Suryaa.co.in

Telangana

దళితులను మరోసారి మోసం చేసినందుకు కేసీఆర్ రాజీనామా చేయాలి

• దళిత బంధు స్కీం నిలిపివేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే కారణం.
• ఎన్నికల కమిషన్ ఈ స్కీంను ఆపేసేందుకు అవకాశం కల్పించేలా కేసీఆర్ వ్యవహరించారు
• ఈసీ ఈ స్కీంను నిలిపేస్తుందని తెలిసి ఈ రోజు మీటింగ్ నిర్వహించి దళిత బంధుపై చిలుక పలుకులు పలికారు
• కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కమిషన్ ఎప్పుడూ నిలిపివేయదు
• కానీ కేసీఆరే ఆ స్కీం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండా చేశారు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యంవల్లే దళిత బంధు’ పథకం నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దళితులను మరోసారి మోసం చేసినందుకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ….ఎన్నికల కమిషన్ ఎన్నటికీ కొనసాగుతున్న పథకాలను నిలిపివేయాలని ఆదేశాలివ్వదని అయితే..కేసీఆర్ కావాలని కుట్ర బుద్దితోనే ఇప్పటిదాకా దళిత బంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులను విడుదల చేయకుండా ఆపారని ఆయన అన్నారు. భారత దేశంలో బ్యాంకులు ఎప్పటికీ లబ్దిదారుల అకౌంట్లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవు.
కానీ కేసీఆర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా దళిత బంధు డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో వేస్తూనే….అదే సమయంలో డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారని అన్నారు. దళిత బంధు ను ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్….ఆ తరువాత మాట మార్చి షరతులు విధించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. బ్యాంకులో పడిన నిధులను లబ్దిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ బీజేపీ మొదటి నుండి డిమాండ్ చేస్తూనే ఉందన్నారు. ఇటీవల జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ కు ఇదే విషయంపై వినతి పత్రం ద్వారా డిమాండ్ చేసిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వక్ర బుద్దితోనే నిధులు డ్రా చేసుకోకుండా ఆపేసిందన్నారు.
కేసీఆర్ ఏదో విధంగా ‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయించి ఇతరులపై ఈ నెపాన్ని నెట్టాలని కేసీఆర్ కుట్ర చేశారని అన్నారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రాబోతున్నాయని ముందే తెలిసి ఈరోజు దళిత బంధుపై సమీక్ష నిర్వహించి చిలుక పలుకులు పలికారని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్దిదారుడికి కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసినప్పటికీ…ఇవాళ మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి దళితులపై మరో డ్రామాకు తెరలేపారని సంజయ్ మండి పడ్డారు.
దళితులను కేసీఆర్ మొదటి నుండి మోసం చేస్తూనే ఉన్నారని… దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. తాజాగా దళిత బంధు స్కీంను నిలిపివేసి మరోసారి దళితులను దగా చేశారని మండిపడ్డారు. తన కపట బుద్ది, నాటకాలతో దళితుల పొట్ట కొడుతున్న కేసీఆర్ కు దళితుల ఉసురు తగులుతుందని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వారు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE