సర్కారు విచారణ కమిషన్లు, కేసులు, దర్యాప్తులు ప్రారంభించింది. అది ఈ శతాబ్దానికి తేలే పంచాయితీ కాదు. ఎందుకంటే ఈ దేశంలో కోర్టులు ఇంకా కొంత మేరకు స్వేచ్ఛగానే పనిచేస్తున్నాయి. అంతమాత్రాన బీఆర్‌ఎస్ కన్నుమూసే పార్టీ కాదు. ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేసి, తనువు చాలించే పార్టీ అసలే కాదు.

ఎవరు అవునన్నా, కాదన్నా బీఆర్‌ఎస్‌కు బలం-బలహీనత కేసీఆర్. ఒక పార్టీ ఓడినంత మాత్రాన దాని చరిత్ర ముగిసినట్లు కాదు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్న మూడేళ్లపాటు, టీడీపీ భవిష్యత్తుపై ఇలాంటి అంచనాలే కనిపించాయి. ఇక టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు వయసయిపోయింది కాబట్టి ఇక టీడీపీ దుకాణం సర్దుకుని, బీజేపీలో విలీనం చేసుకోవాల్సిందేనన్న చర్చ జరిగింది. ఒకదశలో టీడీపీని విలీనం చేయనందుకే బాబును అరెస్టు చేశారన్న ప్రచారం జరిగింది. వైసీపీ సైతం.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తున్నారని యాగీ చేసింది. కానీ రెండేళ్లలో టీడీపీ పుంజుకుని మళ్లీ గద్దెనెక్కింది. కారణం టీడీపీకి ఉన్న కార్యకర్తల బలం. నిర్మాణ బలం.

తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా అంతే. కేసీఆర్‌పై నియంత, అహంకారి, అవినీతిపరుడు, బంధుప్రీతి ఎక్కువ అన్న ఆరోపణలున్నప్పటికీ ప్రజల పల్సు బాగా ఎరిగిన నేత. కొన్నిసార్లు ఆయన అహంకారపూరిత అంచనాలు, తనపై తనకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసం, విశ్వసనీయతలోపం వ ల్ల దెబ్బతిన్నప్పటికీ, ఎక్కువసార్లు కేసీఆర్ అంచనాలు నిజమయిన సందర్భాలు లే కపోలేదు. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ తప్ప, బీజేపీ కాదన్నది నిష్ఠుర నిజం. కారణం బీఆర్‌ఎస్‌కు ఉన్న కార్యకర్తల బలం. నడిపించే నాయకులకు కొదువ లేని వాతావరణం.

పైగా పదేళ్ల అధికారంతో డబ్బులకు కొదువలేని పరిస్థితి. పార్టీకి కావలసిన అసలు వనరు అదే. ఆర్ధికంగా బలంగాలేని నేతలకు దన్నుగా నిలిచేంత వెసులుబాటు. కేసీఆర్ బయటకు వస్తే ఇప్పటికీ అదే జనసందోహం. తాజాగా రైతురుణమాఫీపై జరిగిన ధర్నాలకు పోటెత్తిన జన ం. అందుకే బీఆర్‌ఎస్‌కు చావు లేదు. ఆంధ్రాలో టీడీపీ మాదిరిగానే, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు మరణం ఉండదు. దాన్ని ఊహించడం అత్యాశ. కాకపోతే ఆటుపోట్లు ఎక్కువ. భరించి వాటిని ఎదుర్కోక తప్పదు. ఎదుర్కొన్నాయి కాబట్టే నిలబడగలిగాయి. ఎందుకంటే రెండూ కార్యకర్తల మూలాలున్న పార్టీలు కాబట్టి!

అందుకే ఇటీవలి అసెంబ్లీ సమావేశాలు పరిశీలిస్తే.. అధికార పార్టీ కంటే ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పైచేయి సాధించిన వాస్తవం. కాంగ్రెస్ శిబిరంలో రాజు-భటుడు రేవంత్‌రెడ్డే. ఆయనకు దన్నుగా నిలిచే మొనగాడెవరూ లేరు. రేవంత్‌రెడ్డి మాట్లాడితే మాట్లాడినట్లు. లేకపోతే లేదు. పేరుకు పెద్ద తలలు చాలామంది ఉన్నా, బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి ఎవరూ ముందుకురారు.

చివరకు రేవంత్ వ్యూహబృందం కూడా చేతులెత్తేసిన పరిస్థితి. కారణం.. ప్రతిభ కాకుండా, విధేయత ఆధారంగా అందలమెక్కించడం. ఆయన ఎంపిక చేసుకుని పదవులిచ్చిన వారిని చూస్తే అది అర్ధమవుతుంది. కేవీపీ వంటి మేధావి కూర్చున్న సలహాదారు కుర్చీని, కేవలం తన మిత్రుడన్న కారణంగా వేం నరేందర్‌రెడ్డికి కట్టబెట్టారు. వేం నరేందర్‌రెడ్డికి ఉన్న రాజకీయానుభవం ఏమిటి అన్నది కాకుండా, తనకు నమ్మకస్తుడన్న ఏకైక ప్రాతిపదికే ఆయనకు పదవి ఇవ్వడానికి కారణంగా కనిపిస్తుంది. ఇక తన కేసులో బాధితుడైన మరో వ్యక్తికి ఢిల్లీలో ఓ పదవి ఇచ్చారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అర్హులను అందలమెక్కిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది ఆ పార్టీ సీనియర్ల ఉవాచ. కాబట్టి సహజంగానే రేవంత్‌ది ఒంటరిపోరాటం. రేవంత్‌ది పెద్దనోరు కాబట్టి, ఆయన వాక్చాతుర్యమే ఇప్పటికీ కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష.

ఈ పరిస్థితిలో నోరున్న కేసీఆర్, అసెంబ్లీకి హాజరయి ఉంటే బీఆర్‌ఎస్‌ది ఏకపక్షమయ్యేది. కానీ కేసీఆర్ అహంకారం, తాను కూర్చున్న సీట్లో ఉన్న రేవంత్ ఉండటమేమిటన్న దొరహంకారంతో, ఆయన ఆ అవకాశం చేజార్చుకున్నారు. వచ్చే సభలకయినా కేసీఆర్ వస్తేనే ఆయనకు మనుగడ, గౌరవం కూడాను. ప్రజాస్వామ్యంలో వ్యక్తిస్వామానికి కొద్దికాలమే విలువ. వ్యవస్థ కంటే కేసీఆర్ గొప్పకాదు.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ-కాంగ్రెసులో విలీనమవుతుందన్న మైండ్‌గేమ్‌కు ఆ రెండు పార్టీలు బాగా పదును పెడుతుండటం, బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కలవరపరిచే అంశమే. దానికి కారణం కేసీఆర్ కూతురు కవిత బెయిల్ వ్యవహారం. లిక్కరు కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కేసీఆర్ బిడ్డ కవితకు, ఇప్పట్లో బెయిల్ రావడం అసంభవం. ఇదే కేసులో అరెస్టయి, సుదీర్ఘకాలం జైల్లో మగ్గిన ఢిల్లీ ఆప్ మంత్రి సిసోడియాకు మొన్ననే బెయిలొచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. కాబట్టి కవిత మరికొన్ని నెలలు తీహారుకే అంకితం కాకతప్పదు. ఆ విషయం బీఆర్‌ఎస్ బాసులకూ తెలుసు. వారు ఆమేరకు మానసికంగా సిద్ధంగా ఉంటారు. తెలంగాణ ప్రజలు కూడా కవితకు ఇప్పట్లో బెయిలురాదన్న అంచనాతో ఉన్నారు.

అయినా కవిత జైల్లో ఉంటే ఏమవుతుంది? మరికొద్దికాలం తర్వాత బెయిలు ఎలాగూ వస్తుంది. 40 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలలు జైలుశిక్ష అనుభవించారు. జయలలిత, శిబుసోరేన్, లాలూ్రపసాదుదీ అదే పరిస్థితి. దానివల్ల వారి పార్టీలేవీ ఇతర పార్టీల్లో విలీనం కాలేదే? పైగా బయటకొచ్చి అధికారం అనుభవించారు కదా? రేవంత్‌రెడ్డి కూడా జైలుజీవితం అనుభవించిన నాయకుడే కదా? అంతమాత్రాన ఆయన రాజకీయ జీవితం ముగిసిందా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? ఆ విషయం బీఆర్‌ఎస్‌లకు తెలియదా? అంతమాత్రానికే కాంగ్రెస్‌లోనో, బీజేపీలో పార్టీని విలీనం చేసేంత అమాయకులు కాదు కదా?!

కానీ.. విలీనానికి సంబంధించి, కాంగ్రెస్-బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్ ముందు బీఆర్‌ఎస్ ఎదురుదాడి తేలిపోతోంది. పత్రికాప్రకటనలు తప్ప.. తాము ఏ పార్టీలోనూ విలీనం కావడం లేదన్న భరోసా పార్టీ నేతలకు ఇవ్వలేకపోతోంది. కేసీఆర్ కూడా మాట్లాడటం లేదు. ఫలితంగా నేతల్లో గందరగోళం. కేటీఆర్-హరీష్ వంటి పెద్దనోరు నేతలు మాత్రమే గళం విప్పుతున్నారు. మిగిలిన వారిది మౌనరాగమే. అందుకే జాతీయపార్టీల ఆరోపణలు, త్వరగా ప్రజల్లోకి వెళుతున్నాయి.

నిజానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు తిరిగి పునరాలోచిస్తున్న పరిస్థితి. రెండు లక్షల రుణమాఫీ హామీ సగం కూడా అమలుకాని వైనం, రైతుల్లో అసంతృప్తి-ఆగ్రహానికి దారితీస్తోంది. రుణమాఫీపై గులాబీదళాలు స్థానికంగా ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి, ఎంతమందికి మాఫీ అయిందన్న లెక్కలు బట్టబయలు చేసి, ఎదురుదాడి చేస్తుంటే కాంగ్రెస్ సర్కారు నోరెత్తలేని పరిస్థితి. ఎంతమందికి రుణమాఫీ అయిందో గులాబీదళాలు చిట్టా విప్పతుంటే అది అబద్ధమని, నిజాలు చెప్పలేని నిస్సహాయత అధికార పార్టీది. ఇది కాంగ్రెస్‌ను బాగా డామేజీ చేస్తోంది.

రుణమాఫీలో కాంగ్రెస్ ఎంత మైలేజీ పొందిందనేది పక్కనపెడితే, అంతకుమించిన వ్యతిరేకత మూటకట్టుకుందన్నది నిజం. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గంపగుత్త మెజారిటీ అందించి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కిన తీరు చూస్తే.. బీఆర్‌ఎస్‌ను అంత తక్కువగా అంచనా వేయడం అవివేకమే అవుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో, పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

మొన్నటివరకూ మౌనంగా ఉన్న ఉద్యోగ సంఘాలు మళ్లీ పిడికిలి బిగిస్తున్నాయి. రైతుభరోసా, నిరుద్యోగభృతి, మహలక్ష్మి పథకంపై ప్రజల్లో ప్రశ్నలు ప్రారంభమవుతున్నాయి. ఒక్క ఉచిత బస్సు పథకం తప్ప, మిగిలినవేమీ కాంగ్రెస్ సర్కారుకు కలసిరావడం లేదు. నిధులు లేక పంచాయతీలు పడకేశాయి. జిల్లాల్లో ఆసుపత్రులకు సూదులు, గోలీలు లేవు. కారణం ఆర్ధిక సంక్షోభం. కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు. ఎంపిక చేసుకున్న వారికి అది కూడా 7-8 శాతం కమిషన్లపై ఇస్తుస్తున్నారన్న ప్రచారం బాగా ఉంది. ఈ పరిస్థితిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జైకొట్టిన జనం, తిరిగి బీఆర్‌ఎస్ గురించి ఆలోచిస్తున్న పరిస్థితి.

ఈ సమయంలో కేవలం తన బిడ్డ బెయిలు కోసం, పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేసే అమాయకుడా కేసీఆర్? ఇవన్నీ బీఆర్‌ఎస్ స్థానం ఆక్రమిద్దామని బీజేపీ.. కారును పూర్తిగా షెడ్డుకు పంపించాలన్న కాంగ్రెస్ మైండ్‌గేమ్ కాక మరేమిటి? కాకపోతే విలీనంపై కేసీఆర్ ఇప్పటివరకూ మౌనం వహించడమే ఈ గత్తరకు అసలు కారణంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE