తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపి కంభంపాటి రామమోహన్ రావు 40వసంతాల రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన‘‘ నేను-తెలుగుదేశం’’ పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం 5గం కు హైదరాబాద్(జూబ్లీహిల్స్) దసపల్ల హోటల్ లో జరుగుతుంది.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా రాజ్యసభ స్థాయికి చేరుకున్న రామమోహన్ రావు రాజకీయ జీవితం విశేషాలను ఇందులో పొందుపరిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుల సారథ్యంలో టిడిపిలో చోటుచేసుకున్న పరిణామాలు, టిడిపి ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటాల గురించి వివరించారు.
కోర్టు కేసులతో ఎన్టీఆర్, చంద్రబాబులను చికాకు పర్చడం ద్వారా టిడిపి పాలన కొనసాగనీకుండా అవాంతరాలు సృష్టించడం, వాటిని సమర్ధంగా ఎదుర్కొన్న విధానం, ఎన్టీఆర్ ఆస్తుల ధ్వంసం, చంద్రబాబుపై అసత్య ఆరోపణలు, అలిపిరి ఘటన, రాష్ట్ర విభజన పూర్వాపరాల గురించి ప్రస్తావించారు.
ప్రచార కార్యదర్శిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, జాతీయ అధికార ప్రతినిధిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చేసిన కృషి, రాజ్యసభ సభ్యునిగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి ఇందులో పేర్కొన్నారు.
టిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవానికి ముందురోజున కంభంపాటి రామమోహన్ రావు‘‘నేను –తెలుగుదేశం’’ పుస్తకావిష్కరణకు హైదరాబాద్ వేదిక కావడం విశేషం.