Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుతోనే కాపులకు మేలు

– బీసీ సంక్షే శాఖ మంత్రి సవిత

అమరావతి : కాపు సామాజిక వర్గానికి సీఎం చంద్రబాబునాయుడుతోనే మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గడిచిన అయిదేళ్ల జగన్ పాలనలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.

తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కాపుల అభివృద్ధికి 2014-19 అప్పటి చంద్రబాబునాయుడు అమలుచేసిన పథకాన్నింటినీ తరవాత జగన్ నిలిపేశారన్నారు. కాపు సామాజిక వర్గంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు.

అయిదేళ్లలో చంద్రన్న స్వయం ఉపాధి కింద 50 శాతం సబ్సిడీతో 1,63,081 మందికి రూ.1139.83 కోట్ల మేర రుణ సదుపాయం కల్పించారన్నారు. ఎంఎస్ఎంఈ పథకం కింద 2016-17 సంవత్సరంలో 265 గ్రూపుల్లో 1,060 మందికి రూ.26.50 కోట్లను అందజేశారన్నారు. చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించిన 1,258 విద్యార్థులకు 111.76 కోట్లు మేర ఆర్థిక భరోసా కల్పించామన్నారు.

చంద్రన్న విద్యోన్నతి పథకం కింద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్, ప్రొబేషనరీ ఆఫీసర్లు, బ్యాంకు క్లర్కులు, ఆర్ఆర్ బి, ఇన్స్యూరెన్స్ ఆఫీసర్లు వంటి పోటీ పరీక్షలకు కాపులకు కోచింగ్ అందజేశామన్నారు. 2014-19 మధ్య కాలంలో 40 వేల మందికిపైగా కాపు యువతకు రూ. 35.14 కోట్లతో వివిధ అంశాల్లో శిక్షణ అందజేశామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లా కేంద్రాల్లో కాపు భవన్లు, 421 మినీ కాపు భవన నిర్మాణాలు చేపట్టాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.146.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను నిలిపేసి… నిధుల్ని వెనక్కి తీసుకుందని మంత్రి సవిత తెలిపారు.

జగన్ హయాంలో అన్నింటా కాపులకు అన్యాయం

ఆది నుంచి కాపుల అభ్యున్నతికి చంద్రబాబునాయుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. ఆ తరవాత వచ్చిన జగన్…కాపులను అణదొక్కారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నారు. దీనివల్ల లక్షలాది కాపు యువతకు, విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం కాపులకు ఇవ్వాల్సిన రుణాలను నిలిపేశారన్నారు. ఏటా రూ.2 వేల కోట్ల ఇస్తామని 2019 ఎన్నికల ముందు మాటిచ్చిన జగన్…తరవాత మాట తప్పారన్నారు. ఇలా అన్నింటా కాపులకు జగన్ తీవ్ర అన్యాయం చేశారన్నారు.

కాపులకు మంచి రోజులు…

మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో, కాపులకు మరోసారి మంచిరోజులు వచ్చాయని మంత్రి సవిత తెలిపారు. 2014-19 నాటి పథకాలన్నింటినీ మరోసారి అమలు చేయనున్నట్లు తెలిపారు. గడిచిన ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో ఉన్నారన్నారు.

రాబోయే అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు వెచ్చించడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. కాపు భవనాల నిర్మాణాలతో యువతకు అన్ని విధాలా అండగా నిలిచేలా కార్యచరణ సిద్ధం చేశారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎండీ ఎస్.కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE