Suryaa.co.in

Editorial

ఇక కంచి.. శృంగేరీ.. హంపీ..పుష్పగిరి స్వాములే మిగిలారు!

– వారూ ‘జే’ టీములో చేరితే ఇక జగనన్న పదహారణాల హిందువే
– జగన్ హిందూటీమ్‌లో మరో జగద్గురువు గణపతి సచ్చితానంద
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగనన్న హిందువు కాదు. క్రిస్టియను అని తెగ ప్రచారం చేస్తున్న బీజేపీ దాని హిందూ పరివారానికి ఇదో చెంపదెబ్బ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, గణపతి అవతారంలో నేలమీద తిరగాడుతున్న శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చితానంద స్వామి వారు, జగనన్న హిందుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. జనరల్‌గా సినిమాలకు సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ కావాలి. కానీ ఇప్పటి కుల-మత రాజకీయాలకు స్వాములోర్ల సర్టిఫికెట్ అనివార్యమయింది. ఆ సంప్రదాయంలో భాగంగా, ఏపీ సీఎం జగనన్నకు సచ్చితానందుల వారు ‘పదహారణాల హిందువు. ఆయన ఆధ్వర్యంలో మాత్రమే హిందుత్వానికి రక్షణ సాధ్యమన్న’’ సర్టిఫికెట్ ఇచ్చేసిన తర్వాత కూడా… జగనన్న క్రిస్టియను, ఆయన క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తున్నారని యాగీ చేస్తే, కళ్లు సీమటపాసుల్లా పేలిపోతాయ్.
జగన్ హిందువా? క్రైస్తవుడా అన్నది జనాలకు అనవసరం. గత ఎన్నికల్లో జనం అదేమీ చూడకుండానే జగనన్నను జైకొట్టారు. కాకపోతే.. విశాఖ స్వాములోరు, పింక్ డైమండ్ రమణదీక్షితులూ.. ఇతర బ్రాహ్మణ సంఘాల ఎక్స్‌ట్రా పాత్రలతో, జగనన్న హిందువేనన్న భావన కలిగింది. కల్పించారు కూడా! అంటే జగనన్నను మెడలో శిలువ చైను ఉండగనే, విశాఖ స్వాములోరు నదిలో మునకలు వేయించడం, పుష్కరస్నానాలు చేయించడం లాంటివన్నమాట. అటు బీజేపీలో ఉన్న సుబ్రమణ్యస్వామి అనే పెద్దనోరు స్వామి కూడా.. అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ ఫక్తు హిందువేనని సర్టిఫై చేశారు. అఫ్‌కోర్స్.. ఐ.వై.ఆర్.కృష్ణారావు వంటి మేధావుల శ్రమదానం కూడా అందులో ఉందనుకోండి. అది వేరే విషయం. ఇంతమంది మహానుభావులు, హిందూ ధర్మరక్షకులు సర్టిఫై చేసిన తర్వాత.. ఇక జగనన్న హిందువు కాకపోతారా? చెప్పండి! మీ చాదస్తం కాకపోతే!!
ఏమాటకామాట. జగనన్న హిందువుల హృదయాల్లో ఏసుప్రభువు శిలువ మాదిరిగా నిలిచిపోవటానికి, శ్రమదానం చేసింది మాత్రం విశాఖ స్వాములోరే. పాపం ఆయన చేసిన కాయకష్టం, పోసిన తపశ్శక్తుల కారణంగానే జగనన్న సీఎం అయ్యారు. స్వాములోరికి జగనన్న అంటే ఎంత ఇష్టమంటే, ముద్దుపెట్టుకునేంత! కాబట్టి జగనన్నకు విశాఖకు జగన్గురువు-జగద్గురువుగా మారడంలో తప్పులేదు. దానికి ఆయన ఆశ్రమం వద్ద ఎన్ని పోలీస్ అవుట్‌పోస్టులు పెట్టినా, ఎంతమంది గన్‌మెన్లు ఇచ్చినా, ఎంతమందిని ఎస్కార్టుగా.. ఎండోమెంటుశాఖను ఆయనకు ధారాదత్తం చేసినా తక్కువే అవుతుంది.
ఇహ తాజాగా పొడువు గడ్డం సచ్చితానందస్వామి కూడా, జగనన్న హిందూ టీములో చేరడం శుభ పరిణామమే. ఇప్పటి దాకా ఈ స్వాములోరు ఎక్కడా సీనులో కనిపించలేదు. ఆంధ్రాలో విశాఖ స్వాములోరు, తెలంగాణలో జీయరు స్వాములోర్లు మాత్రమే, ‘జే టీము’లో ఉన్నట్లు భక్తులకు తెలుసు. కానీ మధ్యలో కొత్తగా సచ్చితానందుల వారి ఎంట్రీనే హాశ్చర్యం. జగనన్నను ఆయన నిండుమనుసుతో ఆశీర్వదించటడం హిందువులందరికీ పండుగే.
‘‘జగన్ ఏపీలో దేవాలయాల అభివృద్ధికి నిద్రలేకుండా పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు కూడా పరమానంద భరితులవుతున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు జగన్ కట్టుబడి ఉన్నారు. ఆ మేరకు ఆయన కంకణాలు-కడియాలు కట్టుకున్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలన్నదే జగన్ లక్ష్యం’’ అని మీడియాతో ముచ్చటించిన సందర్భంలో,స్వాములోరి కళ్లలో గిర్రున తిరిగిన ఆనందభాష్పాలొక్కటి చాలు.. జగనన్న అంటే ఆయనకెంత ప్రేముందో చెప్పడానికి! కానీ ఇంత ఆనందోత్సవాల్లో కూడా జగనన్న అభిమానులకు ఒకటే లోటు. స్వరూపానందుల మాదిరిగా, సచ్చితానందుల వారు కూడా జగనన్నను దగ్గరకు తీసుకుని.. ముద్దుపెట్టకపోవడమే జగనన్న అభిమానులను నిరాశపరిచింది.
ఇంతకూ అసలు మున్నెన్నడూ తెరపైకి రాని సచ్చితానందుల వారు.. ఇంత హటాత్తుగా స్క్రీనుపైకి వచ్చారేమిటి చెప్మా అన్నది చాలామంది ఆశ్చర్యం. సచ్చితానందుల వారు ‘సంఘ్’ జీవులతో అత్యంత సన్నిహితంగా ఉంటారట. కర్నాటకలో ‘సంఘ’జీవులతో ఆయనకున్న కనెక్షన్లు ఆలస్యంగా గుర్తించిన జగనన్న విధేయ బృందం, ఇప్పుడు అట్నుంచి నరుక్కువచ్చిందన్నది ఒక టాక్. కర్నాటకలో మఠాలు ఒక్కో పార్టీకి అంకితమయి ఉంటాయన్నది బహిరంగ రహస్యం. అందులో భాగంగా సచ్చితానంద పీఠానికి.. బీజేపీతో ‘ఫెవికాల్ బంధము’న్నట్లు తెలుసుకున్న వైసీపేయులు, బెజవాడలోనే ఉన్న ఆయన ఆశ్రమానికి, జగనన్నను తీసుకువెళ్లార న్నది మరో ప్రచారం. నిజం జగన్నాధుడెరుక? బీజేపీలో రాజకీయ బంధాల కన్నా, స్వాముల బంధానికే ఎక్కువ విలువ ఉండటంలో, జగనన్న-సచ్చితానందన్న భేటీ వర్కవుటయినా ఆశ్చర్యం లేదు.
స్వాములు కూడా తమకు సాష్టాంగపడిన వారినే ముచ్చటపడుతుంటారు. వారికదో తుత్తి. ఈ లాజిక్కు తెలియని చంద్రబాబు, ఎప్పుడూ స్వాముల వద్దకు వెళ్లలేదు. కాళ్లకు మొక్కలేదు. స్వాములొచ్చినా కాళ్లకు సాక్సులతోనే కూర్చునేవారు. కింద కూర్చోలేదు. పైగా వాళ్లు వచ్చినా.. వారిని తన సహజ శైలిలో గంటలపాటు వెయిటింగ్‌లోనే పెట్టేవారు. మొత్తంగా స్వాములకు బాబు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కాబట్టి స్వాములకు సహజంగానే బాబు నచ్చరు. ఆ టెక్సిక్కులన్నీ జగనన్న ప్రయోగిస్తున్నారు కాబట్టే.. స్వాములకు ఆయనంటే ముద్దుపెట్టేంత ఇష్టం. అద్గదీ అసలు సంగతి.
ఓకే. ఓకే. సినిమాల్లో స్టార్‌డమ్ ఉన్నట్లే ఆధ్మాత్మిక శక్తులకూ స్టార్‌డమ్ ఉంటుంది. అంటే మార్కెట్ ఎక్కువగా ఉన్నవాళ్లన్నమాట. కమలానంద భారతీ, శ్రీనివాసానంద లాంటి స్వాములు వారి పని వారు చేసుకుంటారు. హిందూ ధర్మ ప్రచారంలో బిజీగా ఉంటారు. అలాంటి వాళ్లకు పెద్దగా పబ్లిసిటీ ఉండదు. వాళ్లూ కోరుకోరు. కాబట్టి వారిని పొలిటీషియన్లు పెద్దగా పట్టించుకోరు. ఆ ప్రకారంగా స్పిరిట్యువల్ ఫీల్డ్‌లో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖ స్వామి, జీయర్‌స్వామికే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే పొలిటీషియన్లు, ఇండస్ట్రియలిస్టులూ వగైరా అన్నమాట. సీఎంలు, సెంట్రల్ మినిష్టర్లూ వాళ్ల దగ్గరికే ఎక్కువ వస్తుంటారు.
అలాంటి వీవీఐపీలు ఆశ్రమానికి వచ్చినప్పుడే.. ‘మెగా’ ‘మహా’ వ్యాపారులు హటాత్తుగా అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. అలాంటి అద్భుత శక్తులున్న స్వాములిద్దరూ, ప్రస్తుతం జగన్గురువులే. ఆమాట కొస్తే కేసీఆర్‌కూ గురువులే. ఇప్పుడు కొత్తగా బెంగుళూరు సచ్చితానంద స్వామి చేరారు కాబట్టి ‘హిందూ జే టీము’ బలంగా ఉన్నట్లు లెక్క. ఇహ మిగిలిన కంచి, శృంగేరీ, హంపి, పుష్పగిరి స్వాములు కూడా ‘జే టీము’లో చేరితే.. జగనన్న నూటికి రెండువందల శాతం పక్కా హిందువన్నట్లే లెక్క. చివరకు పోప్ పాల్ వచ్చి జగనన్నతో ప్రేయర్ చేయించినా.. హిందువులెవరూ దాన్ని పట్టించుకోరంతే. బాగుంది కదూ!

LEAVE A RESPONSE